Arati Prabhakar: బైడెన్‌కు ఏఐ పాఠాలు చెబుతోంది!

కృత్రిమ మేధ.. ప్రస్తుతం ప్రపంచమంతా ఈ సాంకేతికత చుట్టూనే తిరుగుతోంది. అయితే దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో.. దుర్వినియోగం చేసుకుంటే అన్నే నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

Published : 06 May 2024 12:42 IST

(Photos: Twitter)

కృత్రిమ మేధ.. ప్రస్తుతం ప్రపంచమంతా ఈ సాంకేతికత చుట్టూనే తిరుగుతోంది. అయితే దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో.. దుర్వినియోగం చేసుకుంటే అన్నే నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ భవిష్యత్‌ నష్టాలను ముందుగానే ఊహించి.. దీనిపై ఓ రెగ్యులేటరీ కోర్సు రూపొందించే బాధ్యతను భారతీయ-అమెరికన్‌ మహిళా శాస్త్రవేత్తకు అప్పగించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌. ఆమె మరెవరో కాదు.. ప్రస్తుతం బైడెన్‌కు సైన్స్‌ సలహాదారుగా వ్యవహరిస్తోన్న ఆరతీ ప్రభాకర్‌. నిజానికి చాట్‌జీపీటీ ఎలా పనిచేస్తుందో గతంలో ఆరతీనే బైడెన్‌కు సునిశితంగా వివరించారు. దీంతో కృత్రిమ మేధపై ఆమెకున్న పట్టు, నైపుణ్యాల్ని గుర్తించిన ఆయన.. ఆరతిని శ్వేత సౌధంలోని ‘శాస్త్ర సాంకేతిక పాలసీ కార్యాలయాని’కి డైరెక్టర్‌గా నియమించారు. ప్రస్తుతం ఏఐ రెగ్యులేటరీ కోర్సును రూపొందించడంలో భాగంగా బైడెన్‌తో కలిసి పనిచేస్తూ, కృత్రిమ మేధపై ఆయనకున్న సందేహాలు తీర్చుతున్నారు ఆరతి. ఈ నేపథ్యంలో ఈ ఇండో-అమెరికన్‌ సైంటిస్ట్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

చాట్‌జీపీటీని పరిచయం చేసి..!

ఓవల్‌ ఆఫీస్‌.. శ్వేతసౌధంలో అధ్యక్షుడు బైడెన్‌ కొలువుదీరే కార్యాలయం ఇది. గతేడాది మార్చిలో ఓసారి ల్యాప్‌టాప్‌ తీసుకొని ఓవల్‌ ఆఫీసుకొచ్చారు ఆరతి. ఈ క్రమంలోనే చాట్‌జీపీటీ ఎలా పనిచేస్తుందో బైడెన్‌కు వివరించారు. దీంతో పాటు కృత్రిమ మేధకు సంబంధించిన పలు విశేషాల్నీ పంచుకున్నారామె. ఇదే తరుణంలో దీన్ని దుర్వినియోగం చేసుకుంటే కలిగే నష్టాల గురించీ ఆయనకు వివరించారు. ఇలా ఏఐపై ఆరతికి ఉన్న పట్టు, నైపుణ్యాల్ని గుర్తించిన బైడెన్‌.. ఆమెకు శ్వేత సౌధంలోని ‘శాస్త్ర సాంకేతిక పాలసీ కార్యాలయాని’కి డైరెక్టర్‌గా బాధ్యతలప్పగించారు. ఈ క్రమంలోనే ఏఐ దుర్వినియోగం కాకుండా దాన్ని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించేలా ఓ ఏఐ రెగ్యులేటరీ కోర్సును రూపొందించమంటూ బైడెన్‌ ఆమెకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమయ్యారు ఆరతి. ఈ కోర్సు రూపొందించే క్రమంలో బైడెన్‌తో కలిసి పనిచేస్తున్నారామె. మరోవైపు బైడెన్‌కు సైన్స్‌ సలహాదారుగానూ వ్యవహరిస్తోన్న ఆమె.. కృత్రిమ మేధపై ఆయనకున్న సందేహాలూ తీర్చుతున్నారు. ఈ సాంకేతికతకు సంబంధించిన పలు విషయాల్లో ఆయనకు సలహాలూ ఇస్తున్నారు.

ఎన్నెన్నో కీలక పదవుల్లో..!

దిల్లీలో పుట్టిన ఆరతి.. తన మూడేళ్ల వయసులోనే కుటుంబంతో కలిసి యూఎస్‌ వెళ్లారు. టెక్సాస్‌లోని లుబోక్‌లో స్థిరపడ్డారు. తన తల్లి ప్రోత్సాహంతో చిన్న వయసు నుంచే శాస్త్ర సాంకేతిక రంగాల (STEM) వైపు ఆసక్తి చూపారామె. ఈ క్రమంలోనే ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేశాక.. అప్లైడ్‌ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ‘క్యాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ నుంచి ఈ విభాగంలో పీహెచ్‌డీ పట్టా పుచ్చుకున్న తొలి మహిళగా ఘనత సాధించారు ఆరతి. చదువు పూర్తయ్యాక ‘DARPA’ అనే పరిశోధన-అభివృద్ధి సంస్థలో ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా చేరిన ఆమె.. తక్కువ సమయంలోనే ఈ సంస్థ ‘మైక్రో ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీ ఆఫీస్‌’కు ఫౌండింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలందుకున్నారు. ఆపై ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాండర్డ్స్‌ అండ్‌ టెక్నాలజీ’కి హెడ్‌గా, ‘రేచమ్‌’ అనే ఏరోస్పేస్‌/ఆటోమొబైల్‌/టెలీకమ్యూనికేషన్స్‌ సంస్థకు ఉపాధ్యక్షురాలిగా.. ఇలా పలు ప్రముఖ సంస్థల్లో కీలక పదవుల్లో పనిచేశారామె. శాస్త్ర సాంకేతికను ప్రోత్సహించే పలు స్టార్టప్స్‌లో పెట్టుబడులు కూడా పెట్టారు ఆరతి. స్టాన్‌ఫోర్డ్‌లోని ‘సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీ ఇన్‌ ది బిహేవియరల్‌ సైన్సెస్‌’ ఫెలోగానూ వ్యవహరించారీ టెక్‌ దిగ్గజం.

సేవలోనూ ముందే!

2023లో ఏఐ అభివృద్ధిలో భారత్‌తో సహకారం కోరుకుంటున్నట్లు పిలుపునిచ్చిన ఆరతి.. ఆ సమయంలో వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ, బైడెన్‌ మధ్య జరిగిన చర్చల్నీ ప్రస్తావించారామె. అంతేకాదు.. ఈ సాంకేతికత  ప్రజాభివృద్ధికి ఎలా దోహదం చేస్తుందన్న అంశం పైనా ప్రసంగించారామె. ఇలా శాస్త్ర సాంకేతిక రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఆరతి.. సమాజ సేవలోనూ ముందున్నారు. వాతావరణ మార్పులు-దీర్ఘకాలిక వ్యాధులపై అందరిలో అవగాహన పెంచేందుకు ‘Actuate’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారామె. స్టెమ్‌లో ఆమె చేస్తోన్న కృషికి గుర్తింపుగా ‘కంప్యూటింగ్‌ ప్లేయింగ్‌ కార్డ్స్‌’పై ఆమె ఫొటో ప్రచురితమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్