అందం పెరగాలంటే.. ఇవి వద్దు!

అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి ఎలాగైతే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటామో.. అలాగే తీసుకోకూడని ఆహార పదార్థాలు కూడా కొన్ని ఉంటాయి. నవయవ్వనంగా కనిపించాలని; మృదువైన, బిగుతైన చర్మం కావాలని, మేని ఛాయను రెట్టింపు చేసుకోవాలని.. ఇలా అన్ని రకాలుగా అందాన్ని సొంతం చేసుకోవడానికి చాలామంది అమ్మాయిలు రకరకాల సౌందర్య చికిత్సలు చేయించుకుంటారు.

Published : 06 Apr 2024 20:23 IST

అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి ఎలాగైతే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటామో.. అలాగే తీసుకోకూడని ఆహార పదార్థాలు కూడా కొన్ని ఉంటాయి. నవయవ్వనంగా కనిపించాలని; మృదువైన, బిగుతైన చర్మం కావాలని, మేని ఛాయను రెట్టింపు చేసుకోవాలని.. ఇలా అన్ని రకాలుగా అందాన్ని సొంతం చేసుకోవడానికి చాలామంది అమ్మాయిలు రకరకాల సౌందర్య చికిత్సలు చేయించుకుంటారు. అయితే ఎలాంటి చికిత్సలతోనూ పని లేకుండా సహజంగానే అందాన్ని పెంపొందించుకోవాలంటే కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలంటున్నారు సౌందర్య నిపుణులు. అవేంటో తెలుసుకుందామా మరి..

చాక్లెట్లతో ముడతలు..

చాక్లెట్లలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో చక్కెర శాతం పెరిగిపోయి చర్మంపై ముడతలు ఏర్పడి డల్‌గా కనిపించేలా చేస్తుంది. అలాగే చక్కెర చర్మంలో ఉండే కొలాజెన్‌పై దుష్ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా చర్మం బిగుతుదనాన్ని కోల్పోయి ముడతలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి చక్కెర శాతం ఎక్కువగా ఉండే ఆహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

బయటి ఆహారంతో..

అలా కాసేపు బయటికి వెళ్తే చాలు.. చిప్స్, మిర్చి బజ్జీ, ఛాట్, నూడుల్స్.. ఇలా ఏదో ఒకటి తినకుండా ఉండలేని వాళ్లు ఎందరో. కానీ ఇవి అటు చర్మానికి, ఇటు ఆరోగ్యానికీ అంత మంచివి కావు. వీటివల్ల మన శరీరంలో జీవక్రియలకు అవసరమైన ఎంజైమ్‌లు వృద్ధి చెందకుండా అంతరాయం ఏర్పడుతుంది. ఎందుకంటే జీవక్రియలు సాఫీగా సాగి శరీరాన్ని అందంగా తయారు చేయడంలో ఎంజైమ్‌ల పాత్ర ఎంతో కీలకం. కాబట్టి ఎంజైమ్‌లకు నష్టం కలిగించే ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం ఎంత మానుకుంటే అంత మంచిది. అలాగే ఈ ఆహార పదార్థాల తయారీలో వాడే నూనెలు మంచివి కాకపోవచ్చు. దీనివల్ల చర్మం జిడ్డుగా తయారై మొటిమల సమస్యకు దారితీస్తుంది.

ఉప్పు ఎక్కువైతే..

ఉప్పు మనం తీసుకునే ఆహారంలో ఓ భాగం. అయితే ముందుగానే ప్యాక్ చేసి ఉంచిన (ప్యాకేజ్డ్) ఆహార పదార్థాల్లో సోడియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కూడా చర్మ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి వీటిని వీలైనంతవరకు తినకపోవడం మంచిది.

కాఫీ ఎక్కువగా వద్దు..

పని ఒత్తిడి, తలనొప్పి.. వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కాఫీని ఆశ్రయించడం మామూలే. కానీ అందానికి ఇది అసలు మంచిది కాదు. కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ లాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురై చర్మం నిగారింపును కోల్పోతుంది. దీనివల్ల చిన్నతనంలోనే వయసు పైబడిన ఛాయలు చర్మంపై కనిపిస్తాయి. దీంతోపాటు కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ కూడా పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఎక్కువసార్లు కాఫీ తాగడం మంచిది కాదన్నది నిపుణుల అభిప్రాయం. ప్రత్యేకించి వేసవిలో ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

ఇవి వద్దు..

గ్త్లెసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే పాస్తా, కేక్స్, వైట్ బ్రెడ్.. వంటివి తీసుకోవడం వల్ల మొటిమల సమస్య వచ్చే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి వీటిని ఎంత తినకుండా ఉంటే అంత మంచిది.

మద్యం సేవిస్తే..

కార్పొరేట్ పనితీరులో భాగంగా పార్టీ కల్చర్ పెరిగింది. మద్యం సేవించడం ఇందులో సర్వసాధారణంగా మారింది. అయితే మోతాదు మించి మద్యం సేవిస్తే ఇతరత్రా నష్టాలున్నట్లే- చర్మ సౌందర్యంలో కీలక పాత్ర వహించే ప్రొటీన్లు, ఖనిజాలపై కూడా ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఫలితంగా చర్మం నిర్జీవంగా తయారై కాంతి విహీనమవుతుంది. కాబట్టి ఈ అలవాటును మానుకోవడం మంచిదని నిపుణుల అభిప్రాయం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్