వాళ్ల కోసం.. గంటలో 249 కప్పుల టీ తయారు చేసింది!

తలనొప్పిగా ఉన్నా, ఒత్తిడిగా అనిపించినా, ఓ కప్పు వేడి వేడి టీ తాగడం చాలామందికి అలవాటు. ‘టీ’ తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. కానీ, గంటలో వందల కప్పుల టీ చేయాలంటే మాత్రం కష్టమే. అయితే దక్షిణాఫ్రికాకు చెందిన ఇంగర్‌ వాలెంటిన్‌ అనే మహిళ.....

Published : 18 Oct 2022 19:36 IST

తలనొప్పిగా ఉన్నా, ఒత్తిడిగా అనిపించినా, ఓ కప్పు వేడి వేడి టీ తాగడం చాలామందికి అలవాటు. ‘టీ’ తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. కానీ, గంటలో వందల కప్పుల టీ చేయాలంటే మాత్రం కష్టమే. అయితే దక్షిణాఫ్రికాకు చెందిన ఇంగర్‌ వాలెంటిన్‌ అనే మహిళ మాత్రం గంటలో ఏకంగా 249 కప్పుల రాయిబస్‌ టీని తయారు చేసింది. తద్వారా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా...

నేపథ్యమిదే..

అది డిసెంబర్ 31, 2018. అందరిలాగే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు దక్షిణాఫ్రికాలోని ఉప్పెర్తల్ వాసులు. కానీ, ఆ రోజు సంభవించిన కార్చిచ్చు వారి ప్రాంతాన్ని తుడిచిపెట్టేసింది. వందల మంది నిరాశ్రయులయ్యారు. అందులో ఇంగర్‌ వాలెంటిన్‌ కూడా ఒకరు. కార్చిచ్చు వల్ల ఆమె తన ఇంటిని కోల్పోవడంతో పాటు ఆమె పని చేస్తోన్న టూరిజం ఆఫీసులు కూడా దగ్ధమయ్యాయి. తమ ప్రాంతాన్ని తిరిగి నిర్మించుకోవడానికి వారికి నాలుగు సంవత్సరాలు పట్టింది. కానీ, వారి జీవనాధారమైన పర్యాటకం ఇంకా కోలుకోలేదు. అందుకోసమే ఇంగర్‌ గిన్నిస్‌ రికార్డు నెలకొల్పే ప్రయత్నం చేసింది.

రికార్డు ఇలా...

టీ తయారు చేయడంలో సిద్ధహస్తురాలైన ఇంగర్‌ గిన్నిస్‌ రికార్డు కోసం దానినే ఎంచుకుంది. అయితే రికార్డు సాధించాలంటే ఒక్క గంటలో 150 కప్పుల టీని తయారు చేయాలని నిర్వాహకులు తెలిపారు. అందుకు సిద్ధపడిన ఇంగర్‌, రాయిబస్ అనే హెర్బల్‌ టీని తయారు చేయాలనుకుంది. ఇది దక్షిణాఫ్రికాలోని ఒక రకమైన ఆకుల నుంచి లభిస్తుంది. సాధారణ రాయిబస్‌ టీతో పాటు వెనీలా, స్ట్రాబెర్రీ ఫ్లేవర్లలో టీని అందించాలనుకుంది ఇంగర్. ఇందుకోసం ముందుగానే ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకుంది. ఆమె ప్రతి టీపాట్‌లో నాలుగు టీబ్యాగ్‌లను వేసింది. ఒక్క టీపాట్‌తో నాలుగు టీ కప్పులు తయారు చేయచ్చు. రాయిబస్‌ టీ తయారు చేయాలంటే టీబ్యాగ్‌ని కనీసం రెండు నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచాలి. ఇంగర్‌ తక్కువ సమయంలో ఎక్కువ టీ కప్పులను తయారు చేయడానికి మూడు టీపాట్‌లలో ఒకేసారి టీ తయారుచేసి, మరొక బ్యాచ్‌ తయారు చేయడం మొదలుపెట్టింది.

సాధారణంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాలంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. రికార్డు కోసం చేసే ఆహార పదార్థాలు వృథా కాకుండా జాగ్రత్త పడాలి. ఇందుకోసం కొంతమంది ‘టీ’ ప్రేమికులు, స్థానిక విద్యార్థులు, కమ్యూనిటీ మెంబర్లు ఆమెకు సాయపడ్డారు. అలాగే గిన్నిస్‌ నిర్వాహకులు ప్రతి టీ కప్పును సర్వ్‌ చేసే ముందు చెక్‌ చేస్తుంటారు. ఒక కప్పులో కనీసం 142ml టీ ఉండాలి. వీటిని పాటిస్తూ ఇంగర్‌ ఇరవై నిమిషాల్లోనే 92 కప్పుల టీని తయారు చేసింది. అయితే ఆ సమయంలో ఆమెకు ఒక సమస్య ఎదురైంది. శుభ్రం చేసిన టీ కప్పులన్నీ అయిపోయాయి. ఈసారి కూడా స్థానిక విద్యార్థులు ముందుకొచ్చి తాము తాగిన టీ కప్పులను శుభ్రం చేసి సాయపడ్డారు. అలా కౌంట్‌డౌన్‌ పూర్తయ్యే సమయానికి తను లక్ష్యానికి చేరుకున్నాననుకుందట ఇంగర్.  అయితే గంటలో 170 కప్పుల టీ చేశానని అనుకుందట. కానీ నిమిషానికి నాలుగు చొప్పున  గంటలో ఏకంగా 249 కప్పులు టీ తయారు చేసి గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకుంది. కాగా, ఒక కప్పులో సరిపడినంత టీ లేనందున తిరస్కరణకు గురైంది.

ఆ రైతుల కోసమే..!

రికార్డు సాధించిన తర్వాత ఇంగర్‌ మాట్లాడుతూ ‘చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాంతంలో రాయిబస్‌ టీ రైతులు చాలామంది ఉన్నారు. దీని ద్వారా వారికి లాభం జరగడంతో పాటు ఇక్కడి పర్యాటకం అభివృద్ధి చెందుతుని ఆశిస్తున్నా’ అని చెప్పడం గమనార్హం.

Photos: www.guinnessworldrecords.com

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్