రన్నింగ్.. ఈ విషయాల్లో జాగ్రత్త!

రన్నింగ్.. బరువు తగ్గాలనుకునే వారికి ఓ మంచి వ్యాయామం. అయితే పరిగెత్తే క్రమంలో మనకు తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు మన లక్ష్యానికి దూరం  చేస్తాయట. మరి అలాంటి పొరపాట్లేమిటో.....

Published : 19 Aug 2022 19:13 IST

రన్నింగ్.. బరువు తగ్గాలనుకునే వారికి ఓ మంచి వ్యాయామం. అయితే పరిగెత్తే క్రమంలో మనకు తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు మన లక్ష్యానికి దూరం  చేస్తాయట. మరి అలాంటి పొరపాట్లేమిటో మీకు తెలుసా?

ఏమీ తినకుండానే పరిగెత్తుతున్నారా?

‘ఏదైనా తిన్నా, తాగినా ఆ తర్వాత ఏ పనీ చేయడానికి శరీరం సహకరించదు.. ఇక రన్నింగ్‌ అయితే అసలే చేయలేం..’ అనేది చాలామంది అభిప్రాయం. అందుకే ఏమీ తినకుండానే రన్నింగ్‌ చేస్తుంటారు. కానీ ఇది ముమ్మాటికీ పొరపాటే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పరగడుపున పరిగెత్తడం వల్ల శరీరంలోని కొవ్వుల్ని కరిగించడానికి తగిన ఇంధనం మనం మన శరీరానికి అందించనట్లే లెక్క. దాంతో కొవ్వులు కరగకపోగా.. మనం మరింత నీరసించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కార్బోహైడ్రేట్లు అధికంగా లభించే పండ్లు (అరటి, యాపిల్‌, మామిడి), నట్స్‌, పాలు-పాల పదార్థాలు, పప్పులు, బ్రెడ్‌, కాయధాన్యాలు.. వంటివి గంట ముందే తీసుకొని ఆపై రన్నింగ్‌ చేయమంటున్నారు నిపుణులు. అలాగే పరిగెత్తడం పూర్తయ్యాక కూడా శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లుండే ఆహార పదార్థాల్ని మెనూలో చేర్చుకోవడం తప్పనిసరి. ఇక పరిగెత్తడానికి గంట ముందు, తర్వాత నీళ్లు తాగడమూ ముఖ్యమేనని గుర్తు పెట్టుకోండి.

భుజాలు కదిలించాలి!

కొంతమంది పరిగెత్తేటప్పుడు చేతుల్ని కదిలించకుండా స్థిరంగా ఉంచుతుంటారు.. మరికొంతమందేమో కేవలం మోచేతుల్ని మాత్రమే ముందుకు వెనక్కి అంటూ పరుగు తీస్తుంటారు. నిజానికి ఈ రెండూ సరికాదంటున్నారు నిపుణులు. పరిగెత్తే క్రమంలో భుజాలకు మోచేతులు 90 డిగ్రీల కోణంలో ఉండాలట! అంతేకాదు.. వాటిని మరీ పైకి లేపి కాకుండా.. పొట్టకు సమాంతరంగా ఉంచి భుజాలు కదిలేలా ముందుకు, వెనక్కి అంటూ పరిగెత్తుతుంటే త్వరగా అలసిపోకుండా, గాయాల పాలుకాకుండా జాగ్రత్తపడచ్చు. అంతేకాదు.. ఇలా దీనివల్ల పరుగు వేగం కూడా అదుపులో ఉంటుందట! ఇక దీంతో పాటు పరిగెత్తే క్రమంలో పెద్ద పెద్ద అడుగులు వేయకుండా చూసుకోవడం వల్ల కూడా మన శరీరంలోని శక్తిని కాపాడుకుంటూ ముందుకు సాగచ్చు.. అలాగే శరీరం అదుపు తప్పి ప్రమాదాలు జరగకుండా కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చు.

డ్రస్సింగ్ విషయంలో..

వదులైన దుస్తులు లేదంటే పొట్టి దుస్తులు ధరించడం చాలామందికి అలవాటు! రన్నింగ్‌ చేసే క్రమంలోనూ కొంతమంది ఇలాంటి డ్రస్సింగ్‌నే ఫాలో అవుతుంటారు. నిజానికి ఏ కాలంలో రన్నింగ్‌ చేసినా వదులైన దుస్తులు, పొట్టిగా ఉండేవి అస్సలు వద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే వదులైన దుస్తుల కారణంగా పరిగెత్తే క్రమంలో గాయాలు కావచ్చు.. కాబట్టి శరీరానికి అతికినట్లుగా ఉండే కాటన్‌ దుస్తులు లేదా మెత్తటి క్లాత్‌తో తయారుచేసిన జిమ్‌ వేర్‌ను ఎంచుకుంటే ఎప్పుడైనా కంఫర్టబుల్‌గా ఉండచ్చు.. ఇక వీటితో పాటు ఫిట్‌గా, అడుగుభాగంలో మెత్తగా ఉండే సోల్‌/స్ప్రింగ్స్‌ ఉండే రన్నింగ్‌ షూస్‌ని ఎంచుకుంటే పరిగెత్తడం మరింత సులభమవుతుంది. తద్వారా శరీరంపై ఎక్కువ ఒత్తిడి పడకుండానే అనుకున్న ఫలితాల్ని సొంతం చేసుకోవచ్చు.

తొందరొద్దు..

త్వరగా బరువు తగ్గిపోవాలని వేగంగా పరిగెడుతున్నారా? నిజానికి ఇది అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వేగంగా పరిగెత్తడం అనేది అప్పటిదాకా మన శరీరానికి అలవాటు లేదు. అలాంటిది ఒక్కసారిగా వేగంగా రన్నింగ్‌ చేస్తే గాయాలయ్యే ప్రమాదం ఉంది.. దీని ద్వారా శ్వాసక్రియ రేటు బాగా పెరుగుతుంది. అది ఆరోగ్యానికీ మంచిది కాదు. కాబట్టి పరుగు పెట్టాలనుకుంటే ముందు నెమ్మదిగా నడక మొదలుపెట్టాలి. ఆపై క్రమంగా వేగాన్ని పెంచుకుంటూ పోవాలి. అలాగని ఇప్పటికే ప్రాక్టీస్‌ ఉన్న వారు మరీ వేగంగా పరిగెత్తకుండా.. ఈ విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అంతేకాదు.. వారంలో కనీసం ఒక రోజు వ్యాయామానికి పూర్తిగా దూరంగా ఉండాలట! తద్వారా ఈ విశ్రాంతి రోజున శరీరం తనను తాను రిపేర్‌ చేసుకుంటుందని, మరుసటి రోజు మరింత ఉత్సాహంగా వర్కవుట్‌ మొదలుపెట్టడానికి తయారవ్వచ్చని నిపుణులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్