కల్బేలియా నృత్యంతో ప్రపంచాన్ని ఫిదా చేస్తోంది!

ఎవరైనా కెరీర్‌లో ఎదిగేందుకు వీలైన రంగాన్ని/ఉద్యోగాన్ని ఎంచుకుంటారు. కానీ అంతరించిపోతున్న తన ప్రాంత సంప్రదాయ కళను కెరీర్‌గా మలచుకుంది రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లోని జిప్సీ తెగకు చెందిన ఆశా సపేరా. కల్బేలియా, ఘూమర్‌ నృత్యాల్ని నయన మనోహరంగా ప్రదర్శించడంలో....

Published : 07 Nov 2022 14:15 IST

(Photos: Instagram)

ఎవరైనా కెరీర్‌లో ఎదిగేందుకు వీలైన రంగాన్ని/ఉద్యోగాన్ని ఎంచుకుంటారు. కానీ అంతరించిపోతున్న తన ప్రాంత సంప్రదాయ కళను కెరీర్‌గా మలచుకుంది రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లోని జిప్సీ తెగకు చెందిన ఆశా సపేరా. కల్బేలియా, ఘూమర్‌ నృత్యాల్ని నయన మనోహరంగా ప్రదర్శించడంలో ఈ తెగ మహిళలు దిట్ట. తన రక్తంలోనూ ఈ కళను నింపుకొన్న ఆమె.. చిన్నతనం నుంచే దీన్ని నేర్చుకోవడం ప్రారంభించింది. అయితే పెరిగి పెద్దయ్యే క్రమంలో కల్బేలియా నృత్యం అంతరించిపోవడం గమనించిన ఆమె.. ఎలాగైనా దీనికి పునర్వైభవం తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే దేశ విదేశాల్లో ఈ నృత్య ప్రదర్శనలిస్తూ.. ఇందులో శిక్షణ ఇస్తూ దీన్నే పూర్తి స్థాయి కెరీర్‌గా మలచుకుంది. ఇటీవలే ఓ సంగీతోత్సవంలో తన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆశ.. కల్బేలియా నృత్య కళతో ప్రపంచమంతా మైమరచిపోయేలా చేయడమే తన లక్ష్యమంటోంది.

మహిళలకు మాత్రమే సొంతమైన కళ!

కల్బేలియా, ఘూమర్‌.. రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లోని జిప్సీ తెగకు చెందిన సంప్రదాయ నృత్య రీతులివి. వివిధ ప్రత్యేక సందర్భాల్లో ఆ తెగకు చెందిన మహిళలు వీటిని ప్రదర్శించడం ఆనవాయితీ! ఈ క్రమంలో పురుషులు పూంగీ, ఖంజరీ, డుఫ్లీ, మోర్చంగ్‌, ధోలక్‌.. వంటి సంగీత వాయిద్యాలను వాయిస్తుంటే.. ఆ లయకు తగ్గట్లుగా మహిళలు నృత్యం చేస్తుంటారు. నాగ స్వరానికి అనుగుణంగా పాములు ఎలా మెలికలు తిరుగుతూ, గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేస్తాయో.. ఈ నృత్య రీతుల్లోనూ అలాంటి భంగిమలే కనిపిస్తాయి. చూడ్డానికి కల్బేలియా, ఘూమర్‌ నృత్యాలు దాదాపు ఒకే రకంగా ఉన్నప్పటికీ.. ఘూమర్‌లో సంప్రదాయ సంగీతానికి తగ్గట్లుగా డ్యాన్స్‌ చేస్తే.. కల్బేలియా నృత్యంలో జానపద సంగీతానికి/పాటలకు కాలు కదుపుతుంటారు జిప్సీ మహిళలు.

ఐదేళ్ల నుంచే..!

ఇదే తెగలో పుట్టిన ఆశ సపేరా కూడా ఈ నృత్య రీతుల్ని చూస్తూ, సాధన చేస్తూ పెరిగింది. ఏడుగురు సంతానంలో చిన్నదైన ఆమె.. తన తల్లి, అక్కల దగ్గర్నుంచి ఈ డ్యాన్స్‌ నేర్చుకుంది. ఈ నృత్య రీతికి మంత్రముగ్ధురాలైన ఆమె.. ఐదేళ్ల వయసు నుంచే దీనిపై దృష్టి సారించింది. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ఈ నృత్య ప్రదర్శనలివ్వడం ప్రారంభించింది. 13 ఏళ్ల వయసులో థాయిలాండ్‌లో తొలి అంతర్జాతీయ నృత్య ప్రదర్శన ఇచ్చి ఎంతోమంది దృష్టిని ఆకర్షించిందామె.
‘ఐదేళ్ల వయసు నుంచే ఈ డ్యాన్స్‌ సాధన చేయడం ప్రారంభించా. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో స్థానికంగా ప్రదర్శనలిచ్చేదాన్ని. ఈ క్రమంలోనే ఓసారి ప్రముఖ నృత్యకారిణి గులాబో సపేరా.. ఇక్కడి పుష్కర్‌ ప్రాంతంలోని ఓ దేవాలయంలో ఈ నృత్యం ప్రదర్శించడానికి నాకో అవకాశమిచ్చారు. నా ప్రదర్శన చూసి చాలామంది మంత్రముగ్ధులయ్యారు.. ఆ తర్వాత నాకు తెలిసిన విషయమేంటంటే.. అక్కడికొచ్చిన ప్రేక్షకుల్లో చాలామందికి ఈ నృత్య రీతి గురించి తెలియదని! అప్పుడే అనిపించింది.. కల్బేలియా నృత్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలని..! ఈ ఆశయంతోనే ఈ డ్యాన్స్‌ స్టైల్‌లో మరిన్ని నైపుణ్యాలు గడించాను..’ అంటూ చెప్పుకొచ్చింది ఆశ.

ఆ లక్ష్యంతోనే ముందుకు..!

13 ఏళ్ల వయసులో తొలి అంతర్జాతీయ ప్రదర్శన ఇచ్చిన ఆశ.. ఈ 19 ఏళ్లలో 80 దేశాల్లో కల్బేలియా నృత్య ప్రదర్శనలిచ్చింది. అందులో యూఎస్‌, కెనడా, దక్షిణాఫ్రికా, ప్యారిస్‌, మ్యాడ్రిడ్‌, మెల్‌బోర్న్‌.. వంటి దేశాలున్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా జరిగే సంగీత, నృత్య కార్యక్రమాల్లోనూ తన నృత్య నైపుణ్యాల్ని ప్రదర్శిస్తుంటుందామె. అలా గత నెలలో జోధ్‌పూర్‌లో నిర్వహించిన ‘RIFF Roots Music Festival’లోనూ తన అద్భుతమైన కల్బేలియా నృత్యంతో ప్రేక్షకుల్ని అలరించింది ఆశ.
‘జిప్సీ తెగకు మాత్రమే సొంతమైన ఈ నృత్య కళ అందానికి ప్రపంచమంతా ఫిదా కావాలి.. ఆ ఆసక్తితోనే అందరూ ఈ నృత్యాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపించాలి. ప్రస్తుతం ఈ లక్ష్యంతోనే వివిధ దేశాల్లో ప్రదర్శనలిస్తున్నా.. అంతటితో ఆగకుండా.. ఈ నృత్య కళ ప్రత్యేకతల్ని అక్కడి వారికి పరిచయం చేస్తున్నా. చదువు లేకపోయినా పట్టుదలతోనే ఏదైనా సాధించచ్చు. ఈ తపనతోనే ఇంగ్లిష్‌, హిందీ, మార్వాడీ.. వంటి భాషలు కూడా నేర్చుకున్నా..’ అంటోందీ కల్బేలియా డ్యాన్సర్.

లాక్‌డౌన్‌లో మొదలుపెట్టి..!

డ్యాన్స్‌ ప్రదర్శనలివ్వడం, ఆ వేదికగా ఈ నృత్య కళ గురించి చెప్పడమే కాదు.. కల్బేలియా నృత్య రీతిలో ఔత్సాహికులకు శిక్షణ కూడా ఇస్తోంది ఆశ. ఇక కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ క్లాసుల్ని కూడా ప్రారంభించానంటోందీ డ్యాన్సర్.
‘ఘూమర్‌ డ్యాన్స్‌ను మరింత వేగంగా చేయడమే ఈ కల్బేలియా డ్యాన్స్‌. ఒకప్పుడు దీని గురించి స్థానికులకే తెలియదు.. కానీ దీని ప్రత్యేకతలు తెలుసుకున్నాక, ఈ నృత్య రీతిని చూశాక చాలామంది నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆఫ్‌లైన్‌లో నేను ఎక్కడ శిక్షణ కార్యక్రమం ఏర్పాటుచేసినా.. అక్కడికి విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన మహిళలు వచ్చేవారు. వీరితో పాటు కథక్‌, భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న వారు కూడా శిక్షణకు రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది. ఇక నా ఆన్‌లైన్‌ తరగతుల్లో అయితే విదేశీయులే ఎక్కువగా ఉంటారు. నేను అనుకున్నట్లుగానే కల్బేలియా నృత్య రీతికి విదేశీయుల నుంచీ ఆదరణ క్రమంగా పెరుగుతోంది..’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది ఆశ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్