Wandering Jane : ఇది మహిళా పర్యటకులకు ప్రత్యేకం!

ఇంటి బాధ్యతలు, ఆఫీస్‌ పని నుంచి కాస్త విరామం తీసుకొని ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటారు కొందరమ్మాయిలు.. కానీ మరుక్షణం.. ‘ఆడపిల్లవి.. ఒంటరిగా కొత్త ప్రదేశానికా? వద్దమ్మా..’ అన్న వారింపు వినిపిస్తుంది...

Published : 05 Jun 2023 12:08 IST

(Photos: Instagram)

ఇంటి బాధ్యతలు, ఆఫీస్‌ పని నుంచి కాస్త విరామం తీసుకొని ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటారు కొందరమ్మాయిలు.. కానీ మరుక్షణం.. ‘ఆడపిల్లవి.. ఒంటరిగా కొత్త ప్రదేశానికా? వద్దమ్మా..’ అన్న వారింపు వినిపిస్తుంది.

పోనీ.. తోటి స్నేహితులతో వెకేషన్‌ ప్లాన్‌ చేసుకుందామనుకుంటే.. ‘మగతోడు లేకుండా అంత దూరం వెళ్లడం సురక్షితం కాదం’టూ మరికొంతమంది పేరెంట్స్‌ భయపడుతుంటారు. తల్లిదండ్రుల్లో ఉన్న ఈ భయాన్ని దూరం చేస్తూ.. మహిళా ప్రయాణికులకు సురక్షితమైన, అద్భుతమైన ప్రయాణ అనుభవాలను అందిస్తున్నారు బెంగళూరుకు చెందిన గరిమా పాండే. తన కజిన్‌తో కలిసి ‘వాండరింగ్‌ జేన్‌’ అనే ప్రయాణ వేదికను ప్రారంభించిన ఆమె.. మహిళలు తమకు నచ్చిన ప్రదేశంలో సురక్షితంగా, స్వేచ్ఛగా పర్యటించే వెసులుబాటు కల్పిస్తున్నారు. గడప దాటిన దగ్గర్నుంచి తిరిగి ఇంటికి చేరే దాకా.. అనుక్షణం వారి సంరక్షణను పర్యవేక్షిస్తున్నారు. ఆయా ప్రదేశాలకు చెందిన ప్రత్యేక సాహస క్రీడలు/సాహస కృత్యాల్లో మహిళా పర్యటకులు ఉత్సాహంగా పాల్గొనే అవకాశం అందిస్తున్నారు. ఇలా ‘ఒక్క ప్రయాణంతో మహిళా పర్యాటకులకు జీవితానికి సరిపడా మధుర జ్ఞాపకాల్ని అందించడమే తమ లక్ష్యమం’టోన్న గరిమ ట్రావెలింగ్‌ స్టార్టప్‌ గురించి మరిన్ని విశేషాలు మీకోసం..!

గరిమా పాండేది ఆర్మీ కుటుంబం. తండ్రి వృత్తిరీత్యా చిన్నతనంలో వేర్వేరు ప్రాంతాలు తిరిగిన ఆమె.. ప్రతిసారీ కొత్త ప్రాంతంలో సర్దుకుపోయేందుకు ఇబ్బంది పడలేదు.. సరికదా.. తాను వెళ్లిన చోటినే స్వస్థలంగా భావించేది.. అక్కడి ప్రజలతో సులభంగా కలిసిపోయేది. స్థానికంగా ఉండే పర్యటక ప్రదేశాలు చుట్టేస్తూ.. ప్రత్యేక రుచుల్ని ఆస్వాదిస్తూ.. వివిధ రకాల సాహస కృత్యాలు చేస్తూ.. బోలెడన్ని మధురానుభూతులు మూటగట్టుకునేది. ఇదే క్రమంగా ప్రయాణాలపై తనకు ఆసక్తి పెంచిందంటోంది గరిమ.

ఆ భయాన్ని దూరం చేయాలని..!

పుణే సింబయాసిస్‌ నుంచి ఎంబీఏ పూర్తిచేసిన ఆమె.. బ్యాంకింగ్‌ రంగంలో కొన్నేళ్ల పాటు పనిచేసింది. ఆపై మార్కెటింగ్‌, కార్పొరేట్‌ రంగాల్లో మరికొన్నేళ్లు విధులు నిర్వర్తించింది. అయితే ట్రావెలింగ్‌పై తనకున్న మక్కువతో ఎప్పటికైనా ఓ పర్యటక సంస్థను ప్రారంభించాలని గతంలోనే నిర్ణయించుకుంది గరిమ. అచ్చంగా ఇదే ఆలోచనలో ఉన్న తన కజిన్‌తో చర్చించిన ఆమె.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2017లో ‘వాండరింగ్‌ జేన్‌’ పేరుతో ఓ ట్రావెలింగ్‌ సంస్థను ప్రారంభించింది.

‘ప్రయాణాలు/పర్యటనలు మనకు సరికొత్త అనుభూతుల్ని పంచుతాయి. కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు.. అక్కడి సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఒంటబట్టించుకోవచ్చు. అయితే చాలామంది తల్లిదండ్రులు తమ కూతుళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని.. ఒంటరిగా లేదంటే స్నేహితులతో కలిసైనా కొత్త ప్రదేశాలకు పంపడానికి నిరాకరిస్తుంటారు. వారిలో ఉన్న ఆ భయాల్ని దూరం చేసి మహిళలకు సురక్షితమైన ప్రయాణ అనుభవాలను అందించడమే ముఖ్యోద్దేశంగా ఈ సంస్థను ప్రారంభించాం..’ అంటున్నారు గరిమ.

మహిళలకు మాత్రమే!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు మాత్రమే సురక్షితమైన ప్రయాణ సదుపాయాల్ని కల్పిస్తోందీ సంస్థ. ఈ క్రమంలో ఒంటరిగా, బృందంగా.. ఇలా మహిళల ఇష్టానుసారం వారికి ఆయా వెకేషన్‌ ప్యాకేజీలను అందిస్తోంది. వ్యక్తిగత హాలిడే టూర్‌ ప్యాకేజీల పేరుతో మహిళలు తమకు నచ్చిన చోటికి వెళ్లేలా ప్లాన్‌ చేసుకోవచ్చు.. లేదంటే ఈ సంస్థలో ఉన్న ట్రావెలింగ్‌ నిపుణుల సలహాలు తీసుకొని మరీ పర్యటక ప్రదేశాన్ని ఎంచుకోవచ్చు. అయితే అలా ఆయా ప్రదేశాలకు పంపించి చేతులు దులిపేసుకోకుండా.. వారు గడప దాటిన దగ్గర్నుంచి.. తిరిగి ఇంటికి చేరే దాకా వారి రక్షణ బాధ్యతలు పూర్తిగా తమవే అంటోంది గరిమ.

‘దేశవ్యాప్తంగా ఆయా పర్యటక ప్రదేశాల్లో మా గైడ్స్‌ అందుబాటులో ఉంటారు. మహిళలు వారు వెళ్లిన చోట ఒంటరిగా ఫీలవ్వకుండా, భయపడకుండా.. వారే మార్గనిర్దేశనం చేస్తారు. దగ్గరుండి అక్కడ చూడదగిన ప్రదేశాలు తిరిగేలా ఏర్పాటుచేస్తారు. అంతేకాదు.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉండే.. బోట్‌ రైడింగ్‌, స్కూబా డైవింగ్‌, కయాకింగ్‌, ట్రెక్కింగ్‌, ర్యాఫ్టింగ్‌.. వంటి సాహస క్రీడలు/ఇతర క్రీడాంశాల్లోనూ భాగమయ్యేలా వెసులుబాటు కల్పిస్తున్నాం. ఆసక్తి ఉంటే స్థానిక రెస్టరంట్లలో అక్కడి పాకశాస్త్ర నైపుణ్యాల్ని నేర్చుకునేలా మరో అవకాశం మా మహిళా ప్రయాణికులకు అందిస్తున్నాం. ఇలా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆయా పర్యటక ప్రదేశాల్లో 500లకు పైగా స్థానిక నిపుణుల్ని అందుబాటులో ఉంచాం. మొత్తానికి మహిళ గడప దాటిన దగ్గర్నుంచి.. తిరిగి ఇంటికి చేరుకునేదాకా.. ఆమెకు సంబంధించిన పూర్తి రక్షణ బాధ్యతలు మావే!’ అంటూ చెప్పుకొచ్చారీ ట్రావెల్‌ లవర్‌.

కౌన్సెలింగ్‌ కూడా!

ఇలా రోజుల కొద్దీ వెకేషన్‌ సదుపాయాలు కల్పిస్తోన్న ఈ సంస్థ.. దగ్గరి ప్రదేశాల్ని ఎంచుకున్న వారికి ఒక్క రోజుకు సరిపడా వినోదాన్ని పంచే మరిన్ని యాక్టివిటీల్నీ అందిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాదు.. మహిళా పర్యటకుల ఆసక్తిని బట్టి.. వియత్నాం, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, మాల్దీవులు, భూటాన్‌, బాలీతో పాటు యూరప్‌లోని పలు ప్రదేశాల్లోనూ పర్యటించే అవకాశం కల్పిస్తోంది. ఈ ఆరేళ్ల కాలంలో తన సంస్థ వేదికగా.. వందకు పైగా సోలో ట్రిప్స్‌, 200లకు పైగా బృంద పర్యటనలు, మరిన్ని కస్టమైజ్‌డ్‌ పర్యటనల్ని ఏర్పాటుచేసిన గరిమ.. మహిళల్ని ఒంటరిగా పంపించడానికి భయపడే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ కూడా ఇస్తోంది. తద్వారా వారిలో ఉన్న భయాన్ని పోగొట్టి.. మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపుతోంది. భవిష్యత్తులో మరిన్ని దేశాలకు తన సంస్థ సేవల్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న గరిమ.. త్వరలోనే యాప్‌ను కూడా ప్రారంభించనున్నట్లు చెబుతోంది. ఇదివరకే తమ సంస్థ ద్వారా పర్యటక అనుభవాల్ని మూటగట్టుకున్న వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటూ.. మరింత మంది మహిళల్ని పర్యటనల దిశగా ప్రోత్సహిస్తోంది గరిమ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్