94 ఏళ్ల వయసులోనూ దుమ్ము రేపుతోంది!

కాస్త వయసు పైబడగానే ఇక తమ జీవితంలో సాధించేది ఏమీ లేదని భావిస్తుంటారు కొంతమంది. కానీ, దీనికి భిన్నంగా వయసు కేవలం సంఖ్య మాత్రమే అంటూ ముందుకు సాగుతుంటారు మరికొందరు. ఈ క్రమంలో మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు. హరియాణాకు చెందిన భగ్వానీదేవి దాగర్‌....

Published : 12 Jul 2022 19:32 IST

(Photos: Twitter)

కాస్త వయసు పైబడగానే ఇక తమ జీవితంలో సాధించేది ఏమీ లేదని భావిస్తుంటారు కొంతమంది. కానీ, దీనికి భిన్నంగా వయసు కేవలం సంఖ్య మాత్రమే అంటూ ముందుకు సాగుతుంటారు మరికొందరు. ఈ క్రమంలో మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు. హరియాణాకు చెందిన భగ్వానీదేవి దాగర్‌ ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు. ఈమె 94 ఏళ్ల వయసులో వరల్డ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని ఒక బంగారు పతకంతో పాటు రెండు కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకొని సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నారు.

24.74 సెకన్లలోనే...

భగ్వానీదేవిది హరియాణాలోని ఖిడ్కా అనే ప్రాంతం. ఇటీవలే  జరిగిన వరల్డ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఒక బంగారు పతకంతో పాటు రెండు కాంస్య పతకాలను ఆమె గెలుపొందారు. 94 ఏళ్ల వయసులో వంద మీటర్ల పరుగు పందెంలో పాల్గొని దానిని 24.74 సెకన్లలోనే పూర్తి చేసి స్వర్ణం సొంతం చేసుకున్నారు. అంతకుముందు షాట్‌ పుట్‌లో ఒక కాంస్యం, డిస్కస్‌ త్రోలో మరో కాంస్యాన్ని గెలుచుకున్నారు. ఈ విజయంతో ఆమె తోటి క్రీడాకారులతో పాటు యువతలో స్ఫూర్తి నింపుతున్నారు. ఈ క్రమంలో వయసు కేవలం ఒక అంకె మాత్రమే అని చాటి చెబుతున్నారు.

ఈవెంట్‌కో మెడల్..!

భగ్వానీదేవి అంతకుముందు చెన్నైలో జరిగిన నేషనల్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొని మూడు బంగారు పతకాలను గెలుచుకున్నారు. దీంతోనే ఆమె భారత్‌ తరపున వరల్డ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. అంతకంటే ముందు దిల్లీ స్టేట్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఆమె 100 మీటర్ల రేస్‌, షాట్‌పుట్‌, జావెలిన్‌ త్రో విభాగాల్లో పాల్గొన్నారు. ఇందులోనూ ఆమె మూడు బంగారు పతకాలు గెలుచుకోవడం విశేషం. అలా ఆమె పోటీ పడిన ప్రతి ఈవెంట్లో ఏదో ఒక పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా సాధించిన విజయంతో పలువురు ప్రముఖులతో పాటు నెటిజన్ల నుంచి ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వీరిలో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులూ ఉన్నారు.

డ్యాన్స్‌ చేస్తూ...!

భగ్వానీదేవి మనవడు వికాస్‌ దాగర్‌ కూడా క్రీడాకారుడే. తన అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా అంతర్జాతీయ పారా అథ్లెట్‌గా రాణిస్తున్నాడు. ప్రస్తుత పోటీల్లో భగ్వానీదేవికి తోడుగా ఉన్నాడు. ఇక పతకం గెలుచుకున్న తర్వాత దేశానికి చేరుకున్న భగ్వానీదేవి దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే డ్యాన్స్‌ చేస్తూ పలువురినీ ఆకట్టుకున్నారు.

రెండేళ్లకోసారి..

వరల్డ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంటుంది. ఇందులో 35 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే పాల్గొనాలనే నియమం ఉంది. అలాగే వారు తమ దేశం తరపున జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలి. ఈ పోటీలు 1975లో మొదలయ్యాయి. 24వ సారి జరిగిన ఈ క్రీడలు ఇటీవలే ఫిన్లాండ్‌లోని టాంపెరెలో ముగిశాయి. అంతకుముందు 2020లో జరగాల్సిన పోటీలు కరోనా కారణంగా రద్దయ్యాయి. మళ్లీ 2024లో స్వీడన్‌లో జరుగుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్