ఎలా దువ్వుకుంటున్నారు?

ఒకప్పుడు శ్రావ్య జుట్టు ఎంత అందంగా, ఒత్తుగా ఉండేదో..! కానీ కొంతకాలం నుంచి జుట్టు బలహీనంగా మారి తెగిపోతోంది.. రాలిపోతోంది.. కారణమేంటా? అని ఆరా తీస్తే అప్పటివరకూ వాళ్ల అమ్మ తనకు దువ్వి జడ వేసేది.. కానీ కాలేజీలో చేరినప్పటి నుంచి జుట్టు దువ్వుకోవడం, జడ వేసుకోవడం రెండూ శ్రావ్యే చేసుకుంటోంది.

Published : 12 Mar 2024 13:09 IST

ఒకప్పుడు శ్రావ్య జుట్టు ఎంత అందంగా, ఒత్తుగా ఉండేదో..! కానీ కొంతకాలం నుంచి జుట్టు బలహీనంగా మారి తెగిపోతోంది.. రాలిపోతోంది.. కారణమేంటా? అని ఆరా తీస్తే అప్పటివరకూ వాళ్ల అమ్మ తనకు దువ్వి జడ వేసేది.. కానీ కాలేజీలో చేరినప్పటి నుంచి జుట్టు దువ్వుకోవడం, జడ వేసుకోవడం రెండూ శ్రావ్యే చేసుకుంటోంది. దువ్వడంలో తను చేసే కొన్ని తప్పుల వల్ల ఆమె జుట్టు బలహీనమై పలుచబడుతోంది. శ్రావ్య మాదిరిగా ఎంతోమంది ఇలాంటి సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. కానీ దానికి కారణం దువ్వడంలో మనం చేసే తప్పులే అని మాత్రం చాలామంది అర్థం చేసుకోలేరు. మరి, మీరు దువ్వే పద్ధతి సరైనదో, కాదో.. ఈ కింది అంశాలు చూసి తెలుసుకోండి. ఒకవేళ తప్పయితే సరిదిద్దుకోండి. అప్పుడు ఒత్త్తెన జుట్టు మీ సొంతమవుతుంది.

సగం నుంచి దువ్వండి..

జుట్టును దువ్వుకునే విషయంలో ఎక్కువమంది చేసే తప్పు.. కుదుళ్ల నుంచి గట్టిగా దువ్వుకుంటూ రావడం.. దీనివల్ల చిక్కులు ఉన్న చోట జుట్టును గట్టిగా లాగాల్సి వస్తుంది. ఫలితంగా కుదుళ్లు బలహీనపడతాయి. ఇలా జుట్టు రాలిపోవడానికి ఇదో ముఖ్య కారణం అవుతుంది. కాబట్టి జుట్టును సగం నుంచి దువ్వుకుంటే ఈ సమస్య ఉండదు. దీనికోసం ముందుగా జుట్టు మధ్య భాగాన్ని ఒక చేత్తో పట్టుకొని కింది భాగంలో ఉన్న చిక్కులన్నింటినీ దువ్వెనతో నెమ్మదిగా తీయాలి. ఆ తర్వాత కుదుళ్ల నుంచి దువ్వుకుంటూ రావడం వల్ల చిక్కులు తక్కువగా ఉంటాయి. జుట్టు తెగిపోయే అవకాశం కూడా తగ్గుతుంది. అంతేకాదు.. కుదుళ్లు కూడా బలహీనం కాకుండా కాపాడుకోవచ్చు.

ఉత్పత్తులు వాడేటప్పుడు..

జుట్టుకు హెన్నా పెట్టుకోవడం, హెయిర్‌ప్యాక్స్ అప్త్లె చేసుకోవడం, రంగులు వేసుకోవడం.. ఇవన్నీ మామూలే. అయితే ఇలాంటివి చేసేటప్పుడు ఎక్కువమంది చేసే పొరపాటు జుట్టును దువ్వెన సాయంతో దువ్వడం.. ఇలాంటి ఉత్పత్తులు అప్త్లె చేసేటప్పుడు, చేసిన తర్వాత జుట్టు ఎక్కువగా చిక్కులు పడుతుంది. అందుకే ఇలాంటి సమయంలో చిక్కులు తీయడానికి దువ్వెనని ఉపయోగించకూడదు. ఎందుకంటే దీనివల్ల జుట్టు ఎక్కువగా తెగిపోతుంది. అంతేకాదు.. ఇలాంటి ఉత్పత్తుల్లో కొన్నిటిని కుదుళ్లకు తగలకుండా వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాటిని పెట్టుకొని దువ్వుకోవడం వల్ల అవి కుదుళ్లకు చేరి జుట్టును బలహీనపరుస్తాయి. అందుకే ఇలాంటప్పుడు చేతి వేళ్ల సాయంతో జుట్టు చిక్కులు తీయడం మంచిది.

వెనక్కి దువ్వద్దు..

హెయిర్‌స్త్టెలింగ్‌లో చాలామంది చేసే తప్పు జుట్టును వెనక్కి దువ్వడం.. జుట్టును అలా వెనక్కి దువ్వితే కాస్త ఒత్తుగా కనిపిస్తుందని భావిస్తారు కొంతమంది. అయితే ఇలా వెనక్కి దువ్వడం వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఇలా వెనక్కి దువ్వడం వల్ల జుట్టు చిట్లిపోవడం, కుదుళ్లు దెబ్బతిని వెంట్రుకలు బలహీనంగా మారడం.. వంటివి జరుగుతాయి. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. అందుకే ఎంత స్త్టెలింగ్ కోసమైనా సరే.. వెనక్కి దువ్వడం తగ్గిస్తే మంచిది.

తలస్నానం కాగానే..

ఉదయాన్నే కాలేజీకి లేదా ఆఫీసుకి లేటవుతోందని హడావిడిగా తలస్నానం చేసేస్తాం. ఆపై జుట్టు దువ్వుకొని రడీ అయిపోయి బయల్దేరిపోతాం. ఈ హడావిడిలో జుట్టుపై ఎంత ప్రతికూల ప్రభావం పడుతుందన్న విషయం మాత్రం మనం పెద్దగా పట్టించుకోం. సాధారణం కంటే తడిగా ఉన్నప్పుడు జుట్టు చాలా బలహీనంగా ఉంటుంది. తలస్నానం చేసిన తర్వాత జుట్టును ఆరబెట్టకుండా వెంటనే దువ్వడం వల్ల జుట్టు తెగిపోయి వూడిపోయే ప్రమాదమే ఎక్కువ. అదే కాస్త తీరిక చేసుకొని ముందుగా తలస్నానం చేసి ఓ అరగంట పాటు జుట్టు ఆరిన తర్వాత దువ్వుకుంటే జుట్టు బలహీనం కాకుండా కాపాడుకోవచ్చు.

చూశారుగా.. జుట్టు చిక్కులు పడడం, చిట్లడం, తెగిపోవడం, రాలడం వంటి సమస్యల నుంచి దూరంగా ఉండడానికి దువ్వేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో..! మరి, మీరూ వీటిని గుర్తుంచుకుంటారు కదూ..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్