No Diet Day: నచ్చింది తిందాం.. మనల్ని మనం ప్రేమించుకుందాం!

బరువు పెరిగిపోతామేమోనని నచ్చినవి తినడం మానేస్తుంటారు కొందరు.. డైటింగ్‌ పేరుతో నోరు కట్టేసుకుంటారు మరికొందరు.. లావైతే శరీరాన్ని అసహ్యించుకునే వారూ లేకపోలేదు. ఇవన్నీ ఆరోగ్యాన్నే కాదు.. మనసునూ దెబ్బతీస్తాయి.

Published : 07 May 2024 13:03 IST

బరువు పెరిగిపోతామేమోనని నచ్చినవి తినడం మానేస్తుంటారు కొందరు.. డైటింగ్‌ పేరుతో నోరు కట్టేసుకుంటారు మరికొందరు.. లావైతే శరీరాన్ని అసహ్యించుకునే వారూ లేకపోలేదు. ఇవన్నీ ఆరోగ్యాన్నే కాదు.. మనసునూ దెబ్బతీస్తాయి. కోరి కోరి ఈ సమస్యల్ని కొనితెచ్చుకోవడం కంటే.. నచ్చినవి తింటూ, ఎలా ఉన్నా శరీరాన్ని అంగీకరిస్తే అంతకంటే ఆరోగ్యం ఇంకేముంటుంది? ఇదే పాజిటివిటీని చాటి చెబుతోంది ‘అంతర్జాతీయ నో డైట్‌ డే’. ఆహార కోరికల్ని సంతృప్తిపరుస్తూనే.. అన్ని రకాల శరీరతత్వాలు, శరీరాకృతుల్ని అంగీకరించడం, గౌరవించడమే ఈ రోజు ముఖ్యోద్దేశం. నిజానికి ఈ ప్రత్యేకమైన రోజును ప్రారంభించడం వెనుక ఓ మహిళ కృషి దాగుంది.. ఇంతకీ ఆమె ఎవరంటే..?!

బాడీ షేమింగ్‌, ఫ్యాట్‌ షేమింగ్‌కు చెక్‌ పెడుతూ ఎలా ఉన్నా మనల్ని మనం అంగీకరించడం, స్వీయ ప్రేమను పెంపొందించుకోవడం ముఖ్యం. ఇదే విషయాన్ని చాటి చెబుతోంది ‘అంతర్జాతీయ నో డైట్‌ డే’. ఈ ప్రత్యేకమైన రోజును 1992 మే 6న ప్రారంభించారు బ్రిటిష్‌ ఫెమినిస్ట్‌ మేరీ ఎవాన్స్‌ యంగ్‌. ప్రస్తుతం యూకేతో పాటు యూఎస్‌, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, భారత్‌, ఇజ్రాయెల్‌, డెన్మార్క్‌, స్వీడన్‌, బ్రెజిల్‌ తదితర దేశాల్లో ‘నో డైట్‌ డే’ను సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.

(Photo: Twitter)

ఆమే ఆద్యురాలు!

‘నో డైట్‌ డే’కు ఆద్యురాలైన మేరీ చిన్న వయసు నుంచి కాస్త బొద్దుగా ఉండేవారు. దీంతో ఒకానొక దశలో ఆమె అధిక బరువుపై విమర్శలొచ్చాయి. వీటిని చాలా సీరియస్‌గా తీసుకున్న ఆమె.. బరువు తగ్గి నాజూగ్గా మారడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పలు ఆహార నియమాలు పాటించడంతో పాటు తన ఆహారపు కోరికలకూ కళ్లెం వేసుకున్నారు. ఇదే దీర్ఘకాలంలో ఆమెను అనొరెక్సియా (ఇదొక ఈటింగ్‌ డిజార్డర్‌) బారిన పడేసింది. దీంతో ఆస్పత్రి పాలైన ఆమె.. చికిత్స తీసుకొని సమస్య నుంచి బయటపడడమే కాకుండా.. తనలా మరొకరు బాధపడకుండా.. ఆయా సమస్యలపై అందరిలో అవగాహన కల్పించాలనుకున్నారు. ఈ ఆలోచనతోనే ‘నో డైట్‌ డే’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారామె. అయితే తొలుత మే 5న దీన్ని ప్రారంభించారామె. ఈ రోజున 21-76 ఏళ్ల మధ్య వయసున్న 12 మంది మహిళలు లండన్‌లోని హైడ్‌ పార్క్‌కి చేరుకొని.. ‘Ditch That Diet’ అనే స్టిక్కర్స్‌ ధరించి.. అందరిలో అవగాహన కల్పించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల సూచనల మేరకు ఈ తేదీని మే 6కు మార్చారు. అప్పట్నుంచి ఈ ప్రత్యేకమైన రోజును సెలబ్రేట్‌ చేసుకుంటూ.. ఎలా ఉన్నా సరే.. తమను తాము అంగీకరిస్తూ స్వీయ ప్రేమ ప్రాధాన్యతను చాటుతున్నారు ఆయా దేశాల్లోని మహిళలు.

ప్రతిదీ పాజిటివ్‌గానే!

ఈ ‘నో డైట్‌ డే’ ప్రాముఖ్యతను చాటడానికి ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.. అవేంటంటే..!

⚛ సరైన ఆహార నియమాలు పాటించేలా అందరిలో అవగాహన కల్పించడం..

⚛ వ్యక్తిగత అవసరాల రీత్యా ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించేవారు.. ఈ రోజు మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి నచ్చిన ఆహారం తీసుకునేలా ప్రోత్సహించడం..

⚛ విభిన్న శరీరతత్వాలు, శరీరాకృతుల్ని ప్రోత్సహిస్తూ.. స్వీయ ప్రేమను పెంచుకునేలా వెన్నుతట్టడం..

⚛ బాడీ షేమింగ్‌, ఫ్యాట్‌ షేమింగ్‌.. వంటి వివక్షను అంతమొందించేలా చర్యలు తీసుకోవడం..

⚛ వేగంగా బరువు తగ్గేందుకు ఉపయోగపడే క్రాష్‌ డైట్లతో తలెత్తే సమస్యలపై అవగాహన పెంచడం..

⚛ వివిధ రకాల ఈటింగ్‌ డిజార్డర్లతో బాధపడుతోన్న వారిని చేరదీసి.. ఆయా సమస్యల నుంచి బయటపడేసేందుకు వారికి సహకరించడం..

⚛ కార్యాలయాల్లో/పని ప్రదేశాల్లో.. సహోద్యోగుల్ని బాడీ షేమింగ్ చేయకుండా.. వాళ్లలో ఉన్న ప్రత్యేకమైన నైపుణ్యాల్ని, వాళ్లు సాధించే విజయాల్ని ప్రశంసించడం..

ఈ రోజు ఏం చేయాలంటే..?!

‘నో డైట్‌ డే’లో భాగంగా స్వీయ ప్రేమను పెంపొందించుకోవాలంటే వ్యక్తిగతంగా కొన్ని నియమాలు పాటించాలంటున్నారు నిపుణులు.

⚛ కొవ్వులు, క్యాలరీల సంగతి పక్కన పెట్టి.. మనసుకు నచ్చిన ఆహారం తీసుకోవాలి. తద్వారా మనసు, జిహ్వ.. రెండూ తృప్తి పడతాయి.

⚛ బరువు తూచుకోవడాలు, నడుం కొలుచుకోవడాలు, తమను తాము విమర్శించుకోవడం.. వంటివన్నీ పక్కన పెట్టి.. మిమ్మల్ని మీరు నిజాయతీగా స్వీకరించండి.. ఆ క్షణం మనసు ఎంత సంతోషపడుతుందో స్వయంగా ఆస్వాదించచ్చు.

⚛ ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత దాగుంటుంది.. ఈ రోజున దాన్ని వెలికితీయండి. మీకు మీరు కొత్తగా కనిపిస్తారు.. పాజిటివిటీతో అడుగు ముందుకు వేయగలుగుతారు.

⚛ వంట రాని వారు కూడా.. నచ్చిన రెసిపీ తయారుచేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఈ రోజున మీరూ అలాంటి ప్రయత్నమే చేయచ్చు.. ఇది మీకు కొత్త అనుభూతిని అందించడమే కాదు.. మీలో ఉన్న పాకశాస్త్ర నైపుణ్యాలూ మీకు అవగతమవుతాయి.. అయినా వంటను మించిన థెరపీ మరేముంది చెప్పండి?!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్