ఇది సీతాయణం.. ఓ అమ్మ కథ!

రామాయణంలో సీతమ్మలా ధైర్యంగా, సమర్థంగా ఉండాలంటారు పెద్దలు. ‘అదేంటి? సీత అన్నీ కష్టాలే పడింది. ఏమంత ధైర్యవంతురాలు?  తండ్రి చూపిన రాముణ్ణి చేసుకుంది. భర్తను అత్తగారు  ఇంటి నుంచి వెళ్లగొడితే నోరెత్తలేదు. రావణచెరలో కుమిలిపోయిందే కానీ మారుమాట్లాడలేదు.

Updated : 30 Mar 2023 06:50 IST

రామాయణంలో సీతమ్మలా ధైర్యంగా, సమర్థంగా ఉండాలంటారు పెద్దలు. ‘అదేంటి? సీత అన్నీ కష్టాలే పడింది. ఏమంత ధైర్యవంతురాలు?  తండ్రి చూపిన రాముణ్ణి చేసుకుంది. భర్తను అత్తగారు  ఇంటి నుంచి వెళ్లగొడితే నోరెత్తలేదు. రావణచెరలో కుమిలిపోయిందే కానీ మారుమాట్లాడలేదు. మరి సీతమ్మలా ఉండమని చెబుతారేంటి?’ అనిపిస్తోందా?. పరిశీలించి చూస్తే ఆమె ఔన్నత్యం, ఆదర్శగుణాలు అవగతమవుతాయి...

లోచనలో పరిపక్వత, వివేకం, ధైర్యం, ఆత్మాభిమానం లాంటి సుగుణాలన్నీ కలబోసి పోతపోసిన బంగారు బొమ్మ సీతమ్మ. అసలు సీత లేనిదే రామాయణం లేదు. అందుకే ‘సీతాయాః చరితం మహత్‌’ అన్నారు. రామాయణానికి సీతా చరితమనే పేరు కూడా ఉంది. సీతలోని సుగుణాలు నేటికీ మనకు ఆదర్శమే. రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా సీతమ్మ ఘనత స్పష్టమవుతుంది. రాముడి గురించి తెలుసుకున్న జనకుడు అతడు తన అల్లుడయితే బాగుండుననుకున్నాడు. కల్యాణ సమయంలో జనక మహారాజు సీతను రాముడికి పరిచయం చేస్తూ- ‘ఈమె నా కూతురు.. సీత. నీకు సహధర్మచారిణి అవుతోంది’ అని చెప్పటంలో.. కారణజన్ముడైన రాముడికి తగిన స్థాయి ఆమెదనే ఉద్దేశం కనిపిస్తుంది. తండ్రిలాగే పరిపక్వ స్థితిలో ఉన్నందునే.. రాముడు శివధనుస్సు విరవగానే అతడి సామర్థ్యాన్ని గ్రహించి, తనకు తగినవాడనుకుంది. అసాధారణ జ్ఞాని జనకుడు. ఆయనకు సరితూగే స్థాయి ఉన్న జ్ఞానవంతురాలు సీత.

కుమిలిపోలేదు...

ఇల్లాలిగా తన భర్త బాధ్యతలు నిర్వహించడంలో, కర్తవ్యదీక్ష పాటించడంలో విజయవంతురాలైంది సీతమ్మ. రాముడు తండ్రి మాటకు కట్టుబడి అరణ్యవాసానికి బయల్దేరితే కుమిలిపోలేదు. తన సుఖం తాను చూసుకునే అవకాశమున్నా ఆ స్వార్థానికి లొంగలేదు. భర్త కర్తవ్యాన్ని గ్రహించి, ధైర్యంగా వెంట నడిచింది, కష్టసుఖాల్లో పాలుపంచుకుంది. ఆ తెగువలో గృహిణి క్రియాశీలత, భర్తకు కష్టం కలిగించకూడదన్న దృఢసంకల్పం కనిపిస్తాయి. తాను తండ్రి భావాలను అందిపుచ్చుకున్నట్లే తన బిడ్డలు లవకుశల పెంపకంలో, వారిని ప్రయోజకులను చెయ్యటంలో సీతమ్మ కృషి ఏ తరం వారికైనా ఆదర్శనీయమే.

అంతకష్టంలోనూ..

రావణుడు అపహరించుకుపోతుంటే.. శక్తికొద్దీ ఎదుర్కొంది. శారీరకశక్తి చాలదని అర్థమైనా ఆత్మస్థైర్యాన్ని వదలలేదు. బుద్ధిబలాన్ని ఉపయోగించింది. భవిష్యత్తు ఊహించి తన నగలను మూట కట్టి ఆకాశమార్గం నుంచి కిందికి జార విడిచింది. ఆమె ముందుచూపు ఎలా ఫలించిందో మనకు తెలిసిందే!

ధైర్యశాలి..

సీతను అశోకవనంలో ఉంచిన రావణుడు ఎన్నో ప్రలోభాలు పెట్టాడు, భయభ్రాంతులకు గురిచేశాడు. కానీ స్థిరచిత్తంతో ఆ కష్టాలను గడ్డిపోచలా చూసిందే గానీ ఆత్మత్యాగం లాంటి పిరికి ఆలోచనలు చేయలేదు. తనను వెతుక్కుంటూ వచ్చిన హనుమ రామయ్య దగ్గరకు తీసుకెళ్తానన్నప్పుడు శత్రువును ఎదుర్కొని విజయం సాధించటమే లక్ష్యమనుకుంది. పోరాటపటిమే తప్ప పలాయనవాదం సరికాదని నమ్మింది. అంతటి ధీరవనిత సీతమ్మ. అలా ఎదురైన ప్రతి కష్టాన్నీ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంది. అది అగ్నిప్రవేశ ఘట్టం కావొచ్చు, ఆ తర్వాత నిండు గర్భిణిగా వనవాసానికి వెళ్లాల్సివచ్చినప్పుడు కావొచ్చు. కృశించి, నశించలేదు. ఆయా సందర్భాల్లో తాత్కాలికంగా దుఃఖించినా.. కష్టాలు సహజం, వాటికి కుంగిపోక ధైర్యంగా ఎదుర్కోవాలి, బాధ్యతలను నెరవేర్చాలి, విజయ లక్ష్యంతో ముందుకు సాగాలనే సందేశం పంచే ఆరాధ్య స్త్రీమూర్తి సీతామాత.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్