ఈ అలవాట్లు చర్మ సౌందర్యాన్ని తగ్గిస్తాయ్..!

సౌందర్యపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని చిన్న చిన్న అలవాట్ల వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి, చర్మం నిర్జీవంగా, అంద విహీనంగా కనిపించే అవకాశాలున్నాయి. మరి, ఆ అలవాట్లేంటో తెలుసుకోవాలనుకొంటున్నారా? అయితే ఇది చదివేయండి...

Published : 30 Apr 2024 20:05 IST

సౌందర్యపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని చిన్న చిన్న అలవాట్ల వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి, చర్మం నిర్జీవంగా, అంద విహీనంగా కనిపించే అవకాశాలున్నాయి. మరి, ఆ అలవాట్లేంటో తెలుసుకోవాలనుకొంటున్నారా? అయితే ఇది చదివేయండి...

మృతకణాలు తొలగిస్తున్నారా?

చర్మం మీద పేరుకొనే మృత కణాలను ఎక్స్‌ఫోలియేషన్ పద్ధతి ద్వారా ఎప్పటికప్పుడు తొలగించుకోవడం తప్పనిసరి. లేదంటే అవి చర్మరంధ్రాలను మూసుకుపోయేలా చేస్తాయి. ఫలితంగా మలినాలు, మృతకణాలు చర్మరంధ్రాల్లో ఉండిపోయి చర్మం నిర్జీవంగా, పొడిబారినట్లు కనిపిస్తుంది. అందుకే వారానికి ఒకటి లేదా రెండుసార్లు తప్పనిసరిగా స్క్రబ్బింగ్ ప్రక్రియ ద్వారా మృతకణాలు తొలగించుకుంటూ ఉండాలి. అప్పుడే చర్మం తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.

తరచూ తాకుతున్నారా?

రోజూ వివిధ పనులు చేసే క్రమంలో మన చేతులతో తలుపులు, డోర్ నాబ్స్, పెన్స్, టేబుల్స్.. ఇలా రకరకాల వస్తువులను ముట్టుకుంటూ ఉంటాం. ఫలితంగా వాటిపై ఉన్న దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా మొదలైనవన్నీ చేతులకు అంటుకుంటాయి. మళ్లీ అవే చేతులతో ముఖాన్ని కూడా తాకుతూ ఉంటాం. ఒకటి కాదు.. రెండు కాదు.. రోజుకు ఎన్నోసార్లు ముఖ చర్మాన్ని తాకే అలవాటు చాలామందికి ఉంటుంది. ఈ అలవాటు కారణంగా చేతికి ఉన్న మురికి, బ్యాక్టీరియా.. అన్నీ చర్మ రంధ్రాల్లోకి చేరి, మేని ఆరోగ్యానికి నష్టం కలిగిస్తాయి. కాబట్టి పదే పదే ముఖ చర్మాన్ని చేతితో తాకకుండా జాగ్రత్తపడాలి.

మేకప్ వల్ల..

ప్రస్తుతం ప్రతిఒక్కరూ వాటర్‌ప్రూఫ్ మేకప్ ఉత్పత్తులను వినియోగించడానికే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇవి చర్మం మీద ఒక పలుచని పొరను ఏర్పరచి మేకప్ ఎక్కువ సమయం నిలిచి ఉండేలా చేస్తాయి. కాబట్టి ఇలాంటి ఉత్పత్తులు ఉపయోగించినప్పుడు మేకప్ వీలైనంత త్వరగా తొలగించుకోవాలి. లేదంటే చర్మం నిర్జీవంగా మారడం, మొటిమలు రావడం.. మొదలైన చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

ఫోన్ ద్వారా..

స్క్రీన్ పెద్దదిగా ఉండే ఫోన్ల వల్ల కూడా చర్మ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశాలున్నాయంటున్నారు సౌందర్య నిపుణులు. ఫోన్ మాట్లాడేటప్పుడు చెవి దగ్గర్నుంచి చెంపల వరకు ఉన్న చర్మానికి ఫోన్ స్క్రీన్ తాకడం సహజమే. అయితే ఆ ప్రక్రియలో ముఖానికి ఉన్న మేకప్ ఫోన్ స్క్రీన్‌కు అంటుకుంటుంది. దానిని శుభ్రం చేయకపోతే కొన్ని వేల సంఖ్యలో సూక్ష్మ క్రిములు దానిపై చేరతాయి. తిరిగి అదే ఫోన్ చర్మాన్ని తాకినప్పుడు అవన్నీ చర్మరంధ్రాల్లోకి చేరి ఆవాసం ఏర్పర్చుకుంటాయి. ఫలితంగా చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఫోన్‌ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే మాట్లాడేటప్పుడు ఫోన్ చర్మాన్ని తాకకుండా జాగ్రత్తపడడం మంచిది.

ఈ అలవాట్లు కూడా..

⚛ మాసిపోయిన దుప్పట్లు, పిల్లో కవర్లపై నిద్రించడం వల్ల వాటిపై ఉన్న బ్యాక్టీరియా చర్మరంధ్రాల్లోకి చేరి హాని చేయవచ్చు.

⚛ ముఖంపై ఉన్న మొటిమలు, రంధ్రాలను చేత్తో పదే పదే తాకడం వల్ల బ్యాక్టీరియా చర్మమంతా వ్యాపించే అవకాశాలుంటాయి. ఫలితంగా చర్మ ఆరోగ్యం మరింత దెబ్బ తింటుంది.

⚛ పెద్దవిగా ఉన్న చర్మ రంధ్రాలను చిన్నవిగా చేసేందుకు ఫౌండేషన్ లేదా కన్సీలర్ ఎక్కువ మొత్తంలో అప్త్లె చేసుకోవడం కూడా మంచిది కాదు. ఇవి చర్మ రంధ్రాలను మూసేసి మొటిమలు రావడానికి కారణమవుతాయి.

⚛ నూనె అధికంగా ఉన్న ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకున్నా చర్మ రంధ్రాలపై ప్రభావం పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్