జుట్టూడిపోతోందా? ఈ పొరపాట్లు వద్దు..!

ఒత్తైన, నల్లని కురులు సొంతం చేసుకోవాలని ప్రతి అమ్మాయీ ఆరాటపడుతుంటుంది. అయితే మనం రోజూ చేసే కొన్ని పనుల వల్ల మనకు తెలియకుండానే కేశాలకు హాని కలుగుతుంది. ఫలితంగా జుట్టు రాలడం, చివర్లు చిట్లడం, నిర్జీవంగా మారడం.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి.

Published : 27 Feb 2024 21:32 IST

ఒత్తైన, నల్లని కురులు సొంతం చేసుకోవాలని ప్రతి అమ్మాయీ ఆరాటపడుతుంటుంది. అయితే మనం రోజూ చేసే కొన్ని పనుల వల్ల మనకు తెలియకుండానే కేశాలకు హాని కలుగుతుంది. ఫలితంగా జుట్టు రాలడం, చివర్లు చిట్లడం, నిర్జీవంగా మారడం.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. మరి, ఆ పొరపాట్లేంటో తెలుసుకుని సరిదిద్దుకుంటే కురులను చక్కగా సంరక్షించుకోవచ్చు. ఇంతకీ అవేంటంటే..

ఆరనివ్వాలి...

కొంతమంది తలస్నానం చేసిన తర్వాత జుట్టు తడిగా ఉండగానే చిక్కు తీసుకుంటూ ఉంటారు. అయితే కేశాలు తడిగా ఉన్నప్పుడు కుదుళ్లు కాస్త బలహీనంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో దువ్వుకోవడం వల్ల అవి ఊడిపోవడం లేదా మరింత బలహీనంగా మారి రాలిపోవడం జరుగుతుంటాయి. కాబట్టి తడిగా ఉన్న జుట్టుని దువ్వుకోకూడదు. పొడిగా ఆరాకే ఎలాంటి హెయిర్‌స్టైల్‌నైనా ప్రయత్నించడం ఉత్తమం.

ఇలా చేయద్దు!

తలస్నానం చేసిన తర్వాత చాలామంది జుట్టు త్వరగా ఆరిపోవాలనే ఉద్దేశంతో కేశాలను చేతుల మధ్య ఉంచి టవల్‌తో రుద్దుతూ ఉంటారు. అలాగే మరికొంతమంది తలకు టవల్‌ చుట్టుకుని కాసేపు అలాగే ఉంచేస్తారు. అయితే ఈ రెండు పద్ధతులూ కేశాలకు హాని చేయచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. ఎందుకంటే తడిగా ఉన్న జుట్టుకు టవల్‌ చుట్టి ఉంచడం వల్ల కుదుళ్ల వద్ద తేమ అలాగే ఉండిపోయి కుదుళ్లు బలహీనంగా మారడమే కాకుండా చుండ్రు సమస్య కూడా తలెత్తే ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ క్రమంలో చివర్లు చిట్లే అవకాశాలూ ఎక్కువే!

వాటిని అవసరమైతేనే..!

తడిగా ఉన్న జుట్టుని ఆరబెట్టుకోవడానికి డ్రయర్‌, కురులను ఉంగరాల్లా తిప్పడానికి ఉపయోగించే కర్లర్‌, స్ట్రెయిట్‌నర్‌.. ఇలా ఒకటేమిటి.. ప్రస్తుతం కేశాలంకరణలో భాగంగా మనం ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ వస్తువులెన్నో! అయితే వీటిని ఎంత తక్కువగా వాడితే జుట్టుకు అంత మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిద్వారా ఉత్పత్తయ్యే వేడి కారణంగా కురులు నిర్జీవంగా మారడం, చివర్లు చిట్లిపోవడం, పొడిబారినట్లుగా కనిపించడం.. ఇలా వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మరీ అవసరమైతే తప్ప వీటిని వాడకపోవడం మంచిది.
ట్రిమ్మింగ్‌ చేయించుకోవాలి..

నిర్ణీత వ్యవధుల్లో చిట్లిన చివర్లను ట్రిమ్మింగ్‌ చేసుకోవడం చాలా అవసరం. లేదంటే కేశాల ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. అంతేకాకుండా కురులకు సరైన పోషణ కూడా అందక.. ఉన్న జుట్టు కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ట్రిమ్మింగ్‌ చేయించుకోవడం కూడా ముఖ్యమే!

ఆ హెయిర్‌స్టైల్స్‌ వద్దు..

చాలామంది నచ్చిందనో లేక డ్రస్‌ మీదకు నప్పుతుందనో పోనీటెయిల్‌, బన్స్‌.. ఇలా రకరకాల బిగుతైన హెయిర్‌స్టైల్స్‌ వేసుకుంటూ ఉంటారు. అయితే ఇవి కూడా ఎంత తక్కువగా వేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే కేశాలను బిగుతుగా లాగి హెయిర్‌స్టైల్స్ వేసుకోవడం వల్ల కుదుళ్లకు రక్తప్రసరణ సరిగ్గా జరగదు. ఫలితంగా జుట్టు రాలిపోయే అవకాశాలుంటాయి. కాబట్టి జుట్టుకు హాని కలగకుండా ఉండే హెయిర్‌స్టైల్స్‌ని ప్రయత్నించడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్