Published : 24/02/2023 14:35 IST

అందుకే లేట్‌నైట్‌లో ఇవి వద్దు..!

వివిధ కారణాల వల్ల్ల కొందరు రాత్రిపూట భోజనం బాగా లేటుగా చేస్తుంటారు. కొందరు ఇంట్లో ఉండి కూడా అర్ధరాత్రి వరకు భోజనం చేయకుండా.. టీవీ చూస్తూ, కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సమయం గడిపేస్తారు. మరికొందరైతే అర్ధరాత్రి వరకు ఫ్రెండ్స్‌తో చాట్ చేస్తూ.. నిద్ర రాకుండా మధ్యమధ్యలో స్నాక్స్, బిస్కట్స్.. వంటివి లాగించేస్తుంటారు. ఇలా రాత్రుళ్లు ఆలస్యంగానో లేక టైంపాస్‌కో ఆహారం తినడం వల్ల తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమవదు సరికదా.. శరీరంలో అనవసరమైన కొవ్వులు, క్యాలరీలు చేరి క్రమంగా బరువు పెరగడం, నిద్రలేమి.. వంటి పలు ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో రాత్రుళ్లు ఆలస్యంగా తినకూడని కొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం రండి..

తీపి పదార్థాలు..

తీపి పదార్థాలు తినడం వల్ల నిద్రొస్తుందనే భావన చాలామందిలో ఉంటుంది. అందుకే పడుకోవడానికి ముందు ఏదైనా స్వీటో లేదంటే చాక్లెటో, ఐస్‌క్రీమో.. ఇలా ఏదో ఒకటి తినేసి పడుకుంటారు. కానీ చక్కెరలు ఎక్కువగా ఉండే ఇలాంటి పదార్థాలు లేట్‌నైట్స్ తినకపోవడమే ఉత్తమం. ఒకవేళ తిన్నట్లయితే వాటిలోని చక్కెరలు రక్తంలోకి చేరిపోయి శరీరంలోని శక్తిని క్షీణింపజేస్తాయి. అలాగే ఇవి నిద్రాభంగం కలిగించే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఇలాంటి చక్కెరలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను రాత్రుళ్లు తినకపోవడమే మంచిది.

కొవ్వులు నిండినవి..

పిజ్జా, బర్గర్, డ్రైఫ్రూట్స్, ఐస్‌క్రీమ్స్, కేక్స్.. వంటి కొవ్వులు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల అవి కడుపు నిండుగా అనిపించేలా చేస్తాయి. దీనివల్ల ఒక్కోసారి జీర్ణవ్యవస్థ మందగించి ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో మరుసటి రోజు ఉదయం బద్ధకంగా అనిపిస్తుంటుంది. అలాగే వీటిలోని అనవసరమైన కొవ్వు పదార్థాలు రక్తనాళాల గోడలకు అంటుకుపోతాయి. తద్వారా రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రుళ్లు ఇలాంటి పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది.

కెఫీన్ అధికంగా..

కూల్‌డ్రింక్స్, నిమ్మజాతి పండ్లతో తయారు చేసిన రసాలు.. వంటి ఆమ్లత్వం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను రాత్రుళ్లు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే ఆమ్ల గుణాలు జీర్ణవ్యవస్థలోకి చేరి పలు జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని రాత్రిపూట తీసుకోకపోవడమే ఉత్తమం. అలాగే నైట్‌షిఫ్ట్‌ల్లో పనిచేసే చాలామంది పని ఒత్తిడి, తలనొప్పి.. వంటి వాటి నుంచి ఉపశమనం పొందడానికి కాఫీలు, టీలు ఎక్కువగా తాగుతుంటారు. ఇందులో ఉండే కెఫీన్ కడుపులోకి చేరి జీర్ణవ్యవస్థలో ఆమ్లత్వం మరింతగా పెంచే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఆరోగ్యకరం కాదు. కాబట్టి వీటిని పదే పదే తాగకుండా జాగ్రత్తపడటం మంచిది.

ప్రొటీన్లు ఎక్కువయ్యాయా?కొంతమంది రాత్రి పడుకునే ముందు చికెన్, మటన్.. వంటి పదార్థాల్ని ఫుల్‌గా తినేసి పడుకుంటుంటారు. ఇలా ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువ మొత్తంలో తిని పడుకోవడం వల్ల కడుపు నిండుగా ఉండి అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. అలాగే జీర్ణక్రియ కూడా సాఫీగా సాగక అజీర్తి సమస్య ఎదురవ్వచ్చు. కాబట్టి రాత్రిపూట ఇలాంటి ఆహార పదార్థాలు ఎంత తక్కువగా తింటే అంత మంచిది. అలాగే ఎక్కువ మసాలాలతో తయారు చేసిన స్పైసీ ఫుడ్స్ జోలికి కూడా వెళ్లకపోవడం ఉత్తమం.

అలాగే పండ్ల ఫ్లేవర్స్‌తో తయారు చేసిన పెరుగు కూడా రాత్రుళ్లు తినడం అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఇందులో అధికంగా ఉండే చక్కెరలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. కాబట్టి దీనికంటే మామూలుగా మనం ఇంట్లో తయారు చేసుకునే పెరుగు తీసుకోవడం చాలా మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని