పార్లర్లో హెయిర్‌ వాష్‌ చేయించుకుంటున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

బ్యూటీ పార్లర్‌లో మనం ఎన్నెన్నో సౌందర్య చికిత్సలు చేయించుకుంటాం.. స్పా ట్రీట్‌మెంట్లు తీసుకుంటాం. అందులో హెయిర్‌ వాష్‌ కూడా ఒకటి. ఈ క్రమంలో చేసే షాంపూ, కండిషనింగ్‌.. వంటి ప్రక్రియలతో జుట్టు పోషణ ఇనుమడిస్తుంది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఈ సౌందర్య చికిత్స వల్ల కొంతమందిలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ సమస్య....

Published : 04 Nov 2022 14:09 IST

బ్యూటీ పార్లర్‌లో మనం ఎన్నెన్నో సౌందర్య చికిత్సలు చేయించుకుంటాం.. స్పా ట్రీట్‌మెంట్లు తీసుకుంటాం. అందులో హెయిర్‌ వాష్‌ కూడా ఒకటి. ఈ క్రమంలో చేసే షాంపూ, కండిషనింగ్‌.. వంటి ప్రక్రియలతో జుట్టు పోషణ ఇనుమడిస్తుంది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఈ సౌందర్య చికిత్స వల్ల కొంతమందిలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీన్నే ‘బ్యూటీ పార్లర్‌ స్ట్రోక్‌ సిండ్రోమ్‌’గా పేర్కొంటున్నారు. ఇంతకీ ఏంటీ సమస్య? ఎందుకొస్తుంది? పార్లర్లో హెయిర్‌ వాష్‌కు, బ్రెయిన్‌ స్ట్రోక్‌కు సంబంధమేంటి? వీటి గురించి నిపుణులేమంటున్నారో తెలుసుకుందాం రండి..

హైదరాబాద్‌కు చెందిన ఓ 50 ఏళ్ల మహిళ ఇటీవలే సౌందర్య చికిత్స కోసమని ఓ బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. అక్కడ హెయిర్‌ వాష్‌ చేయించుకుందామె. అయితే తొలుత బాగానే ఉన్నా.. షాంపూ చేసే క్రమంలో మాత్రం వికారంగా, మైకంగా అనిపించడంతో అసౌకర్యానికి గురైందామె. ఆ మరుసటి రోజు కూడా నడుస్తూ మైకం కమ్మినట్లుగా లక్షణాలు కనిపించడంతో ఓ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ని సంప్రదించింది. అక్కడ నయం కాకపోవడంతో.. ఆ డాక్టర్ సూచన మేరకు ప్రముఖ న్యూరాలజిస్ట్‌ను సంప్రదించిందామె. ఈ లక్షణాలన్నింటికీ కారణం ‘బ్యూటీ పార్లర్‌ స్ట్రోక్‌ సిండ్రోమ్‌’ అని గుర్తించిన ఆయన.. హెయిర్‌ వాష్‌ చేయించుకునే క్రమంలో మెడ వద్ద ఒత్తిడి కలగడం వల్ల ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు.

ఏంటీ సిండ్రోమ్?

సాధారణంగా పార్లర్లో హెయిర్‌ వాష్‌ చేయించుకునే క్రమంలో మెడను బాగా వెనక్కి వంచుతాం. దీంతో కొన్నిసార్లు మెడకు సరైన సపోర్ట్‌ కూడా ఉండదు. ఇలా మెడను ఎక్కువగా సాగదీయడం, అధిక సమయం పాటు ఇలాగే ఉంచడం, మెడపై వ్యతిరేక దిశలో ఒత్తిడి పడడం, షాంపూ/కండిషనింగ్‌ చేసే క్రమంలో మెడ కిందికి, పైకి వెంటవెంటనే కదులుతూ దాని సపోర్ట్‌కి తాకడం.. ఈ ప్రక్రియల వల్ల మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా సరిగ్గా జరగదు. అలాగే మెదడు, వెన్నెముకకు రక్తాన్ని సరఫరా చేసే మెడలోని వెన్నుపూస ధమనుల పనితీరుకూ అంతరాయం కలుగుతుంది. అలాగే ఈ ఒత్తిడి వల్ల మెడ వద్ద ఉన్న రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి. తద్వారా ఆ మార్గంలో రక్తం గడ్డకట్టి.. ఇది బ్రెయిన్‌ స్ట్రోక్‌కు దారితీసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. దీన్నే ‘బ్యూటీ పార్లర్‌ స్ట్రోక్‌ సిండ్రోమ్‌’గా పిలుస్తున్నారు.

సమస్య అదే.. లక్షణాలు కాస్త భిన్నం!

బ్రెయిన్‌ స్ట్రోక్.. ఈ పేరు వినగానే భయపడిపోతాం. ఎందుకంటే ఇది ప్రాణాంతకం కాబట్టి! అయితే సమస్య అలాంటిదే అయినా.. ఈ బ్రెయిన్‌ స్ట్రోక్‌కు, బ్యూటీ పార్లర్‌ స్ట్రోక్‌ సిండ్రోమ్‌కు లక్షణాల్లో కొన్ని తేడాలున్నాయంటున్నారు నిపుణులు. అసలైన బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ముందు.. ఉన్నట్లుండి శరీరంలో ఒక వైపు తిమ్మిరిగా ఉండడం, నీరసంగా అనిపించడం, మాట్లాడడంలో తడబాటు, మాటల్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు, నడుస్తుంటే మైకం కమ్మడం.. వంటి సమస్యలొస్తాయి. అదే బ్యూటీ పార్లర్‌ స్ట్రోక్‌ సిండ్రోమ్‌లో అలసట, వికారం, వాంతులు, మైగ్రెయిన్‌ తరహా తలనొప్పి, చూపు మందగించడం, మెడ వద్ద వాపు, రుచిలో మార్పు.. వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ముందుగా ఈ లక్షణాల్ని గుర్తించిన వెంటనే డాక్టర్‌ని సంప్రదిస్తే.. సకాలంలో చికిత్స అందుతుంది. తద్వారా స్ట్రోక్‌ రాకుండా, ఇతర సమస్యలకు దారితీయకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు.


ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఈ తరహా సిండ్రోమ్‌ పార్లర్‌లో హెయిర్‌ వాష్‌ చేయించుకునేటప్పుడు మాత్రమే కాదు.. దంత పరీక్షలు చేయించుకునేటప్పుడు, టెన్నిస్‌ ఆడే క్రమంలో, కొన్ని రకాల యోగాసనాలు చేసేటప్పుడు, మధుమేహం-హైపర్‌టెన్షన్‌.. వంటి అనారోగ్యాలున్నప్పుడు, వంశపారంపర్యంగా.. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ సమస్య తలెత్తచ్చంటున్నారు నిపుణులు. అందుకే ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు పాటించడం ఉత్తమం అని చెబుతున్నారు. అవేంటంటే..!

⚛ మెడను ఎక్కువ సమయం వెనక్కి వంచే పనులు, హెయిర్‌ వాష్‌లు, మసాజ్‌లకు దూరంగా ఉండడం మంచిది.

⚛ ఒకవేళ పార్లర్లో హెయిర్‌ వాష్‌, ఇతర సౌందర్య చికిత్సలు చేసేటప్పుడు మెడను ఎక్కువసేపు వంచాల్సి వస్తే.. దానికి సౌకర్యవంతమైన సపోర్ట్‌ని అందించడం, మధ్యమధ్యలో సాధారణ స్థితికి వచ్చి రిలాక్సవడం.. వంటివి చేయడం తప్పనిసరి.

⚛ తలస్నానానికి మరీ వేడిగా, మరీ చల్లగా కాకుండా.. గోరువెచ్చగా ఉండే నీళ్లను ఉపయోగించాలి.

⚛ పైన పేర్కొన్న అనారోగ్యాలున్న వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తపడడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్