Aretto: ఎదిగే పిల్లలకు.. పెరిగే షూస్!

‘పిల్లలు చూస్తుండగానే పెరిగిపోతార’న్న ఉద్దేశంతో కాస్త పెద్ద సైజు షూస్‌ కొంటాం.. అవి వదులుగా ఉండడంతో వేసినప్పుడల్లా వారు అసౌకర్యానికి గురవుతుంటారు.అలాగే ఎదిగే వయసులో పిల్లలకు నప్పాయనో లేదంటే మనకు నచ్చాయనో.. జతల కొద్దీ చెప్పులు/షూస్‌ కొనేస్తుంటాం. కానీ వాళ్లు ఎదుగుతున్న కొద్దీ ఒక్కోసారి....

Published : 22 Mar 2023 14:06 IST

(Photos: Instagram)

‘పిల్లలు చూస్తుండగానే పెరిగిపోతార’న్న ఉద్దేశంతో కాస్త పెద్ద సైజు షూస్‌ కొంటాం.. అవి వదులుగా ఉండడంతో వేసినప్పుడల్లా వారు అసౌకర్యానికి గురవుతుంటారు.

అలాగే ఎదిగే వయసులో పిల్లలకు నప్పాయనో లేదంటే మనకు నచ్చాయనో.. జతల కొద్దీ చెప్పులు/షూస్‌ కొనేస్తుంటాం. కానీ వాళ్లు ఎదుగుతున్న కొద్దీ ఒక్కోసారి అవి పట్టవు.. మళ్లీ కొత్తవి కొనాల్సి వస్తుంది.

ఇలాంటి సందర్భాలలో పిల్లలు తమ పాదరక్షల విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇలాంటప్పుడే అనిపిస్తుంటుంది.. ఎదిగే పిల్లలతో పాటు పెరిగే షూస్‌ కూడా ఉంటే బాగుంటుందని! పుణేకు చెందిన కృతికా లాల్‌ కూడా ఇలాగే ఆలోచించింది. అయితే అక్కడితో ఆగకుండా దాన్ని ఆచరణలో పెట్టే క్రమంలో.. తన చిన్ననాటి ఫ్రెండ్‌తో కలిసి ఓ షూ బ్రాండ్‌ను సృష్టించింది. ఇప్పుడదే ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది.. కోట్ల వ్యాపారంగా విస్తరించింది. ‘మనసుంటే మార్గముంటుందం’టూ పిల్లల షూ సైజ్‌ సమస్యకు వినూత్నంగా పరిష్కారం చూపుతోన్న కృతిక స్టార్టప్‌ జర్నీ గురించి తెలుసుకుందాం రండి..

కృతిక పుణేలోని ‘సింబయాసిస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మీడియా అండ్‌ కమ్యూనికేషన్‌’ నుంచి ఎంబీఏ పూర్తిచేసింది. ఆపై మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా, బిజినెస్‌ మేనేజర్‌గా పలు ఎమ్మెన్సీ సంస్థలు, స్టార్టప్‌లలో పనిచేసింది. ఈ క్రమంలోనే వ్యాపార, కమ్యూనికేషన్‌ మెలకువలు మరింతగా మెరుగుపరచుకున్న ఆమె.. ఎప్పటికైనా వ్యాపార రంగంలోనే స్థిరపడాలని నిర్ణయించుకుంది.

ఆ సమస్యకు పరిష్కారంగా..!

వ్యాపారమైతే చేయాలనుకుంది కానీ.. ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలన్న విషయంలో అప్పటికి కృతికకు పూర్తి స్పష్టత లేదు. అయితే ఇదే సమయంలో తన చుట్టూ ఉన్న కొంతమంది తల్లిదండ్రులు-పిల్లల్లో ఓ సాధారణ సమస్యను గుర్తించింది కృతిక. పిల్లలకు కొనే చెప్పులు/షూస్‌ కొన్నాళ్లకు పట్టకపోవడం, అదే పెద్ద సైజు షూస్‌ తీసుకుంటే వదులుగా, అసౌకర్యంగా ఉండడం గుర్తించిందామె. ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం చూపాలన్న దిశగా ఆలోచిస్తూ.. పిల్లల పాదాల సైజు విషయంలో ఓ చిన్నపాటి అధ్యయనం చేసింది. ఈ క్రమంలోనే కొన్ని విషయాల్ని గ్రహించిందామె. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర్నుంచి వారికి మూడేళ్లు వచ్చే వరకు ప్రతి మూడునాలుగు నెలలకోసారి వారి పాదం సైజు క్రమంగా పెరుగుతుందని తెలుసుకుంది. అలాగే ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు అసౌకర్యంగా ఉండే షూస్ ధరిస్తున్నట్లూ గుర్తించిందామె. అంతేకాదు.. పాదాలకూ, మానసిక ఎదుగుదలకూ సంబంధముందని గ్రహించిన ఆమె.. ఈ సమస్యలకు తగిన పరిష్కారం చూపాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే తన చిన్ననాటి స్నేహితుడు సత్యజిత్‌ మిట్టల్‌తో కలిసి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ‘అరెట్టో’ పేరుతో సరికొత్త ఫుట్‌వేర్‌ బ్రాండ్‌ను ప్రారంభించింది కృతిక.

మూడు సైజులకు పెరిగేలా..!

సాధారణ షూస్‌ పాదం పరిమాణానికి మాత్రమే సరిపోతాయి. అదే పాదం సైజు పెరిగితే సరిగ్గా పట్టవు. కానీ అరెట్టో షూస్‌ని.. అప్పటి సైజును బట్టి తీసుకుంటే.. ఆపై పెరిగే మూడు సైజుల దాకా సౌకర్యవంతంగా ధరించచ్చు. అంటే ఈ షూస్‌ సాగుతాయన్నమాట! ఇందుకోసం వీటి తయారీలో మూడు రకాల పద్ధతులు ఉపయోగిస్తున్నామంటున్నారు కృతిక.

‘మా వద్ద రూపొందించే షూస్ తయారీలో మూడు రకాల టెక్నిక్స్‌ ఉపయోగిస్తున్నాం.

మొదటిది - సూపర్‌ గ్రూవ్స్‌.. ఇవి సోల్‌ చుట్టూ అక్కడక్కడా ‘Y’ ఆకృతిలో ఉంటాయి. పిల్లల పాదం పెరిగే కొద్దీ.. దాన్ని బట్టి ఇవి విస్తరిస్తాయి. తద్వారా షూ చుట్టూ ఒకే రకమైన సాగుదల ఉండి చూడ్డానికి సహజంగా పెద్ద షూస్‌లాగే కనిపిస్తాయి.

ఇక రెండోది - అరెట్టో స్క్విషీ ఫోమ్‌.. ఇది జెల్లీ తరహా మృదువైన, మెత్తనైన పదార్థం. సోల్‌ తయారీలో వాడే దీనివల్ల పిల్లల పాదాలపై ఒత్తిడి పడకుండా ఎంతో సౌకర్యాన్నిస్తాయి.

మూడోది - ఇన్ఫీనిట్ త్రీడీ ఆధారిత ఫ్యాబ్రిక్‌ ఇది. సాగేలా, చూడ్డానికి ఉన్నిలా కనిపించే ఈ మెటీరియల్‌పై ఉండే అతి సూక్ష్మ రంధ్రాలు.. పిల్లల పాదాలకు గాలి తగిలేలా చేస్తాయి.

ఇలా ఈ మూడు పద్ధతులు ఉపయోగించి తయారుచేసే ఈ షూస్‌ పాదం పరిమాణం పెరుగుతున్న కొద్దీ చుట్టూ సమానంగా సాగుతూ చూడ్డానికి సహజ లుక్‌ని అందిస్తాయి. అంతేకాదు.. ఈ షూస్‌ తయారీలో వాడే ప్రత్యేకమైన సోల్‌ పిల్లల్లో ప్రవర్తన లోపాల్ని సవరించి, మెదడు అభివృద్ధికి దోహదం చేస్తుంది..’ అంటూ చెప్పుకొచ్చారు కృతిక. తాము స్వయంగా అభివృద్ధి చేసుకున్న ఈ మూడు ప్రత్యేకమైన పద్ధతులపై 20కి పైగా దేశాల్లో పేటెంట్‌ హక్కుల కోసం కూడా దరఖాస్తు చేసుకుందీ మిత్ర ద్వయం.

భవిష్యత్తులో..!

కేవలం భారత్‌లోని పిల్లలకే కాదు.. యూఎస్‌/యూకే/ఈయూ.. వంటి దేశాల్లోని పిల్లల పాదాల సైజుల్ని బట్టి కూడా వీళ్లు షూస్‌ తయారుచేస్తున్నారు. ఇక ఈ షూస్‌ తయారీలో వాడే ఆయా మెటీరియల్స్‌ కూడా రీసైక్లింగ్‌ చేసినవే కావడం విశేషం. 2021లో ప్రారంభమైన ఈ బ్రాండ్‌.. ఏటికేడు వేలాది ఉత్పత్తుల్ని విక్రయించి కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది. ప్రస్తుతం వీరు 0-2, 5-7, 5-9 ఏళ్ల పిల్లలకు సరిపోయే షూస్‌ తయారుచేస్తున్నారు. భవిష్యత్తులో 11 ఏళ్ల పిల్లల దాకా షూస్‌ తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామంటున్నారు కృతిక. అలాగే ప్రి-స్కూల్స్‌, ప్రైమరీ స్కూల్స్‌, పిల్లల శిక్షణ కేంద్రాలు.. మొదలైన వాటి భాగస్వామ్యంతో తమ బ్రాండ్‌ను మరింతగా విస్తరించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పుకొచ్చారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్