Janaki Paati: నా వయసు 82.. మహీ కోసమే ఇక్కడికొచ్చా!

ఐపీఎల్‌లో చాలామంది ఫేవరెట్‌ జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌. ఆ జట్టు ఎక్కడ మ్యాచ్‌లాడినా అక్కడ వాలిపోతుంటారు ఫ్యాన్స్‌. ఇక ఆ జట్టు ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోనీని చూడ్డానికి ఎగబడుతుంటారు. ఇలా టీనేజ్‌ అమ్మాయిలు, అబ్బాయిలే కాదు.. ఓ బామ్మ కూడా మహీకి వీరాభిమానినంటోంది....

Published : 10 Apr 2024 21:00 IST

(Photos : Instagram)

ఐపీఎల్‌లో చాలామంది ఫేవరెట్‌ జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌. ఆ జట్టు ఎక్కడ మ్యాచ్‌లాడినా అక్కడ వాలిపోతుంటారు ఫ్యాన్స్‌. ఇక ఆ జట్టు ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోనీని చూడ్డానికి ఎగబడుతుంటారు. ఇలా టీనేజ్‌ అమ్మాయిలు, అబ్బాయిలే కాదు.. ఓ బామ్మ కూడా మహీకి వీరాభిమానినంటోంది. ఇటీవలే చెపాక్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ను వీక్షిస్తూ ప్లకార్డుల ద్వారా తన అభిమానాన్ని చాటుకుంది. ఇలా స్టేడియంలో ఆమె చేసిన సందడి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ధోనీ కోసమే ఇక్కడికి వచ్చాను.. ఎక్కడిదాకానైనా వెళ్తాను..’ అంటోన్న ఆ బామ్మ అభిమానాన్ని మీరూ చదివేయండి!

చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ఇటీవలే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ జరుగుతున్నంతసేపు అక్కడి కెమెరాలు ఓ బామ్మ చుట్టూనే తిరిగాయి. ఇందుకు కారణం.. ఆమె మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేసిన తీరే! ఆమె పేరు జానకి పాటి.. వయసు 82 ఏళ్లు. ఈ వయసులోనూ స్టేడియంలో నాలుగు అంతస్థుల మెట్లెక్కి తన సీటు వద్దకు చేరుకోవడంతో పాటు యువతతో పోటీపడుతూ మరీ మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేయడం విశేషం! ఇంత పెద్ద వయసులోనూ అంత ఉత్సాహం.. ఎందుకు? అంటే.. అదంతా మహీ కోసమే అంటోందీ జానకి.

మహీ కోసమే..!
చెన్నై మహేంద్ర సింగ్‌ ధోనీకి వీరాభిమాని జానకి. 2004లో మహీ తన క్రికెట్‌ కెరీర్‌ను ప్రారంభించినప్పట్నుంచి.. ఆయన ఆటనే ఆరాధిస్తోన్న ఈ బామ్మ.. ఈ క్రమంలోనే తన మనసుకు ఉల్లాసం, ఉత్సాహం రెండూ దొరుకుతాయని చెబుతోంది. ఇటీవలే జరిగిన మ్యాచ్‌లో ‘నా వయసు 82.. మహీ కోసమే ఇక్కడికి వచ్చాను..’ అనే ప్లకార్డుతో స్టేడియం వెలుపల దిగిన ఫొటోలు, మ్యాచ్‌ ఎంజాయ్‌ చేసిన తీరును వీడియోల్లో బంధించిన ఈ బామ్మ.. వీటిని తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేసింది. వాటితో పాటు ధోనీపై తనకున్న అభిమానాన్ని ఇలా అక్షరీకరించింది.

అప్పుడు సచిన్‌.. ఇప్పుడు ధోనీ!
‘డియర్‌ ధోనీ.. నా పేరు జానకీ పాటి. నా వయసు 82. నేను నీకు వీరాభిమానిని! 40ల్లో కెరీర్‌ పరంగా, ఇల్లు-పిల్లల బాధ్యతలతో చాలా అలసిపోయాను. ఇంత బిజీ లైఫ్‌స్టైల్లోనూ సేదదీరగలిగానంటే అది సచిన్‌ తెందూల్కర్‌ అద్భుతమైన ఆట చూసే! అతడిని ఎప్పటికైనా కలవాలన్నది నా కల! ఇక నాకు 70 ఏళ్ల వయసొచ్చే నాటికి నీ గురించి విన్నా.. ‘ధోనీ తనదైన స్టైల్‌లో మ్యాచ్‌ను పూర్తిచేస్తాడు..’ అని అందరూ అంటుంటే నాలో ఏదో తెలియని ఉత్సాహం కలిగేది.. సంతోషంతో నా మనసు ఉక్కిరిబిక్కిరయ్యేది. మైదానంలో నీ ఆట చూస్తూ నన్ను నేనే మర్చిపోయేదాన్ని.. చూపు తిప్పుకోలేకపోయేదాన్ని. ఇక పోస్ట్‌ మ్యాచ్‌ ప్రజెంటేషన్‌లో నీ మాటలు వింటుంటే ఒక రకమైన భావోద్వేగానికి గురయ్యేదాన్ని.. తాజా మ్యాచ్‌లో భాగంగా నేను నిన్ను ప్రత్యక్షంగా చూసి మరింత ఉద్విగ్నతకు లోనయ్యా.. ఆ క్షణం నా వయసు, అలసట అన్నీ మాయమయ్యాయి.. ప్రత్యక్షంగా నీ ఆటతీరును చూసిన ఈ క్షణాలు నా జీవితాంతం గుర్తుండిపోతాయి.. మర్చిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి..’ అంటూ తన మనసులోని మాటల్ని ఎమోషనల్‌గా బయటపెట్టిందీ బామ్మ.

రియల్‌ ఫ్యాన్‌ మొమెంట్..
ప్రస్తుతం జానకికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలామంది దీనిపై స్పందిస్తున్నారు. ‘ధోనీ ఈ బామ్మను కాఫీకి పిలవాలి.. ఆమె ఆశీర్వాదం తీసుకోవాలి..’ అని ఒకరంటే.. ‘రియల్‌ ఫ్యాన్‌ మొమెంట్.. 82 ఏళ్ల వయసులో నాలుగు అంతస్థులెక్కి E-Stand కు చేరుకోవడం గ్రేట్‌!’ అంటూ మరొకరు కామెంట్‌ చేశారు. ఏదేమైనా ధోనీ పైన ఈ బామ్మ అభిమానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇలా ఇప్పుడే కాదు.. తన ఇన్‌స్టా పేజీలో చాలావరకు క్రికెట్‌కు సంబంధించిన పోస్టులే పెడుతుంటారు జానకి. ఇలా క్రికెట్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.


వ్యాపారంలో రాణిస్తూ..!


ఇలా అభిమానానికే కాదు.. అభిరుచుల్ని నెరవేర్చుకోవడానికీ వయసు అడ్డు కాదని నిరూపిస్తున్నారు జానకి. ముందు నుంచీ వ్యాపారంపై ఆసక్తి ఉన్న ఆమె.. తన మనవడు ఆనంద్‌ భరద్వాజ్‌తో కలిసి ‘స్వీట్‌ కారం కాఫీ’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. ఈ వేదికగా నాటి సంప్రదాయ రుచులు, స్నాక్స్‌, స్వీట్స్‌ని అందరికీ పరిచయం చేస్తున్నారామె. దక్షిణాది వంటకాలు, చిప్స్‌, ఫిల్టర్‌ కాఫీ, హెల్త్‌ మిక్సెస్‌, చక్కెర రహిత స్వీట్లు, మిల్లెట్‌ వంటకాలు, పచ్చళ్లు.. వంటివన్నీ ప్రిజర్వేటివ్స్‌, పామ్‌ ఆయిల్‌ ఉపయోగించకుండా తయారుచేస్తున్నారు. అంతేకాదు.. వీటి కోసం ఉపయోగించే ముడి సరుకులన్నీ తన ఫామ్‌లోనే స్వయంగా, సహజసిద్ధంగా పండించుకుంటున్నారు జానకి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వేదికగా తన ఉత్పత్తుల్ని విక్రయిస్తూ ఎంతోమంది అభిమానాన్ని చూరగొంటున్నారామె. ఇలా తాను తయారుచేసే వంటకాలకు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగానూ అభిమానులున్నారు. తన 82 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తగానూ రాణిస్తోన్న ఈ బామ్మ.. ‘తోటి మహిళలకు ఉపాధి కల్పిస్తూ.. వారి ఆర్థికాభివృద్ధికి పాటుపడడం చాలా సంతోషంగా ఉందం’టున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్