Published : 05/11/2022 19:43 IST

చర్మ సంరక్షణ కోసం పెప్పర్‌మింట్ నూనె..!

చర్మ సంరక్షణకు పెప్పర్‌మింట్‌ నూనె ఎంతో సహకరిస్తుంది. మొటిమలు, చర్మం నిర్జీవంగా మారడం వంటి తరచుగా ఎదుర్కొనే సమస్యలకు దీని ద్వారా పరిష్కారం పొందచ్చు. ఇవే కాకుండా పలు సౌందర్య ప్రయోజనాలూ ఉన్నాయి. ఈ క్రమంలో సౌందర్య సంరక్షణ కోసం పెప్పర్‌మింట్‌ నూనెను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా..

పంచదారతో..

గిన్నెలో రెండు కప్పుల పంచదార, పావుకప్పు బాదం నూనె, టీ స్పూన్‌ పెప్పర్‌మింట్‌ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఈ మిశ్రమం మరీ జారుడుగా ఉన్నట్లు కనిపిస్తే ఇంకాస్త పంచదార వేసి కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో భద్రపరచుకొని నెల రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. రోజూ స్నానం చేయడానికి ముందు ఈ మిశ్రమంతో శరీరాన్ని మర్దన చేసుకున్నట్లయితే చర్మం కోల్పోయిన తేమను తిరిగి పొందడంతో పాటు మృదువుగా తయారవుతుంది.

ఆలివ్‌ నూనెతో..

గిన్నెలో మూడు టేబుల్‌స్పూన్ల ఉప్పు, రెండు చెంచాల ఆలివ్‌ నూనె, నాలుగు చుక్కల పెప్పర్‌మింట్‌ ఆయిల్‌ వేసి బాగా కలుపుకోవాలి. దీంతో ముఖం, మెడను మృదువుగా, గుండ్రంగా రుద్దుకొని శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం స్క్రబ్‌లా పనిచేసి చర్మంపై చేరిన మురికి, మృత కణాలను తొలగిస్తుంది. ఫలితంగా చర్మం అందంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

జొజోబా ఆయిల్‌తో..

విటమిన్‌ ‘ఇ’, జొజోబా ఆయిల్‌ను సమపాళ్లలో తీసుకొని మిశ్రమంగా చేసుకోవాలి. దీనికి కొన్ని చుక్కల పెప్పర్‌మింట్‌ నూనెను కూడా కలపాలి. ముఖానికి మొటిమలు ఎక్కువగా ఉన్నవారు ఈ మిశ్రమాన్ని నిద్రపోయే ముందు నేరుగా మొటిమలపై రాయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందచ్చు.

కీరాదోసతో..

రెండు చెంచాల తరిగిన కీరాదోస, 5 మి.లీ. పెప్పర్‌మెంట్‌ ఆయిల్‌ తీసుకొని మిశ్రమంగా చేసుకోవాలి. దీనిలో రెండు స్పూన్ల గ్రీన్‌ క్లే (ఇది సూపర్‌ మార్కెట్లలో, ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో లభిస్తుంది)ను కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా వేసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే చర్మం తాజాగా తయారవుతుంది. అలాగే ఇది చర్మంలోని తైల గ్రంథులు అధిక నూనెలు విడుదల చేయకుండా చేస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని