భూగర్భ గనుల్లో.. లోతైన సముద్రాల్లో.. ఎక్కడైనా పని చేస్తాం!

చుట్టూ చిమ్మ చీకటి.. భరించలేని వేడి-ఉక్కపోతకు తోడు ఊపిరాడని వాతావరణం.. వెరసి భూగర్భ గనుల్లో ఎంతటి ప్రతికూల పరిస్థితులుంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలాంటి వాతావరణంలో పురుషులు పనిచేయడమే కష్టమనుకుంటే.. ఈ సవాళ్లను సవాల్‌ చేస్తూ ఈతరం అమ్మాయిలూ పోటీపడి మరీ ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారు. 

Updated : 08 May 2024 13:00 IST

చుట్టూ చిమ్మ చీకటి.. భరించలేని వేడి-ఉక్కపోతకు తోడు ఊపిరాడని వాతావరణం.. వెరసి భూగర్భ గనుల్లో ఎంతటి ప్రతికూల పరిస్థితులుంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలాంటి వాతావరణంలో పురుషులు పనిచేయడమే కష్టమనుకుంటే.. ఈ సవాళ్లను సవాల్‌ చేస్తూ ఈతరం అమ్మాయిలూ పోటీపడి మరీ ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారు. వారిని నిరుత్సాహపరచకుండా ఆయా సంస్థలూ వారికి అరుదైన అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ రంగంలో లింగభేదాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తున్నాయి. మొన్నామధ్య టాటా స్టీల్‌ 23 మంది మహిళా ఫైర్‌ఫైటర్స్‌ని నియమించుకోవడమే ఇందుకు నిదర్శనం. ఇదొక్కటే కాదు.. గతంలోనూ పలు మైనింగ్‌, భారీ ఇంజినీరింగ్ సంస్థలు వివిధ విభాగాల్లో మహిళల్ని నియమించుకున్నాయి.

రంగమేదైనా సరే - ‘అతివలు అబలలు కాదు సబలలు’ అని నిరూపిస్తున్నారు ఈ కాలపు అమ్మాయిలు. ఆటోమొబైల్స్‌, భారీ ఇంజినీరింగ్‌; టైర్లు, వాహనాల తయారీ.. ఇలా పురుషాధిపత్యం ఉన్న ప్రతి రంగంలోకీ చొచ్చుకుపోతున్నారు. భూగర్భ గనుల్లోనూ, లోతైన సముద్రాల్లోనూ వివిధ రకాల విధులు నిర్వర్తిస్తూ డేరింగ్ అండ్ డ్యాషింగ్ విమెన్‌గా నిరూపించుకుంటున్నారు.

పెరుగుతోంది..!

‘గనుల చట్టం 1952’ ప్రకారం.. భూగర్భ గనుల్లో మహిళలు పనిచేయడంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. సుమారు 67 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరిస్తూ.. మహిళల్ని భూగర్భ గనులు, ఓపెన్‌కాస్ట్‌ గనుల్లోకి అనుమతించాలని, నైట్‌షిఫ్టుల్లోనూ మహిళలు పనిచేయచ్చని పలు సవరణలు చేసింది. దీంతో 2019 నుంచి భూగర్భ గనుల్లో మహిళల ప్రవేశం అధికారికమైంది. ఈ క్రమంలోనే.. భూగర్భ గనులు మొదలుకొని ఉక్కు కర్మాగారాలు, చమురు వెలికితీత.. వంటి విధులకు సంబంధించి మహిళల నియామకాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆయా సంస్థలు ఔత్సాహిక మహిళల్ని ప్రోత్సహిస్తూ.. వివిధ విభాగాల్లో అవకాశాలు అందించడమే ఇందుకు ప్రధాన కారణం!

⚛ 2019లో భూగర్భ గనుల్లోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఈ రంగంలో మహిళల నియామకాలు మొదలయ్యాయి. దీంతో దేశంలోనే అతి పెద్ద బొగ్గు గనుల సంస్థ ‘సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌)’ ఈ నియామకం చేపట్టిన తొలి సంస్థగా నిలిచింది. ప్రస్తుతం ఈ సంస్థలో జనరల్‌ మజ్దూర్‌, పంప్‌ ఆపరేటర్‌, కన్వేయర్‌ ఆపరేటర్‌, కోల్‌ కట్టర్‌, ఫిట్టర్‌, హెల్పర్‌.. తదితర విభాగాల్లో మహిళలు పనిచేస్తున్నారు. ఆపై పలు ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలూ ఇదే బాటలో నడవడం మొదలుపెట్టాయి.

⚛ గతేడాది సెప్టెంబర్‌లో టాటా స్టీల్‌ తన తొలి బ్యాచ్ మహిళా అగ్నివీర్‌ల నియామక ప్రక్రియను చేపట్టి 23 మంది మహిళల్ని నియమించుకుంది. గనుల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి రక్షణ చర్యలు చేపట్టడం వీరి బాధ్యత! అయితే 2019లోనే తమ గనుల్లోని అన్ని విభాగాల్లో, అన్ని షిఫ్టుల్లో పనిచేసేలా పలువురు మహిళా ఇంజినీర్లను నియమించుకుందీ సంస్థ. తద్వారా అన్ని షిఫ్టుల్లో మహిళలకు పనిచేసే అవకాశమిచ్చిన తొలి భారతీయ మైనింగ్‌ సంస్థగా పేరు తెచ్చుకుంది. 2025 నాటికి 20 శాతం మంది మహిళా ఆఫీసర్లను నియమించుకునే లక్ష్యంతో ముందుకు సాగుతోందీ స్టీల్‌ దిగ్గజం.

⚛ వేదాంత లిమిటెడ్‌ సంస్థలో భాగమైన హిందుస్థాన్‌ జింక్‌ కంపెనీలో డ్రిల్లింగ్‌, బ్లాస్టింగ్‌.. వంటి కీలక విభాగాల్లో మహిళలు పని చేస్తున్నారట! అంతేకాదు.. అండర్ గ్రౌండ్ మేనేజర్లు, షిఫ్ట్‌ ఫోర్‌మ్యాన్‌, షిఫ్ట్‌ ఇంజినీర్‌, మైన్‌ ప్లానింగ్‌.. తదితర విభాగాల్లోనూ మహిళలు విధులు నిర్వర్తిస్తున్నారు.

⚛ టాటా స్టీల్‌ కళింగనగర్‌, వెస్ట్‌ బొకారో ఉక్కు కర్మాగారాల్లోనూ మూడు షిఫ్టుల్లో పనిచేసేలా మహిళల నియామక ప్రక్రియ చేపట్టినట్లు ఆ సంస్థ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు.. టాటా స్టీల్‌ కళింగనగర్‌, టాటా స్టీల్‌ మెరమండలిలో ఆపరేషన్స్‌, నిర్వహణ విభాగాల్లో పనిచేసే మహిళల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక డ్రైవ్‌ కూడా నిర్వహించడం గమనార్హం.

⚛ ఇక ‘ఎల్‌ అండ్‌ టీ’ సంస్థ తమ ఫ్యాక్టరీల్లో క్వాలిటీ కంట్రోల్‌ ఇన్‌స్పెక్టర్లుగా, మెయింటెయినెన్స్‌ ఇంజినీర్లుగా ఇప్పటికే కొందరు మహిళల్ని విధుల్లో చేర్చుకుంది. అలాగే ఇంజినీరింగ్, వెల్డింగ్‌ టెక్నాలజీ.. మొదలైన వాటికి సంబంధించిన ఇతర విభాగాలకు నాయకత్వం వహించే బాధ్యతను సైతం మహిళలకే అప్పగిస్తోంది.

⚛ వెస్ట్‌ బొకారో స్టీల్‌ ఫ్యాక్టరీలో భారీ వాహనాల తరలింపు ప్రక్రియ కోసం ఇప్పటికే పలువురు మహిళల్ని నియమించుకున్నట్లు ఆ సంస్థ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఇందులో శిక్షణ పొందుతోన్న మహిళల పనితీరుని బట్టి మరికొంతమంది మహిళల్ని రిక్రూట్‌ చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట!

⚛ ‘కోల్‌ ఇండియా లిమిటెడ్‌’ సంస్థ డంపర్‌, షోవెల్‌.. వంటి భారీ మెషీన్లు నడిపేందుకు ఇప్పటికే కొందరు మహిళల్ని నియమించుకుంది. తమ సంస్థలో అధికారులు, డాక్టర్లు, సెక్యూరిటీ గార్డ్స్‌.. వంటి పలు విభాగాల్లోనూ మహిళల్ని నియమించుకొని ప్రోత్సహిస్తోంది.

⚛ చమురు, సహజ వాయువు ఉత్పత్తి సంస్థ ONGC.. లోతైన సముద్రాల్లో వీటి అన్వేషణ కోసం ఇప్పటికే కొందరు మహిళల్ని నియమించుకుంది. నిజానికి ఈ విధులు పురుషులకే కష్టతరం. ఎందుకంటే ఒక్కోసారి 14 రోజులకు పైగా సముద్ర గర్భంలోనే గడపాల్సి రావచ్చు. చమురు, సహజ వాయువు నిల్వల కోసం అన్వేషణ సాగించాల్సి రావచ్చు. అలాంటిది మహిళలకు ఈ పని కత్తి మీద సామే అని చెప్పాలి. అయినా ఈ కాలపు అమ్మాయిలు ఈ సాహసానికీ వెనకాడట్లేదు.


మరింత ప్రోత్సహించడం కోసం..

⚛ సముద్ర గర్భంలో చమురు, సహజవాయువు నిల్వల్ని కనుగొనే ప్రక్రియలో భాగమైన మహిళల కోసం ఆయా సంస్థలు పలు రక్షణ చర్యలూ చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే ONGC సంస్థ.. మహిళా సిబ్బందికి తమ విధుల నిర్వహణకు అనుకూలంగా ఉండే దుస్తులను ప్రత్యేకంగా డిజైన్ చేయిస్తోంది. అలాగే సీసీ టీవీల ద్వారా భద్రతా చర్యలను పెంచడం, పని ప్రదేశాల్లో మహిళల కోసం ప్రత్యేక వసతి సదుపాయాల్ని ఏర్పాటుచేయడం.. వంటి చర్యలు చేపడుతోంది.

⚛ ఇదేవిధంగా మరికొన్ని ప్రముఖ సంస్థలు మహిళా ఉద్యోగుల సౌకర్యార్థం మరిన్ని సదుపాయాలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా వాళ్ల పనివేళల్లో మార్పులు చేయడం, పని ప్రదేశాల్ని వారికి అనుగుణంగా అభివృద్ధి చేయడం, అక్కడ వారికి టాయిలెట్‌/దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు/ఇతర ప్రాథమిక సదుపాయాలు ఏర్పాటుచేయడం.. వంటివి చేస్తున్నాయి.

⚛ భూగర్భ గనుల తవ్వకాల్లో తమ మహిళా ఉద్యోగులు మరింత ఆరితేరేలా ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాల్నీ మరికొన్ని సంస్థలు ఏర్పాటుచేస్తున్నాయట. తద్వారా వారిలో నైపుణ్యాల్ని మరింతగా పెంచుతూ వారి కెరీర్‌ అభివృద్ధికీ బాటలు పరుస్తున్నాయి.

ఈ విధంగా కష్టతరమైన విధుల్లో సైతం మహిళలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం వల్ల వారిపై సమాజంలో ఉన్న మూసధోరణుల్ని బద్దలుకొట్టినట్లవుతుంది.. అలాగే వారి నైపుణ్యాల విస్తృతీ పెరుగుతుంది. ఇది ప్రత్యక్షంగా ఉద్యోగికి, పరోక్షంగా సంస్థ అభివృద్ధికీ కీలకంగా మారుతుంది. ముఖ్యంగా సృజనాత్మక ఆలోచనలు పెరగడం, వినూత్న ఆవిష్కరణలకు తెరతీయడం.. వంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. 

అయితే- ఇప్పటికీ ఈ రంగం మహిళలకు సురక్షితం కాదన్న అభిప్రాయం లేకపోలేదు. అయితే టెక్నాలజీలో వస్తున్న వివిధ మార్పులు ఆయా విభాగాల్లో మహిళల విధులను మరింత సులభతరం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో- మరింత ధైర్యంగా ముందుకు వస్తేనే నలుగురిలో ఒక్కరిగా పేరు తెచ్చుకోవచ్చు.. తద్వారా తోటి మహిళలకూ ఆదర్శంగా నిలవచ్చు అంటున్నారు నిపుణులు.


మైనింగ్‌ బ్రాంచా? మార్చుకోమన్నారు!

పురుషాధిపత్యం ఉన్న మైనింగ్‌ రంగంలోకి అడుగుపెట్టి ఎంతోమందికి మార్గదర్శకులుగా మారుతున్నారు పలువురు మొదటి మహిళలు. ఈ క్రమంలోనే ‘దేశంలోనే తొలి మహిళా మైనింగ్‌ ఇంజినీర్‌’గా చరిత్ర సృష్టించింది డాక్టర్‌ చంద్రాణీ ప్రసాద్‌ వర్మ. మైనింగ్‌ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె.. తన తండ్రి స్ఫూర్తితో మైనింగ్‌ రంగంలోకి అడుగుపెట్టాలనుకుంది.

‘మా నాన్న మైనింగ్‌ ఇంజినీర్‌. ఆయన స్ఫూర్తితోనే ఈ రంగంలోకి రావాలనుకున్నా. చిన్నప్పుడు నాన్న షూస్‌, గమ్‌బూట్స్‌, షర్ట్‌.. ధరించి నేను కూడా విధులకు వెళ్తున్నట్లుగా ఫీలయ్యేదాన్ని. ఈ మక్కువతోనే స్కూలింగ్‌ పూర్తి కాగానే మైనింగ్‌ బ్రాంచ్‌లో డిప్లొమా కోర్సును ఎంచుకున్నా. అమ్మ, నాన్న, అక్క నన్ను ప్రోత్సహించినా.. ఇతరులు మాత్రం ‘అమ్మాయివై ఉండి గనుల్లోకి వెళ్లడమేంటి? బ్రాంచ్‌ మార్చుకో’మంటూ ఉచిత సలహాలిచ్చారు. ఒకవేళ వాళ్ల మాటలు పట్టించుకొని ఉంటే నాకు ఈ పేరుప్రఖ్యాతులు వచ్చేవే కాదు. విధుల్లో ప్రతి నిత్యం పలు సవాళ్లు, సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిని దాటుకొని ముందుకెళ్లే క్రమంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నా. పనిని ఆస్వాదిస్తున్నా. మహిళలు ఏ రంగంలోనైనా రాణించగల సమర్థులు.. ఇందుకు కావాల్సింది స్వీయ శక్తిసామర్థ్యాలపై నమ్మకముంచడం!’ అంటారు చంద్రాణీ. CIMFRలో రీసెర్చ్‌ ఫెలోగా కెరీర్‌ ప్రారంభించిన ఆమె.. ప్రస్తుతం ‘CSIR-CIMFR’ సంస్థలో సీనియర్‌ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. కోల్‌ మైన్‌ డిజైన్‌, మెటల్‌ మైన్‌ సెక్టర్‌, రాక్‌ మెకానిక్స్‌, న్యూమరికల్‌ మోడలింగ్‌.. వంటి అంశాల్లో చంద్రాణీకి 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఓవైపు వృత్తిలో రాణిస్తూనే.. మరోవైపు తల్లిగానూ తన బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తున్నారామె. తద్వారా ఈతరం మహిళలకు వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ పాఠాలు నేర్పుతున్నారు.


ఆ సంస్థలో తొలి మహిళగా..!

దేశంలోనే ప్రసిద్ధి చెందిన బొగ్గు గనుల సంస్థల్లో ‘సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (CCL)’ ఒకటి. ఈ కంపెనీలో 2021లో మైనింగ్‌ ఇంజినీర్‌గా బాధ్యతలు చేపట్టింది ఆకాంక్ష కుమారి. తద్వారా ఈ సంస్థలో అండర్ గ్రౌండ్ మైనింగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్రకెక్కిందామె. జార్ఖండ్‌ హజారీబాగ్‌లోని బార్కాగావ్‌లో పుట్టి పెరిగిన ఆమె నవోదయ విద్యార్థిని. మైనింగ్‌ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో తానూ ఇదే రంగంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు తన తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడంతో ధన్‌బాద్‌ సింద్రిలోని బిట్స్‌ కళాశాలలో ‘మైనింగ్‌ ఇంజినీరింగ్‌’ విభాగంలో బీటెక్‌ పూర్తిచేసింది. ప్రస్తుతం మైనింగ్‌ ఇంజినీర్‌గా అరుదైన బాధ్యతను అందుకొని ఎంతోమంది మహిళలకు ప్రేరణగా నిలిచిన ఆకాంక్ష.. తన హోదా పెద్దదే అయినా బొగ్గు గనుల్లో కష్టతరమైన పనులు చేయడమంటేనే మక్కువ ఎక్కువంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్