ఇది ‘బామ్మ’ల కిచెన్!

ఒక్కో దేశం ఒక్కో రకమైన సంప్రదాయ వంటకాలకు ప్రసిద్ధి. మరి, ఆ రుచుల్ని టేస్ట్‌ చేయాలంటే ఆయా దేశాల్ని సందర్శించాల్సిందే అనుకుంటాం.. కానీ ఆ శ్రమ లేకుండా, అంత ఖర్చు పెట్టకుండా న్యూయార్క్‌లోని ‘Enoteca Maria’ అనే రెస్టరంట్‌కి వెళ్తే చాలు.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రాచీన, సంప్రదాయ వంటకాలతో జిహ్వ తృప్తి పడుతుంది.

Updated : 02 Feb 2024 21:33 IST

(Photos: Instagram)

ఒక్కో దేశం ఒక్కో రకమైన సంప్రదాయ వంటకాలకు ప్రసిద్ధి. మరి, ఆ రుచుల్ని టేస్ట్‌ చేయాలంటే ఆయా దేశాల్ని సందర్శించాల్సిందే అనుకుంటాం.. కానీ ఆ శ్రమ లేకుండా, అంత ఖర్చు పెట్టకుండా న్యూయార్క్‌లోని ‘Enoteca Maria’ అనే రెస్టరంట్‌కి వెళ్తే చాలు.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రాచీన, సంప్రదాయ వంటకాలతో జిహ్వ తృప్తి పడుతుంది. అది కూడా మోడ్రన్‌ వంటకాలు కాదు.. బామ్మల కాలం నాటి సంప్రదాయ రుచులతో కడుపు నిండిపోతుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన వంటకాలు, అందులోనూ సంప్రదాయ రుచులన్నీ ఒకే రెస్టరంట్లో.. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఈ ‘బామ్మల కిచెన్‌’ గురించి తెలుసుకోవాల్సిందే!

ఇంట్లో బామ్మలు చేసే సంప్రదాయ వంటకాల్లో రుచే కాదు.. ఆరోగ్యం కూడా దాగుంటుంది. 1999 వరకు ఇలానే తన బామ్మ చేతి వంటకాల్ని ఆస్వాదించారు ఇటలీకి చెందిన జో స్కారావెల్లా అనే వ్యాపారవేత్త. అయితే అదే ఏడాది ఆయన బామ్మ చనిపోయినప్పట్నుంచి తాను, తన కుటుంబం సంప్రదాయ వంటకాలకు దూరమైంది.. ఇలా ఎన్నో ఏళ్ల పాటు ప్రాచీన రుచులకు నోచుకోలేకపోయిన జో.. దీన్ని భర్తీ చేసే ఆలోచనలో పడ్డారు. ఇదే 2007లో న్యూయార్క్‌లోని స్టాటెన్‌ ఐల్యాండ్‌లో ఓ ఇటాలియన్‌ రెస్టరంట్‌ ప్రారంభించేందుకు కారణమైంది.

ప్రత్యేకత అదే!

ఈ రెస్టరంట్‌ పేరు ‘Enoteca Maria’. ఇది న్యూయార్క్‌లో ఉన్న ప్రముఖ రెస్టరంట్లలో ఒకటిగా పేరుగాంచింది. ఇక దీనికున్న ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో వంట చేసే చెఫ్‌లందరూ బామ్మలే! తన బామ్మ చేతి ఇటాలియన్‌ రుచుల్ని తిరిగి పొందాలన్న ముఖ్యోద్దేశంతోనే జో దీన్ని ప్రారంభించారు. అయితే మొదట్లో ఈ రెస్టరంట్లో అందరూ ఇటాలియన్‌ బామ్మల్నే పనిలో పెట్టుకున్నారట జో. వాళ్లు వండి వార్చే సంప్రదాయ వంటకాలతో అక్కడి ఫుడ్‌ లవర్స్‌కి విందు చేయడం ప్రారంభించారాయన. ఇక ఈ బామ్మలు చేసే వంటకాలూ అక్కడి వారికి నచ్చడంతో తక్కువ సమయంలోనే పాపులారిటీని సంపాదించిందీ రెస్టరంట్‌. అయితే కాలక్రమేణా ఇందులో ఇటాలియన్‌ రుచులతో పాటు.. ఇతర దేశాల రుచుల్ని, అక్కడి సంప్రదాయ వంటకాల్నీ భాగం చేయాలనుకున్నారు జో. ఇదే ఆలోచనతో.. విదేశాలకు చెందిన బామ్మల్నీ తన కిచెన్‌లో రిక్రూట్‌ చేసుకోవడం ప్రారంభించారు. అలా ఈ రెస్టరంట్లో ఇటాలియన్‌ బామ్మలతో పాటు జపాన్, పెరు, శ్రీలంక, ఫిలిప్పీన్స్‌.. తదితర దేశాలకు చెందిన బామ్మలు తమ స్వదేశీ వంటకాలతో అక్కడి ఆహార ప్రియుల్ని ఆకట్టుకుంటున్నారు.

రోజూ మారే మెనూ!

ఇక ఈ బామ్మల్ని న్యూయార్క్‌ వాసులు ‘నోనాస్’ అని ముద్దుగా పిలుచుకుంటారట! ఇక ఈ కిచెన్‌లో పనిచేసే బామ్మలందరూ 50-91 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారేనట! వీళ్లలో చాలామంది భర్త చనిపోయి ఒంటరైన వారు, పిల్లలు వదిలేసిన వారే ఎక్కువట! వంటలపై ఆసక్తి, తమ దేశాలకు చెందిన సంప్రదాయ వంటకాల్ని పరిచయం చేయాలన్న ఆసక్తితోనే ఈ కిచెన్‌లో అడుగుపెట్టినట్లు ఈ బామ్మలు చెబుతున్నారు. ఇక వీరిలోనూ కొందరు శాకాహార, మరికొందరు మాంసాహార, ఇంకొందరు వీగన్‌ వంటకాలు చేయడంలో సిద్ధహస్తులట! సగం ఇటాలియన్‌ వంటకాలు, మిగతా సగం విదేశీ వంటకాలతో కూడిన మెనూను ఈ రెస్టరంట్లో రోజూ రూపొందిస్తారట! మరుసటి రోజు రూపొందించే వంటకాలేంటో తెలుసుకోవాలని ఇక్కడికొచ్చే ఆహార ప్రియులు ముందు రోజు నుంచే ఆరాటపడుతుంటారట! ఇక తమ రెస్టరంట్లోని ఎలక్ట్రిక్‌ మెనూ, ఆతిథ్యం.. స్థానికులకు, పర్యటకులకు ప్రత్యేకమైన అనుభూతుల్ని పంచుతుందని జో చెబుతున్నారు. ఇలా మొత్తానికి ఈ కిచెన్ ‘నోనాస్ఆఫ్‌ ది వరల్డ్‌’గా మారిపోయింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్