పాలిచ్చే సమయంలో.. ఈ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ వద్దు!

పాలిచ్చే తల్లుల రొమ్ముల్లో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండడం వల్ల నొప్పి, ఎరుపెక్కడం, వక్షోజాలు గట్టిగా అయిపోవడం, చనుమొనల్లో నుంచి పాలు కారడం, తీవ్ర అసౌకర్యం.. వంటివన్నీ సాధారణంగా జరిగేవే! అయితే ఇలాంటి లక్షణాలే చాలా అరుదుగా రొమ్ము క్యాన్సర్‌కు....

Published : 20 Oct 2022 19:20 IST

పాలిచ్చే తల్లుల రొమ్ముల్లో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండడం వల్ల నొప్పి, ఎరుపెక్కడం, వక్షోజాలు గట్టిగా అయిపోవడం, చనుమొనల్లో నుంచి పాలు కారడం, తీవ్ర అసౌకర్యం.. వంటివన్నీ సాధారణంగా జరిగేవే! అయితే ఇలాంటి లక్షణాలే చాలా అరుదుగా రొమ్ము క్యాన్సర్‌కు దారితీయచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి పాలిచ్చే తల్లులు తమ వక్షోజాల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఏదైనా తీవ్ర అసౌకర్యానికి గురైనట్లయితే వెంటనే వైద్య నిపుణుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. అక్టోబర్‌ను ‘ప్రపంచ రొమ్ము క్యాన్సర్‌ అవగాహన మాసం’గా జరుపుకుంటోన్న నేపథ్యంలో పాలిచ్చే తల్లుల్లో అరుదుగా కనిపించే రొమ్ము క్యాన్సర్‌ లక్షణాలేంటి? వాటిని ఎలా గుర్తించాలి? తదితర విషయాల గురించి తెలుసుకుందాం..

పాలివ్వడం అనే ప్రక్రియ తల్లీబిడ్డలిద్దరికీ ఆరోగ్యదాయకం అన్న విషయం తెలిసిందే! తల్లి పిల్లలకు పాలివ్వడం వల్ల పిల్లల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్లనైనా ఎదుర్కొనే విధంగా రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.. అలాగే తల్లి పాల నుంచి పాపాయికి అన్ని రకాల పోషకాలు అందుతాయి. ఇక తల్లుల్లో ప్రసవానంతర రక్తస్రావాన్ని ఆపడానికి, బరువు తగ్గి సాధారణ స్థితికి చేరుకోవడానికి.. ఇలా పాలివ్వడం వల్ల తల్లులకూ బహుళ ప్రయోజనాలున్నాయి. అయితే పాలిచ్చే క్రమంలో చాలా అరుదుగా కనిపించే కొన్ని లక్షణాలను నిర్లక్ష్యం చేయద్దని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే అవే క్రమంగా వారిలో రొమ్ము క్యాన్సర్‌కు సైతం దారితీయచ్చని హెచ్చరిస్తున్నారు.

మ్యాస్టైటిస్ ఇన్ఫెక్షన్

సాధారణంగా రొమ్ముల్లో పాలు ఎక్కువగా ఉత్పత్తవడం వల్ల వాపు, ఎరుపెక్కడం, తీవ్రమైన నొప్పితో పాటు ఒక్కోసారి జ్వరం కూడా వస్తుంటుంది. అయితే ఇలాంటి లక్షణాలే మ్యాస్టైటిస్ ఇన్ఫెక్షన్‌కూ ఉంటాయంటున్నారు నిపుణులు. పాల వాహికలో అడ్డంకులు ఏర్పడడం లేదంటే బ్యాక్టీరియా వల్ల రొమ్ము కణజాలంలో వాపు రావడం.. వంటివి ఈ ఇన్ఫెక్షన్‌కు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ముఖ్యంగా ప్రసవం తర్వాత మొదటి మూడు నెలల్లో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అయితే ఇలాంటి అసౌకర్యం కలిగినప్పుడు పాల ఉత్పత్తి అధికంగా ఉండడం వల్లేనేమో అని భావించకుండా ఓసారి నిపుణుల్ని సంప్రదించి సందేహాన్ని నివృత్తి చేసుకోవడం మరీ మంచిది.

ఇన్వేజివ్ డక్టల్‌ కార్సినోమా (ఐడీసీ)

పాల వాహికలో పెరుగుతూ నెమ్మదిగా రొమ్ములోని కొవ్వు కణజాలంపై దాడి చేసే క్యాన్సర్‌ కారకమే ఐడీసీ. వక్షోజాలు ఎరుపెక్కడం, వాపు, నొప్పి.. వంటివి దీన్ని గుర్తించడానికి ఉపయోగపడే కొన్ని లక్షణాలు. కేవలం పాలిచ్చే తల్లుల్లోనే కాదు.. సాధారణ మహిళల్లో కూడా ఇది రొమ్ము క్యాన్సర్‌కు కారణమవుతుందట! అలాగని భయపడాల్సిన పని లేదని, దీన్ని ఎంత త్వరగా గుర్తిస్తే ఈ మహమ్మారి నుంచి అంత త్వరగా బయటపడచ్చంటున్నారు నిపుణులు.

ఆగకుండా డిశ్చార్జి అవుతుంటే..!

పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తి అధికమైనప్పుడే కాకుండా, సాధారణ సమయాల్లో కూడా అప్పుడప్పుడూ చనుమొనల నుంచి పాలు లేదంటే నీళ్ల లాంటి ద్రవం కారడం మనం గమనిస్తూనే ఉంటాం. అయితే ఇలాంటి లక్షణం పదే పదే గుర్తించడం లేదంటే ఎక్కువ సేపు చనుమొనల నుంచి పాలు/నీళ్ల లాంటి ద్రవం కారడం.. వంటివి గమనిస్తే మాత్రం అనుమానించాల్సిందే అంటున్నారు నిపుణులు. వెంటనే సంబంధిత నిపుణుల్ని సంప్రదిస్తే సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు.

పాలిచ్చినా కరగకుంటే..!

ఎక్కువ పాలు ఉత్పత్తవడం వల్ల రొమ్ములు గట్టి పడిపోవడం, అక్కడక్కడా గడ్డల్లా తగలడం.. వంటివి మనం గమనిస్తూనే ఉంటాం. బిడ్డ పాలు తాగడం లేదంటే బ్రెస్ట్‌ పంప్‌ సహాయంతో పాలు తీయడం.. వంటివి చేస్తే రొమ్ముల్లో పాలు క్రమంగా తగ్గిపోయి తిరిగి రొమ్ములు సాధారణ స్థితికి చేరుకుంటాయి. అదే పాలు తీసిన తర్వాత కూడా ఆ గడ్డలు కరగకపోయినా లేదంటే వాటిపై కాస్త ఒత్తితే అవి ఉన్న చోటు నుంచి కదలకపోయినా అనుమానించి వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలంటున్నారు నిపుణులు.
ఇక వీటితో పాటు రొమ్ముల్లో అసాధారణ వాపుగా అనిపించినా, రొమ్ముల ఆకృతిలో తేడాలు గమనించినా ఆలస్యం చేయకుండా డాక్టర్‌ సలహా మేరకు పరీక్షలన్నీ చేయించుకోవాలి. అలాగే నిర్ణీత వ్యవధిలో ఎవరికి వారే తమ వక్షోజాల్ని ఇంట్లోనే పరీక్షించుకోవడం మాత్రం మానకూడదు.

నిర్ధారణ అయితే ఏం చేయాలి?

పాలిచ్చే క్రమంలో రొమ్ము క్యాన్సర్‌ ఉందని నిర్ధారణ అయితే దాని దశను బట్టే చేసే చికిత్స ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్‌.. వంటి చికిత్సల ద్వారా క్యాన్సర్‌ గడ్డను తొలగించడం లేదంటే రొమ్మునే తొలగించాల్సి వస్తుందా అన్నది వైద్యులు నిర్ధారిస్తారు. అయితే క్యాన్సర్‌ ఉందని తెలిసిన తర్వాత, చికిత్స తర్వాత బిడ్డకు పాలివ్వడం మంచిదా? కాదా? అన్న విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. అలాగే రొమ్ము క్యాన్సర్‌ చికిత్స తర్వాత కోలుకోవడానికి నిపుణుల సలహా మేరకు జీవన విధానంలో మార్పులు చేసుకుంటూ, సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం వల్ల ఈ మహమ్మారి నుంచి త్వరగా బయటపడచ్చు.. మళ్లీ ఈ సమస్య తిరగబెట్టకుండానూ జాగ్రత్తపడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్