కళలకు వారసులు!

వందల ప్రదర్శనలు, వేలమంది శిష్యులు.. ఎన్నో అవార్డులు... మరెన్నో రివార్డులు ఈ కళామతల్లి ముద్దుబిడ్డల కీర్తి కిరీటాలు. సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని అందిపుచ్చుకుని... తమ ప్రతిభను విశ్వవ్యాప్తం చేస్తోన్న వీరిని తాజాగా సంగీత, నాటక అకాడమీ అవార్డులు వరించాయి. ఈ సందర్భంగా...

Updated : 25 Feb 2023 01:34 IST

వందల ప్రదర్శనలు, వేలమంది శిష్యులు.. ఎన్నో అవార్డులు... మరెన్నో రివార్డులు ఈ కళామతల్లి ముద్దుబిడ్డల కీర్తి కిరీటాలు. సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని అందిపుచ్చుకుని... తమ ప్రతిభను విశ్వవ్యాప్తం చేస్తోన్న వీరిని తాజాగా సంగీత, నాటక అకాడమీ అవార్డులు వరించాయి. ఈ సందర్భంగా...

అందుకు ఆనందం..

ళ్లారికి చెందిన జమిందారు కుటుంబం మాది. సంగీతంలో తాతగారు శ్రీనివాసశాస్త్రి నా మొదటి గురువు. శిక్షణ లేకపోయినా ఆయన ఫ్లూట్‌ వాయిస్తోంటే రాగాలను అలవోకగా గుర్తించేదాన్ని. అదిచూసి సంగీత పాఠాలు ప్రారంభించారు. తర్వాత మంగళంపల్లి బాలమురళి కృష్ణ, టీవీ గోపాలకృష్ణ వంటి ప్రముఖుల వద్ద శిష్యరికం చేశా. మహతి, సుముఖం, లవంగి, సర్వస్వి, సిద్ధి వంటి అరుదైన రాగాలను గురువు బాలమురళికృష్ణ వద్దే నేర్చుకున్నా. వెంకట రమణా రాంమూర్తితో వివాహమయ్యాకా సంగీత సాధన కొనసాగింది. కానీ ఊహించని రీతిలో మావారు దూరమయ్యారు. కుంగిపోయా. కానీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లోనే దాచుకుని ముందడుగు వేశా. సంగీత కచేరీలు చేస్తూనే, ఆసక్తి ఉన్నవారికి నేర్పించేదాన్ని. సంగీత సరస్వతి, అమృతవర్షిణి, దక్షిణ భారత ప్రవీణ్‌ సుల్తాన వంటివాటితో పాటూ అంతర్జాతీయంగా న్యూయార్క్‌ రాక్‌ ఫౌండేషన్‌ అవార్డునీ అందుకున్నా. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల సంగీత ఉత్సవాల్లో పాల్గొన్నా. కచేరీలు చేశా. నా మ్యూజిక్‌ కంపోజిషన్లకు రెండుసార్లు జాతీయస్థాయి పురస్కారాలొచ్చాయి. తాతయ్య నుంచి వంశపారంపర్యంగా ఫ్లూట్‌ వాయించే కళ మా అమ్మాయి జయప్రదకు వచ్చింది. అబ్బాయి కన్నన్‌ ఉద్యోగి. నా మనవరాళ్లు అద్భుతంగా పాడతారు. ఇక, నా శిష్యులు ప్రపంచవ్యాప్తంగా ఈ కళను విస్తృతం చేస్తున్నారు. ఇవన్నీ నాకెంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగించేవే!


ప్రాచుర్యం కల్పించాలనీ

నాలుగు దశాబ్దాల ప్రయాణం! నృత్యంపై చిన్నప్పట్నుంచీ ఆసక్తున్నా 18వ ఏట దిల్లీలోని ‘కథక్‌ కేంద్ర’లో శిక్షణకి చేరా. నేషనల్‌ స్కాలర్‌షిప్‌నీ సాధించా. హైదరాబాదీ కోడలిని. పుట్టింది మాత్రం మహారాష్ట్రలో. కథక్‌ కేంద్రలోనే మావారు రాఘవ్‌తో పరిచయం, పెళ్లి జరిగిపోయాయి. ఇద్దరి జీవితాల్లో నృత్యం ముఖ్య భాగమే! దాన్ని మరింత మందికి చేరువ చేయాలని హైదరాబాద్‌లో ‘ఆకృతి కథక్‌ కేంద్ర’ ప్రారంభించాం. మా విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఐసీసీఆర్‌, దూరదర్శన్‌ సంగీతభారతి, కథక్‌ కేంద్రలతో కలిసి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టులకు పనిచేశా. ఇండియన్‌ కల్చరల్‌ సెంటర్‌లో కథక్‌ బోధించా. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో గెస్ట్‌ లెక్చర్లిస్తుంటా. కథక్‌ సిలబస్‌ రూపకల్పనలోనూ భాగమయ్యా. దేశీయంగానే కాదు.. యూఎస్‌ఏ, కెనడా, యూకే, జర్మనీ.. వంటి ఎన్నో దేశాల్లో ప్రదర్శనలిచ్చా. మావారితో కలిసి కొన్ని నృత్యరూపకాలను రూపొందించా. ఏటా ‘అంతరంగ్‌’ పేరుతో మ్యూజిక్‌, డ్యాన్స్‌ ఫెస్ట్‌నీ నిర్వహిస్తుంటాం. కథక్‌కి జాజ్‌ డ్రమ్స్‌, కళరియపట్టు, గజల్స్‌ వంటి ఎన్నింటినో జోడిస్తున్నాం. కళ ఏదైనా సమాజానికి సాయపడాలని నమ్ముతా. అందుకే హీల్‌ ఎ చైల్డ్‌, రోట్రాక్ట్‌ వంటి ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తున్నా. తెలుగు ప్రభుత్వాలతోపాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నా. తాజాగా మావారితో జతగా 2019కిగానూ జాతీయ సంగీత, నాటక అకాడమీ అవార్డు దక్కడం ఆనందంగా ఉంది. శాస్త్రీయ నృత్యానికి ప్రాచుర్యం కల్పించాలన్నది నా కల.


అదే నా లక్ష్యం...

లూరులో మా ఇంటెదురుగా వేదాంతం ప్రహ్లాద శర్మగారి నాట్య శిక్షణా సంస్థ ఉండేది. మూడేళ్ల వయసులో అక్కడే కూచిపూడి జతులకు పాదం కదపడం నేర్చుకున్నా. చదువుతో సమానంగా నృత్యానికీ ప్రాధాన్యం ఇచ్చేదాన్ని. ఎన్నో ప్రదర్శనలిచ్చా. దీన్నే కెరియర్‌గా ఎంచుకుందామనుకున్నప్పుడు దర్శకుడు కె.విశ్వనాథ్‌ ‘సిరిసిరి మువ్వ సింహనాదం’లో హీరోయిన్‌ అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల విడుదలవ్వలేదు. ఈలోగా నాట్య గురువు విఠల్‌తో వివాహమైంది. ఆయన కూచిపూడి నాట్యరీతిని వారసత్వంగా ఎంచుకున్న పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ గారబ్బాయి. యామినీ కృష్ణమూర్తి పిలుపుతో దిల్లీలో కూచిపూడి శిక్షణ ఇవ్వడానికొచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. పెళ్లయ్యాక నేనూ ఆయనకు తోడవ్వడంతో కూచిపూడి గ్రామ పరంపరలో నాట్యాన్ని కెరియర్‌గా ఎంచుకున్న తొలి జంటగా గుర్తింపొచ్చింది. ప్రస్తుతం ఇక్కడే ‘కూచిపూడి కళాకేంద్ర’ పేరుతో నృత్య శిక్షణ ఇస్తున్నాం. జర్మనీ, రష్యా, బ్రెజిల్‌, పోలండ్‌, అమెరికా... ఇలా దేశ విదేశాల్లో మూడువేలకు పైగానే ప్రదర్శనలిచ్చా. మాపాప.. ఇంద్రలేఖ కూడా డ్యాన్సరే. నృత్యంలో నేషనల్‌ స్కాలర్‌. అమెరికాలో ఎంఎస్‌ పూర్తిచేసింది. నా ప్రదర్శనలతో ఎంత గుర్తింపు వచ్చినా ఆరేళ్లప్పుడు బాలల అకాడమీ అందించిన ఉత్తమ నృత్యకారిణి అవార్డు నాకెప్పటికీ మధుర జ్ఞాపకమే. తాజాగా కేంద్ర ప్రభుత్వం 2020కి గానూ కూచిపూడి నృత్యకళాకార దంపతులుగా మమ్మల్ని సత్కరించింది. ఇది మా బాధ్యతను మరింత పెంచింది. కూచిపూడి మా వారసత్వం... ఈ కళనూ, చరిత్రనూ సజీవంగా ఉంచడమే మా లక్ష్యం.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్