అందుకే ఆ వందమందిలో.. మన వాళ్లు!

తమదైన ప్రతిభతో ఎంచుకున్న రంగంలో రాణించడమే కాదు.. ఇతరులకూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఎందరో మహిళలు. ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ ఇలా ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రభావం చూపిన 100 మంది మహిళల జాబితాను ఏటా విడుదల చేస్తుంటుంది. ఇలా ఈసారి 10వ ఎడిషన్‌ కావడంతో దశాబ్దకాలంగా....

Published : 09 Dec 2022 14:23 IST

(Photos: Instagram)

తమదైన ప్రతిభతో ఎంచుకున్న రంగంలో రాణించడమే కాదు.. ఇతరులకూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఎందరో మహిళలు. ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ ఇలా ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రభావం చూపిన 100 మంది మహిళల జాబితాను ఏటా విడుదల చేస్తుంటుంది. ఈసారి 10వ సీజన్ నేపథ్యంలో- వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్న 100 మంది అత్యంత ప్రభావశీల మహిళల జాబితాను విడుదల చేసింది. ఇందులో మన దేశానికి చెందిన నలుగురు మహిళలు చోటు దక్కించుకోవడం విశేషం.

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కి...

2000 సంవత్సరంలో ప్రపంచ సుందరిగా నిలిచిన బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా 2002లో తన సినీ కెరీర్‌ను ప్రారంభించింది. అంచెలంచెలుగా ఎదిగిన ఆమె ఓ దశలో బాలీవుడ్‌లో అగ్రతారగా వెలుగొందింది. దాదాపు 60కి పైగా చిత్రాల్లో నటించిన ఈ మాజీ ప్రపంచ సుందరి.. హాలీవుడ్‌లో అడుగుపెట్టిన మొదటి దక్షిణాసియా తారగా ఘనత సాధించింది. ప్రియాంక 2015లో క్వాంటికో అనే అమెరికన్‌ టీవీ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించింది. ఈ క్రమంలో తన అందంతోనే కాకుండా అభినయంతోనూ అక్కడి అభిమానుల మనసు దోచుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘లవ్‌ ఎగైన్‌’ అనే హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోంది. ప్రియాంక కేవలం నటిగానే కాకుండా.. ‘పర్పుల్‌ పెబుల్‌ పిక్చర్స్‌’ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగానూ తనదైన ముద్ర వేసింది. ఇలా చిత్ర పరిశ్రమలో తన సేవలకు గుర్తింపుగా పలు అవార్డులతో పాటు ప్రతిష్టాత్మకమైన పీపుల్స్‌ ఛాయిస్‌ అవార్డును సైతం అందుకుంది. ప్రస్తుతం ప్రియాంక యునిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గానూ కొనసాగుతోంది. ఈ క్రమంలో బాలల హక్కులు, బాలికా విద్య కోసం పలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలా అటు వృత్తిలో, ఇటు సేవలో తిరుగులేదనిపిస్తోన్న పీసీ.. తాజాగా ‘బీబీసీ వందమంది ప్రభావశీల మహిళల’ జాబితాలో చోటుదక్కించుకుంది.


అంతరిక్ష అంచులను తాకి..

రోదసీలోకి వెళ్లి భూమిని చూడాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ, ఇది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. భారత సంతతికి చెందిన శిరీషా బండ్ల గతేడాది అంతరిక్ష సంస్థ ‘వర్జిన్ గెలాక్టిక్‌’ ద్వారా తన చిన్ననాటి కలను నిజం చేసుకుంది. తెలుగు మూలాలున్న శిరీష ‘వీఎస్‌ఎస్ యూనిటీ-22’ మిషన్‌లో భాగంగా అంతరిక్ష అంచులను తాకింది. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో భారతీయ మహిళగా రికార్డులకెక్కింది. చిన్నప్పటి నుంచి అంతరిక్షంపై మక్కువ పెంచుకున్న శిరీష.. ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చదవడానికి యూఎస్‌ వెళ్లింది. ఆపై వివిధ అంతరిక్ష సంస్థల్లో పనిచేసిన ఆమె.. 2017 నుంచి వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థలో పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ ఉపాధ్యక్షురాలి(ప్రభుత్వ వ్యవహారాలు, రీసెర్చ్‌ ఆపరేషన్స్‌)గా కొనసాగుతోందామె. ఇలా అంతరిక్ష రంగంలో ఆమె చేస్తోన్న కృషికి గుర్తింపుగా ‘బీబీసీ వంద మంది ప్రభావశీల మహిళల’ జాబితాలో స్థానం సంపాదించుకుందామె.


తన రచనకు ‘బుకర్‌’!

ప్రతి ఒక్కరూ తమ రంగంలో అత్యుత్తమంగా నిలవాలని, ప్రతిష్టాత్మక అవార్డులు అందుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. కానీ అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి ఘనతను ప్రముఖ రచయిత్రి గీతాంజలి శ్రీ ఈ ఏడాది సొంతం చేసుకున్నారు. గీతాంజలి 2018లో ‘రేత్ సమాధి’ పేరుతో హిందీ నవలను రచించారు. ఈ నవలను అమెరికా అనువాదకురాలు డైసీ రాక్‌వెల్‌ ‘టూంబ్‌ ఆఫ్ శాండ్’ పేరుతో ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. 2022కిగాను ఈ నవల ‘అంతర్జాతీయ బుకర్‌ ప్రైజ్‌’ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన తొలి హిందీ నవలా రచయిత్రిగా గీతాంజలి గుర్తింపు పొందారు. అలాగే ఈ నవలకు సంబంధించిన ఫ్రెంచ్‌ అనువాదం ఫ్రెంచ్‌ సాహిత్య పురస్కారానికి(Emile Guimet) కూడా షార్ట్‌లిస్ట్‌ అయ్యింది. ఇలా గీతాంజలి రచించిన ఇతర నవలలు సైతం పలు భారతీయ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లోకీ తర్జుమా అయ్యాయి. గీతాంజలి తన రచనలతోనే కాకుండా.. ‘Vivadi’ అనే నాటక రంగ సంస్థతో కూడా కలిసి పనిచేశారు. ఈ క్రమంలో తాజాగా బీబీసీ విడుదల చేసిన వందమంది ప్రభావశీల మహిళల జాబితాలోనూ స్థానం సంపాదించుకున్నారీ గ్రేట్‌ రైటర్.


విధికి ఎదురీది..

పెళ్లి, పిల్లలు.. ప్రతి మహిళ జీవితంలో ఇవి కీలక దశలు.. అందమైన మలుపులు. కానీ స్నేహా జవాలే విషయంలో మాత్రం పెళ్లి ఓ పీడకలగానే పరిణమించిందని చెప్పాలి. పిల్లాడు పుట్టాక కూడా భర్త, ఆయన సోదరుడు అదనపు కట్నం కోసం ఆమెను వేధించేవారు. ఓరోజు వీళ్లిద్దరూ ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. కాలిన గాయాలతో బయటపడిన ఆమెకు.. 20 సర్జరీలు అయ్యాయి. మొహం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. దీంతో ఇంట్లో, కుటుంబ సభ్యుల మధ్య ఉన్నా నాలుగ్గోడలకే పరిమితమవ్వాల్సిన దుస్థితి ఆమెది. ఆమె భర్త తన కొడుకుని కలుసుకునే అవకాశం కూడా ఆమెకు ఇవ్వలేదు. ఇక ఆపై కొన్నాళ్ల తర్వాత తన కొడుకుని తీసుకొని అతను బయటికి వెళ్లిపోయాడు. విధి తనకు విసిరిన సవాలును ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. ఒంటరిగా కుమిలిపోకుండా తన కెరీర్‌ని పునర్నిర్మించుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే టారట్‌ కార్డ్‌ రీడర్‌ (జోస్యం చెప్పడం), స్క్రిప్ట్‌ రైటర్‌ ఉద్యోగాలను ఎంచుకుంది. ఆపై సమాజ సేవకురాలిగానూ గుర్తింపు పొందిన ఆమె.. ఈ సమాజంలో వివిధ రకాలుగా హింసను ఎదుర్కొంటోన్న మహిళల జీవితాల్ని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నాటకాల రూపంలో ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే.. 2012 నిర్భయ ఘటనపైన తెరకెక్కిన నాటికలోనూ ప్రధాన పాత్ర పోషించింది స్నేహ. ఇలా విధికి ఎదురీది తన జీవితాన్ని తాను పునర్నిర్మించుకున్న ఆమె.. తాజాగా బీబీసీ విడుదల చేసిన అత్యంత ప్రభావశీల మహిళల జాబితాలో చోటుదక్కించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్