80 లక్షల బోనస్.. ఈ ‘మైనింగ్ క్వీన్’ కథ విన్నారా?

సంస్థ అభివృద్ధిలోనే కాదు.. ఆర్జించే లాభాల్లోనూ తమ ఉద్యోగులకు వాటా ఇవ్వాలనుకుంటాయి కొన్ని కంపెనీలు. ఈ క్రమంలో వారికి ప్రోత్సాహకాలివ్వడం, బోనస్‌ రూపంలో అందించడం.. వంటి మార్గాల్ని అనుసరిస్తాయి. ఈ క్రమంలో ఓ లేడీ బాస్ తన ఉద్యోగులకు లక్షల కొద్దీ బోనస్‌....

Published : 15 Dec 2022 20:22 IST

సంస్థ అభివృద్ధిలోనే కాదు.. ఆర్జించే లాభాల్లోనూ తమ ఉద్యోగులకు వాటా ఇవ్వాలనుకుంటాయి కొన్ని కంపెనీలు. ఈ క్రమంలో వారికి ప్రోత్సాహకాలివ్వడం, బోనస్‌ రూపంలో అందించడం.. వంటి మార్గాల్ని అనుసరిస్తాయి. ఈ క్రమంలో ఓ లేడీ బాస్ తన ఉద్యోగులకు లక్షల కొద్దీ బోనస్‌ ప్రకటించి వార్తల్లో నిలిచారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఒక్కో ఉద్యోగికి ఏకంగా 80 లక్షల రూపాయల్ని బోనస్‌గా ప్రకటించి ఉద్యోగుల పనితీరును ప్రశంసించారామె. నష్టాల్లో కూరుకుపోయిన కంపెనీని సైతం తన వ్యాపార దక్షతతో లాభాల వెంట పరుగులు పెట్టించే సత్తా ఉన్న ఆమె.. ఆస్ట్రేలియాలో ‘మైనింగ్ మ్యాగ్నెట్’గా పేరుగాంచారు. ఇలా ఓ వ్యాపారవేత్తగానే కాదు.. సమాజ సేవలోనూ ముందున్న గినా రిన్‌హార్ట్‌ విజయ గాథ ఇది!

క్రిస్మస్‌ బొనాంజా!

మాంద్యం ముప్పుతో కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. చాలా కంపెనీలు తమ ఉద్యోగుల్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. నెలనెలా జీతం అందడమే గగనమనుకునే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో.. ఏకంగా లక్షల కొద్దీ బోనస్‌ ప్రకటించారు ఆస్ట్రేలియా మైనింగ్‌ క్వీన్‌ గినా రిన్‌హార్ట్‌. తన తండ్రి స్థాపించిన ‘హన్‌కాక్‌ ప్రాస్పెక్టింగ్‌’ అనే మైనింగ్‌ సంస్థకు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తోన్న ఆమె.. ఇదే కంపెనీకి చెందిన రాయ్‌ హిల్‌ అనే మైనింగ్‌ సంస్థకు, ఎస్‌.కిడ్మన్‌ అండ్‌ కో అనే వ్యవసాయ కంపెనీకీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. తన వ్యాపార దక్షతతో కంపెనీని లాభాల బాట పట్టించే నైపుణ్యాలున్న ఆమె.. 34 బిలియన్‌ డాలర్ల సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా నిలిచారు. గతేడాది రూ. 190 బిలియన్ల లాభాల్ని ఆర్జించిన తన సంస్థ ఉద్యోగులకు తాజాగా క్రిస్మస్‌ బోనస్‌ ప్రకటించారు గినా.

10 మందికే ఈ మహదవకాశం!

ఈక్రమంలో ఇటీవలే రాయ్‌ హిల్‌ సంస్థలో పనిచేస్తోన్న ఉద్యోగులతో సమావేశమై.. త్వరలోనే తీపి కబురు చెబుతానని ప్రకటించిన ఈ లేడీ బాస్‌.. తాను చెప్పినట్లుగానే మొన్నటికి మొన్న అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి బోనస్‌ విషయాన్ని వెల్లడించారు. ఈ బంపర్‌ బోనస్‌ కోసం పది మంది ఉద్యోగుల్ని ఎంపిక చేసిన ఆమె.. వారి పేర్లను చదివి వినిపించి మరీ వారిని సర్‌ప్రైజ్‌ చేశారు. వీరిలో ఏళ్ల కొద్దీ అనుభవం ఉన్న ఉద్యోగులే కాదు.. కేవలం మూడు నెలల క్రితం చేరిన ఒక ఉద్యోగి కూడా ఉండడం విశేషం. వీళ్లందరికీ తలా రూ. 80 లక్షల చొప్పున అందజేయనున్నట్లు తెలిపారామె. ఇలా కళ్లు చెదిరే బోనస్‌తో తన ఉద్యోగుల పనితీరును ప్రశంసించిన గినా.. వచ్చే ఏడాది కూడా సంస్థను ఇలాగే అభివృద్ధి పథంలో నడిపించాలంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.

నష్టాల కంపెనీని లాభాల దిశగా..!

ఆస్ట్రేలియాలో మైనింగ్‌, వ్యవసాయ పరిశ్రమల రంగాల్లో ప్రముఖ వ్యక్తిగా పేరు గాంచిన గినా.. 1954లో పెర్త్‌లో జన్మించారు. తన చిన్నతనంలో తన తల్లిదండ్రులతో పాటు పశువులు, గొర్రెల క్షేత్రాలు, వాటి పెంపకంలో ఎక్కువగా గడిపిన ఆమె.. ఎనిమిదేళ్ల వయసు నుంచి స్కూలుకెళ్లడం ప్రారంభించారు. ‘హన్‌కాక్‌ ప్రాస్పెక్టింగ్‌ గ్రూప్‌’ పేరుతో తన తండ్రి ప్రారంభించిన మైనింగ్‌ వ్యాపారాన్ని చూస్తూ పెరిగిన ఆమె.. తానూ ఇదే రంగంలో రాణించాలని కలలు కన్నారు. తాను అనుకున్నట్లుగానే 1992లో తన తండ్రి మరణానంతరం ఈ సంస్థ పగ్గాలు అందుకున్నారు. అప్పట్నుంచి ఈ సంస్థకు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా కొనసాగుతోన్న గినా.. ఒక దశలో నష్టాల్లో కూరుకుపోయిన ఈ సంస్థను తన వ్యాపార వ్యూహాలతో లాభాల బాట పట్టించారు. మైనింగ్‌ రంగంలో దేశంలోనే తన సంస్థను ముందు నిలపడమే కాదు.. దేశవ్యాప్తంగా ఎంతోమందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు గినా. ఆమె నాయకత్వంలో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ప్రైవేట్‌ మైనింగ్‌ సంస్థల్లో ఒకటిగా హన్‌కాక్‌ ఎదిగింది. అంతేకాదు.. ఆస్ట్రేలియా చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ప్రైవేట్‌ కంపెనీగానూ అవతరించింది. ఇక ఇదే కంపెనీకి చెందిన రాయ్‌ హిల్‌ అనే మైనింగ్‌ సంస్థకు, ఎస్‌.కిడ్‌మన్‌ అండ్‌ కో అనే వ్యవసాయ కంపెనీకీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా కొనసాగుతూ వాటి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారామె.

సేవలోనూ ముందే!

తాను వ్యాపారంలో ఎదుగుతూ.. నలుగురికీ ఉపాధి కల్పిస్తూ ప్రపంచంలోనే దిగ్గజ మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా పేరు గాంచిన గినా.. పలు సేవా కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు. ‘హన్‌కాక్‌ ప్రాస్పెక్టింగ్‌’, ‘జియోర్జినా హోప్‌ ఫౌండేషన్‌’ వేదికగా ఆరోగ్యం, వైద్యం, క్రీడలు, విద్య.. వంటి రంగాల్లో యువతకు చేయూతనందిస్తున్నారు. ‘ఆరోగ్యకరమైన జీవనశైలికి ఈత చాలా ముఖ్యం. అందుకే 1990 నుంచే పలు సంస్థలతో కలిసి ఈ క్రీడలో ఔత్సాహికులకు నా మద్దతు తెలుపుతున్నా..’ అంటోన్న గినా.. రచయిత్రిగానూ పేరుగాంచారు. ఈ క్రమంలో తన ఆత్మకథతో పాటు తన వ్యాపార అనుభవాలు రంగరించి పలు పుస్తకాలు కూడా రాశారు. వ్యాపారంలో రాణిస్తూ.. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు-రివార్డులు అందుకున్న గినా.. ఆస్ట్రేలియాలో ఒలింపిక్‌ క్రీడల అభివృద్ధికీ కృషి చేశారు. ఇందుకు గుర్తింపుగా ‘ఆస్ట్రేలియన్‌ ఒలింపిక్‌ ఆర్గనైజేషన్‌’ నుంచి ‘ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌’ పురస్కారాన్ని అందుకున్నారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్