దాల్చినచెక్కతో.. అందంగా!

సౌందర్య సంరక్షణలో భాగంగా.. ఇంట్లో లభించే వివిధ రకాల పదార్థాల్ని మనం వాడుతుంటాం. అయితే వంటింటి మసాలా దినుసుల్లో ఎక్కువగా ఉపయోగించే దాల్చిన చెక్క కూడా అందాన్ని పెంపొందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Published : 29 Nov 2023 13:08 IST

సౌందర్య సంరక్షణలో భాగంగా.. ఇంట్లో లభించే వివిధ రకాల పదార్థాల్ని మనం వాడుతుంటాం. అయితే వంటింటి మసాలా దినుసుల్లో ఎక్కువగా ఉపయోగించే దాల్చిన చెక్క కూడా అందాన్ని పెంపొందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్, ఫైబర్, క్యాల్షియం, రిబోఫ్లేవిన్, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం, ‘సి’, ‘ఎ’ వంటి విటమిన్లు.. సౌందర్యపరంగా చక్కని ప్రయోజనాలను అందిస్తాయి. ఈ క్రమంలో దాల్చినచెక్క ఉపయోగించి ఇంట్లోనే చేసుకోదగిన కొన్ని ఫేస్‌ప్యాక్స్ గురించి తెలుసుకుందాం..

మొటిమలు తగ్గడానికి..

ముందుగా దాల్చినచెక్కని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా దాల్చినచెక్క పొడిని తీసుకుని అందులో సరిపడా నిమ్మరసం వేసి పేస్ట్‌లా కలుపుకోవాలి. మొటిమలు, నల్లమచ్చలు ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మొటిమలు, నల్లమచ్చలు తగ్గుముఖం పడతాయి.

తేనెతోనూ..!

నిమ్మరసం ఉపయోగించడం ఇబ్బంది అనుకుంటే దానికి బదులు తేనెను కూడా ఉపయోగించచ్చు. చెంచా దాల్చినచెక్క పొడికి, మూడు చెంచాల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు మొటిమలు, మచ్చలు ఉన్న చోట అప్లై చేసుకోవాలి. అలా రాత్రంతా ఉంచి ఉదయం లేవగానే శుభ్రం చేసుకోవాలి. లేదంటే రాత్రే అరగంట తర్వాత కడిగేసుకోవచ్చు. ఇలా వారానికోసారి చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది.

పొడి చర్మానికి..

దాల్చినచెక్క పొడి చర్మానికి మంచి స్క్రబ్‌లా పని చేస్తుంది. పొడిచర్మంతో బాధపడే వారు దాల్చినచెక్క పొడికి బరకగా దంచిన గళ్లుప్పు, బాదం నూనె, ఆలివ్ ఆయిల్, తేనె జత చేసి మెత్తని మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసుకొని అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే పొడి చర్మం సమస్య తగ్గుముఖం పడుతుంది.. చర్మం తేమగా, మృదువుగా మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్