‘దంగల్’ నటి సుహానీకి వచ్చిన ‘డెర్మటోమయోసైటిస్’ గురించి తెలుసా?

ఈ రోజుల్లో ఎటు నుంచి ఎలాంటి అనారోగ్యం ముంచుకొస్తుందో చెప్పలేని పరిస్థితి. వ్యాధుల బారి నుంచి మనల్ని కాపాడాల్సిన రోగనిరోధక వ్యవస్థే తిరిగి ముప్పేట దాడిచేస్తూ వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది.

Updated : 20 Feb 2024 19:40 IST

ఈ రోజుల్లో ఎటు నుంచి ఎలాంటి అనారోగ్యం ముంచుకొస్తుందో చెప్పలేని పరిస్థితి. వ్యాధుల బారి నుంచి మనల్ని కాపాడాల్సిన రోగనిరోధక వ్యవస్థే తిరిగి ముప్పేట దాడిచేస్తూ వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. అలాంటి ఆటో-ఇమ్యూన్‌ డిజార్డర్‌తోనే టీనేజ్‌ నటి సుహానీ భట్నాగర్‌ ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే! ‘డెర్మటోమయోసైటిస్‌’ అనే అరుదైన వ్యాధే ఆమె మరణానికి కారణమంటూ వైద్యులు తేల్చారు. దీంతో ఈ వ్యాధి గురించి తెలుసుకోవాలన్న ఆతృత అందరిలో పెరిగింది. మరి, ఏంటీ వ్యాధి? అసలెందుకొస్తుంది? దీన్నుంచి బయటపడే మార్గాలున్నాయా? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

19 ఏళ్ల సుహానీ భట్నాగర్‌.. తన అసలు పేరు కంటే బబితా కుమారిగానే ఆమె చాలామందికి పరిచయం! ‘దంగల్‌’ సినిమాలో చిన్ననాటి బబితా ఫోగట్‌ పాత్రలో నటించి మెప్పించిన ఆమె.. ‘బిగ్‌బాస్‌’ ఆరో సీజన్లో పాల్గొంది. ఆపై పలు టీవీ సీరియళ్లలో నటించిన సుహానీ.. ఓ మ్యూజిక్‌ వీడియోలోనూ కనిపించింది. అయితే నటన పరంగా మంచి భవిష్యత్తున్నా ఓ అరుదైన వ్యాధి కారణంగా చిన్న వయసులోనే మరణించడం అందరినీ కలచివేసింది.

ఎలర్జీ అనుకున్నాం.. కానీ!

అయితే గత కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటూ.. తన పూర్తి దృష్టిని చదువు పైనే కేంద్రీకరించిన ఆమె.. ఉన్నట్లుండి ‘డెర్మటోమయోసైటిస్‌’ అనే వ్యాధి బారిన పడింది. అయితే తొలుత దీన్ని చర్మ సమస్యగా భావించినట్లు, ఆపై సమస్యేంటో గుర్తించి చికిత్స అందించినా ఫలితం లేకపోయినట్లు సుహానీ తల్లిదండ్రులు చెబుతున్నారు.
‘రెండు నెలల క్రితం సుహానీ చేతులపై ఎర్రటి దద్దుర్లు రావడం గమనించాం.. ఎలర్జీ వల్ల వచ్చినవేమో అనుకొని కొందరు డాక్టర్లను సంప్రదించాం. వాళ్లు అసలు సమస్యను గుర్తించలేకపోయారు. క్రమంగా తన ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్‌కి తీసుకెళ్లాం. అక్కడే మా కూతురికి డెర్మటోమయోసైటిస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆపై అక్కడే చేర్పించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ద్రవాలు ఎక్కువగా చేరి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. దాంతో శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో ఆమె ప్రాణాలు విడిచింది. నటిగా తను మాకెంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రతి సందర్భంలోనూ తనను చూసి గర్వపడేవాళ్లం..’ అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు ఆమె పేరెంట్స్‌. ఇలా వాళ్ల బాధ అందరిచేతా కంటతడి పెట్టిస్తోంది.

ఈ లక్షణాలు కనిపిస్తే..!

అయితే డెర్మటోమయోసైటిస్‌ కారణంగా సుహానీ కన్నుమూయడంతో ఈ వ్యాధి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి చాలామందిలో పెరిగిందని చెప్పచ్చు. నిజానికి ఇదో అరుదైన ఆటో-ఇమ్యూన్‌ డిజార్డర్‌. చర్మంపై ర్యాషెస్‌తో మొదలయ్యే ఈ ఇన్ఫెక్షన్‌ కండరాల దాకా పాకుతుంది. క్రమంగా కండరాల్ని బలహీనపరిచి ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. చిన్నారులు, టీనేజ్‌ వయసులో ఉన్న వారు, పెద్ద వయస్కులు.. ఇలా వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి ముప్పు ఎవరికైనా పొంచి ఉండచ్చంటున్నారు నిపుణులు. అయితే ఈ వ్యాధిని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించచ్చంటున్నారు.

డెర్మటోమయోసైటిస్‌ వ్యాధి బారిన పడిన వారిలో కనిపించే మొదటి లక్షణం.. చర్మంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడడం. ముఖం, కనురెప్పలు, ఛాతీ, గోరు క్యుటికల్‌, మోకాళ్లు, మోచేతులు.. వంటి భాగాల్లో కాస్త నీలం-పర్పుల్‌ రంగుల్లో ఉండే ర్యాషెస్‌ని గమనించచ్చు.

కండరాల్లో నొప్పి రావడం.. క్రమంగా శరీరంలోని ఒక్కో భాగంలోని కండరాలు బలహీనపడుతూ ఆరోగ్యం క్షీణించడం గమనించచ్చు. ఈ బలహీనత మెడ దగ్గర్నుంచి మొదలై భుజాలు, తొడల దాకా పాకుతుందంటున్నారు నిపుణులు.

ఈ సమస్య కారణంగా ఆహారం మింగడంలో సమస్యలు తలెత్తచ్చు.

ఊపిరితిత్తుల్లో సమస్యలు తలెత్తడం కూడా ఈ వ్యాధి లక్షణాల్లో ఒకటని నిపుణులు చెబుతున్నారు.

ఇక చిన్నారుల్లో క్యాల్షియం నిల్వలు తగ్గిపోవడం వారిలో ఈ వ్యాధి ప్రధాన లక్షణంగా గుర్తించచ్చట!

విపరీతమైన అలసట, ఉన్నట్లుండి బరువు తగ్గడం, జ్వరం.. వంటి లక్షణాలున్నా డెర్మటోమయోసైటిస్‌గా అనుమానించి వైద్యుల్ని సంప్రదించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇక కొంతమందిలో కండరాల బలహీనత లేకుండా.. చర్మంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడినట్లయితే దాన్ని ‘అమియోపతిక్‌ డెర్మటోమయోసైటిస్‌’గా పేర్కొంటున్నారు నిపుణులు.

అసలెందుకొస్తుంది?

నిజానికి డెర్మటోమయోసైటిస్‌ వ్యాధి ఎందుకొస్తుంది అన్నదానికి కచ్చితమైన కారణాలేవీ లేవంటున్నారు నిపుణులు. మన శరీరాన్ని వ్యాధుల బారి నుంచి కాపాడే రోగనిరోధక వ్యవస్థే తిరిగి ఆరోగ్యకరమైన కణజాలాలపై దాడి చేయడం వల్లే ఇలాంటి ఆటోఇమ్యూన్‌ వ్యాధులు వస్తాయంటున్నారు.

ఇక అత్యంత అరుదుగా రొమ్ము, గర్భాశయ, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఉన్న వారిలోనూ ఈ తరహా సమస్యలొచ్చే అవకాశాలున్నాయని కొన్ని కేసుల్ని విశ్లేషించి చెబుతున్నారు నిపుణులు.

ఇక కొంతమందిలో కండరాలు వైరల్‌ ఇన్ఫెక్షన్ల బారిన పడినప్పుడూ ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందట!

యూవీ రేడియేషన్‌, గాలి కాలుష్యం, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు.. వంటివి రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపడం వల్ల కూడా ఈ ఆటో-ఇమ్యూన్‌ వ్యాధి ముప్పు పెరుగుతుందంటున్నారు నిపుణులు.

అలాగే కొన్ని రకాల మందులు వాడడం వల్ల కూడా ఈ వ్యాధి ముప్పు పొంచి ఉంటుందట!

అదుపు చేసుకోవాల్సిందే!

పురుషులతో పోల్చితే మహిళలే రెట్టింపు సంఖ్యలో ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎంఆర్‌ఐ, ఎలక్ట్రోమయోగ్రఫీ, కండరాల బయాప్సీ, చర్మ బయాప్సీ.. వంటి పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధరిస్తారు. దీన్నుంచి బయటపడేందుకు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఇతర మందులు అందిస్తారు. అలాగే వీటితో పాటు ఫిజియోథెరపీ, అత్యవసర పరిస్థితుల్లో సర్జరీ కూడా చేస్తారట! అయితే చాలామందిలో ఇది పూర్తిగా నయం కాదని, ఆయా చికిత్సలతో చర్మ సమస్యల్ని, కండరాల బలహీనతను క్రమంగా తగ్గించుకొని లక్షణాల్ని అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్