Mary Millben: ‘జనగణమన’.. మళ్లీ ఆమె నోట!

మన దేశమన్నా, ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు-ఆచార వ్యవహారాలన్నా విదేశీయులు ఒక ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తుంటారు. కొంతమంది విదేశీ వనితలు కట్టూబొట్టూ విషయంలోనూ మనల్ని ఫాలో అవడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. మరికొంతమంది ఇక్కడి సంగీతానికి చెవి కోసుకుంటారు. నచ్చిన పాటల్ని

Updated : 27 Dec 2022 17:18 IST

మన దేశమన్నా, ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు-ఆచార వ్యవహారాలన్నా విదేశీయులు ఒక ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తుంటారు. కొంతమంది విదేశీ వనితలు కట్టూబొట్టూ విషయంలోనూ మనల్ని ఫాలో అవడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. మరికొంతమంది ఇక్కడి సంగీతానికి చెవి కోసుకుంటారు. నచ్చిన పాటల్ని తమ గాత్రంలో ఆలపిస్తూ, డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌తో.. భారతీయుల మెప్పు పొందుతారు. ప్రఖ్యాత అమెరికన్‌ గాయని మేరీ మిల్బెన్‌ కూడా అలాగే ఎంతోమంది భారతీయులకు సుపరిచితురాలైంది. ఏకంగా భారత జాతీయ గీతాన్నే తన గళంలో ఆలపించి.. కోట్లాది మంది భారతీయుల మనసు కొల్లగొట్టిందామె. ఇక ఈసారి భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా మేరీకి ఆహ్వానం అందింది. ‘భారత సాంస్కృతిక సంబంధాల మండలి’ ఆహ్వానం మేరకు అమెరికా అధికార ప్రతినిధిగా దిల్లీ వేడుకలకు హాజరు కానుందామె. అంతేకాదు.. ఈ తరహా ఆహ్వానం అందుకున్న తొలి అమెరికన్‌ గాయనిగానూ నిలిచింది మేరీ. ‘భారత పర్యటనను ఓ తీర్థయాత్రతో పోల్చిన’ ఈ ప్రత్యేక అతిథి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

భారత స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఏటా విదేశీ అతిథులు రావడం పరిపాటే! అయితే ఈ ఏడాది తొలిసారి ఓ అమెరికన్‌ గాయని స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొననుంది. ఆమే.. మేరీ మిల్బెన్‌. ‘భారత సాంస్కృతిక సంబంధాల మండలి’ ఆహ్వానం మేరకు అమెరికా అధికార ప్రతినిధిగా భారత్‌లో అడుగుపెట్టిన ఆమె.. ఇటీవలే దిల్లీలోని ‘ఇండియా స్పోరా గ్లోబల్‌ ఫోరమ్‌’లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఆ వేదికగా ‘జనగణమన’ అంటూ మరోసారి తన నోట భారత జాతీయ గీతాలాపన చేసిందామె. చెన్నైకి చెందిన పియానో కళాకారుడు లిడియన్‌తో కలిసి ఆమె ఇచ్చిన ఈ ప్రదర్శన మరోసారి భారతీయుల మనసు దోచుకుందనడంలో సందేహం లేదు. ఇదే ఉత్సాహంతో వజ్రోత్సవ వేడుకలకూ హాజరుకానుందీ అమెరికన్‌ గాయని.

ఆ రెండు పాటలతో మది దోచింది!

మేరీకి భారత్‌ అన్నా, ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలన్నా వల్లమాలిన అభిమానం. వృత్తిరీత్యా గాయని అయిన ఆమె భారతీయ సంగీతాన్ని కూడా అభిమానిస్తుంది. ఈ మక్కువతోనే రెండు భారతీయ పాటల్ని ఆలపించి.. కోట్లాది మంది భారతీయుల్ని తన అభిమానుల్ని చేసుకుంది మేరీ. ఈ క్రమంలోనే 2020లో స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా.. భారత జాతీయ గీతం ‘జనగణమన’ను వర్చువల్‌గా పాడి యూట్యూబ్‌ వీడియో రూపొందించింది. ఇక అదే ఏడాది దీపావళి వేడుకల్లో భాగంగా.. ‘ఓం జయ్‌ జగదీశ్‌ హరే!’ అనే భక్తి పాటను ఆలపించింది. భారతీయ సంప్రదాయ కట్టూబొట్టు ధరించి తాను చేసిన ఈ రెండు యూట్యూబ్‌ వీడియోల్ని భారతీయులతో పాటు విదేశీయులూ ఎంతగానో అభిమానించారు. అలా ఆ రెండు పాటలతో భారతీయులకు మరింత చేరువైంది మేరీ.

పర్యటన కాదు.. తీర్థయాత్ర!

ఈ ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న స్వాతంత్ర్య వజ్రోత్సవాలకు భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందుకున్న క్షణం ఎగిరి గంతేశానంటోంది మేరీ. ఈ యాత్ర తనకెన్నో మధురానుభూతుల్ని పంచుతుందంటోందీ అమెరికన్‌ గాయని. ‘భారత్‌ రావాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. భారత వజ్రోత్సవాలకు గానీ నా కోరిక తీరలేదు. ఈ ఆహ్వానం అందుకున్న వెంటనే నాకు డా.మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ మాటలు గుర్తొచ్చాయి. ఆయన మొదటిసారి ఇండియాకు రాబోయే ముందు ‘ఇతర దేశాలకు నేనో పర్యాటకుడిగా వెళ్తానేమో గానీ, భారత్‌కు మాత్రం యాత్రికుడిగా వస్తా..’ అన్నారాయన. నేను కూడా ఆయన మార్గాన్నే అనుసరిస్తున్నా. తీర్థయాత్ర లాంటి ఈ ప్రయాణంలో భారత్‌లో ఓ యాత్రికురాలిగా పర్యటిస్తున్నా.. ఓ సాంస్కృతిక రాయబారిగా ఇరు దేశాల మధ్య స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం కృషి చేస్తాను..’ అంటూ తన మనసులోని మాటల్ని పంచుకుంది మేరీ.

ఐదేళ్ల ప్రాయం నుంచే..!

* అమెరికాలోని ఒక్లహామా సిటీలో జన్మించింది మేరీ మిల్బెన్‌. ఆమె తండ్రి మిచెల్‌ మిల్బెన్‌.. బాప్టిస్ట్‌. తల్లి అల్‌థియా మిల్బెన్‌.. గాయని! అయితే కొన్నాళ్లకు తన తల్లిదండ్రులిద్దరూ విడాకులు తీసుకోవడంతో మేరీ తన తల్లి వద్దే పెరిగింది.

* ఇలా రక్తంలోనే సంగీతాన్ని నింపుకొన్న మేరీ ఐదేళ్ల వయసు నుంచే సంగీత సాధన మొదలుపెట్టింది.

* ఒక్లహామా యూనివర్సిటీలో సంగీత సాహిత్యంలో పైచదువులు చదివిన ఆమె.. ఆ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగానూ కొనసాగింది. ఈ ఘనత సాధించిన రెండో ఆఫ్రికన్‌-అమెరికన్‌గా నిలిచింది మేరీ.

* జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైట్‌ హౌస్‌లో ఇంటర్న్‌గా పనిచేసింది మేరీ.

* ఎక్కువగా ఆటల ప్రారంభోత్సవ వేడుకలు, అవార్డుల ప్రదానోత్సవాలు, సంగీత కచేరీల్లో తన ప్రదర్శనలతో ఎంతోమంది సంగీతాభిమానుల్ని సొంతం చేసుకున్న ఆమె.. జార్జ్‌ బుష్‌, బరాక్‌ ఒబామా, ట్రంప్‌.. ఇలా వరుసగా ముగ్గురు అమెరికా అధ్యక్షుల విజయోత్సవ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చిన గాయనిగా ఘనత సాధించింది.

* అమెరికాలో జరిగే వివిధ కార్యక్రమాల్లో, వేడుకల్లో ఆ దేశ జాతీయ గీతాలాపనతో ప్రపంచవ్యాప్త సంగీత అభిమానుల మనసు దోచుకుందీ పాపులర్‌ సింగర్‌.

* అమెరికాలో నివాసముండే భారతీయులు, తెలుగు వారు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలు, వేడుకల్లోనూ పాల్గొని ప్రదర్శనలిస్తుంటుంది మేరీ. అంతేకాదు.. భారతీయులతో దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో పంచుకోవడం, ప్రత్యేక సందర్భాల్లో భారత ప్రజలకు విష్‌ చేయడం ఈ గాయనికి అలవాటు! ఇలా భారత్‌పై తనకున్న మమకారాన్ని చాటుకుంటుంది.

* తన సింగిల్స్, యూట్యూబ్‌ వీడియోలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు సంపాదించిన మేరీ.. ‘Ideagen's 2020 Power 10 List’.. వంటి జాబితాలో స్థానం సంపాదించి సత్తా చాటింది.

* ప్రస్తుతం అమెరికా సాంస్కృతిక రాయబారిగా కొనసాగుతోన్న మేరీ.. మరోవైపు ‘ఎడ్యుకేషన్‌ ఆఫ్రికా’ అనే స్వచ్ఛంద సంస్థకు గ్లోబల్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా చిన్నారుల విద్య, మహిళలు-బాలికల ఉన్నతికి కృషి చేస్తూనే.. పేదల అభ్యున్నతికి పాటుపడుతోందామె.

* మేరీకి చైనా భాష మాండరిన్‌లోనూ ప్రావీణ్యముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్