‘Best Actress’ Aparna: ‘ఆకాశమే హద్దురా’ అంటూ..!

‘బరువైన పాత్రతో పాటు.. కథకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటించడానికే ఇష్టపడతా’నంటోంది మలయాళ తార అపర్ణా బాలమురళి. తన అందం, అభినయంతో.. పలు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి అక్కడి సినీ ప్రేక్షకులకు చేరువైన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ‘ఉత్తమ నటి’గా.....

Updated : 17 Aug 2022 12:48 IST

(Photos: Instagram)

‘బరువైన పాత్రతో పాటు.. కథకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటించడానికే ఇష్టపడతా’నంటోంది మలయాళ తార అపర్ణా బాలమురళి. తన అందం, అభినయంతో.. పలు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి అక్కడి సినీ ప్రేక్షకులకు చేరువైన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ‘ఉత్తమ నటి’గా జాతీయ పురస్కారం అందుకుంది. ‘సూరారై పోట్రు’ సినిమాలో (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం) నటనకు గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న ఈ కేరళ కుట్టి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

🟇 అపర్ణా బాలమురళి.. తెలుగు వారికి ఈ పేరు కొత్త కావచ్చు.. కానీ తమిళ, మలయాళ సినీ ప్రేక్షకులకు ఏడేళ్లుగా ఈ పేరు సుపరిచితమే. 1995, సెప్టెంబర్‌ 11న కేరళలోని త్రిస్సూరులో జన్మించిందీ ముద్దుగుమ్మ.

🟇 స్థానికంగా స్కూలింగ్‌ పూర్తి చేసిన ఆమె.. పాలక్కడ్‌లోని ‘గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌’లో ఉన్నత విద్యను అభ్యసించింది.

🟇 అపర్ణది సినీ నేపథ్యమున్న కుటుంబం. ఆమె తండ్రి కేపీ బాలమురళి సినీ సంగీత దర్శకుడు. తల్లి శోభ లాయర్.

🟇 తండ్రిని చూసి తానూ సంగీతంపై ప్రేమ పెంచుకుంది అపర్ణ. ఈ మక్కువతోనే చిన్న వయసులోనే శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకుంది. అంతేకాదు.. పలు తమిళ, మలయాళ చిత్రాల్లో కొన్ని పాటలు పాడి గాయని గానూ గుర్తింపు తెచ్చుకుందామె.

🟇 మరోవైపు నటిగానూ తనను తాను నిరూపించుకోవాలని ఆశ పడిందామె. అందుకు తగినట్లుగానే.. 18 ఏళ్ల వయసులో ఆ అవకాశం ఆమెను వరించింది. 2013లో ‘యాత్ర తుదరున్ను’ అనే మలయాళ చిత్రంతో వెండితెరకు పరిచయమైందామె. మరోవైపు ‘8 బుల్లెట్స్‌’ అనే చిత్రంతో తమిళంలోనూ అరంగేట్రం చేసింది అపర్ణ.

🟇 ఈ ఏడేళ్ల కాలంలో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించినా.. ‘మహేషింటే ప్రతీకారం’, ‘సండే హాలిడే’, ‘సూరారై పోట్రు’.. వంటి సినిమాల్లోని పాత్రలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

🟇 సూర్య సరసన ‘సూరారై పోట్రు’ చిత్రంలో ‘బొమ్మి’ అనే పాత్రతో మెప్పించిన ఆమె.. ఓ అర్ధాంగిగా, వ్యాపారవేత్తగా తన భర్తకు కష్టసుఖాల్లో తోడుంటూ ప్రేక్షకుల మన్ననలందుకుంది. ఇందులో ఆమె నట ప్రతిభకు తాజాగా ‘ఉత్తమ నటి’గా జాతీయ అవార్డు వచ్చిందంటేనే ఆ పాత్రలో ఆమె ఎంతగా ఒదిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రం గతేడాది ఆస్కార్‌ బరిలోనూ నిలవడం విశేషం.

🟇 అపర్ణ మంచి డ్యాన్సర్‌ కూడా! చిన్న వయసులోనే భరతనాట్యం,  కూచిపూడి.. వంటి శాస్త్రీయ నృత్యాల్లో శిక్షణ తీసుకొని ఆరితేరింది. ఇక తన డ్యాన్స్‌ వీడియోలు, సినిమా విశేషాలను తన యూట్యూబ్‌ ఛానల్‌లోనూ పంచుకుంటుందీ చక్కనమ్మ.

🟇 నటిగా, గాయనిగా తనను తాను నిరూపించుకుంటోన్న ఈ కేరళ కుట్టికి మంచి ఫ్యాషన్‌ సెన్స్‌ కూడా ఉంది. ఇందుకు ఆమె ఇన్‌స్టాలో తరచూ పోస్ట్‌ చేసే ఫ్యాషనబుల్‌ ఫొటోలే ప్రత్యక్ష సాక్ష్యం!

🟇 ఫిట్‌నెస్ పైనా మక్కువ చూపుతుంటుందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో తాను బాక్సింగ్‌, ఇతర వ్యాయామాలు చేస్తూ.. వాటికి సంబంధించిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటుంది.

🟇 అపర్ణకు సోషల్‌ మీడియాలోనూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే! ప్రస్తుతం ఆమెను ఇన్‌స్టాలో 1.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

🟇 ‘పాత్రతో పాటు కథకు ప్రాధాన్యమున్న చిత్రాల్నే ఎంచుకుంటూ వస్తున్నా.. చాలామంది నటీమణుల్లాగే గతంలో నా శరీరాకృతి విషయంలో నాకూ పలు విమర్శలు ఎదురయ్యాయి. అయితే మొదట్లో వీటిని తలచుకొని కాస్త బాధపడ్డా.. ఇప్పుడు ఇలాంటివేవీ పట్టించుకోవట్లేదు. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఇలాంటి అనవసర విషయాల పైకి మనసు మళ్లదు..’ అంటూ తన మాటలతోనూ యువతలో స్ఫూర్తి నింపుతోందీ అందాల తార.

ఇక సూరారైపోట్రు (తమిళం) చిత్రానికి గాను షాలిని ఉషాదేవి, సుధా కొంగరలు 'ఉత్తమ స్క్రీన్‌ప్లే' పురస్కారానికి ఎంపికయ్యారు. అదేవిధంగా - 'నాట్యం' చిత్రానికి గాను సంధ్యారాజు 'ఉత్తమ కొరియోగ్రఫీ' అవార్డుకు ఎంపికయ్యారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్