ఈ నూనెతో చర్మ సంరక్షణ!

అందాన్ని సంరక్షించడంలో అత్యవసర నూనెల పాత్ర కీలకం. పెప్పర్‌మింట్‌ నూనె కూడా ఇందుకు మినహాయింపు కాదు.

Published : 02 Dec 2023 12:51 IST

అందాన్ని సంరక్షించడంలో అత్యవసర నూనెల పాత్ర కీలకం. పెప్పర్‌మింట్‌ నూనె కూడా ఇందుకు మినహాయింపు కాదు. మొటిమలు, చర్మం నిర్జీవంగా మారడం, పొడిబారిపోవడం.. వంటి పలు సౌందర్య సమస్యలకు దీని ద్వారా పరిష్కారం పొందచ్చు. ఇవే కాదు.. ఈ నూనెతో పలు సౌందర్య ప్రయోజనాలూ చేకూరతాయంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఈ నూనెను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..!

పంచదారతో..

గిన్నెలో రెండు కప్పుల పంచదార, పావుకప్పు బాదం నూనె, టీ స్పూన్‌ పెప్పర్‌మింట్‌ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఈ మిశ్రమం మరీ జారుడుగా ఉన్నట్లు కనిపిస్తే ఇంకాస్త పంచదార వేసి కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో భద్రపరచుకొని నెల రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. రోజూ స్నానం చేయడానికి ముందు ఈ మిశ్రమంతో శరీరాన్ని మర్దన చేసుకున్నట్లయితే చర్మం కోల్పోయిన తేమను తిరిగి పొందడంతో పాటు మృదువుగా తయారవుతుంది.

ఆలివ్‌ నూనెతో..

గిన్నెలో మూడు టేబుల్‌స్పూన్ల ఉప్పు, రెండు చెంచాల ఆలివ్‌ నూనె, నాలుగు చుక్కల పెప్పర్‌మింట్‌ ఆయిల్‌ వేసి బాగా కలుపుకోవాలి. దీంతో ముఖం, మెడను మృదువుగా, గుండ్రంగా రుద్దుకొని శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం స్క్రబ్‌లా పనిచేసి చర్మంపై చేరిన మురికి, మృత కణాలను తొలగిస్తుంది. ఫలితంగా చర్మం అందంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

జొజోబా ఆయిల్‌తో..

విటమిన్‌ ‘ఇ’ నూనె, జొజోబా ఆయిల్‌ను సమపాళ్లలో తీసుకొని మిశ్రమంగా చేసుకోవాలి. దీనికి కొన్ని చుక్కల పెప్పర్‌మింట్‌ నూనెను కూడా కలపాలి. ముఖానికి మొటిమలు ఎక్కువగా ఉన్న వారు ఈ మిశ్రమాన్ని రోజూ రాత్రి నిద్రపోయే ముందు నేరుగా మొటిమలపై రాయడం ద్వారా.. కొన్ని రోజుల్లోనే మొటిమలు తగ్గుముఖం పట్టడం గమనించచ్చు.

కీరాదోసతో..

రెండు చెంచాల కీరాదోస తురుము, టీస్పూన్‌ పెప్పర్‌మెంట్‌ ఆయిల్‌ తీసుకొని మిశ్రమంగా చేసుకోవాలి. దీనిలో రెండు టీస్పూన్ల గ్రీన్‌ క్లే (ఇది సూపర్‌ మార్కెట్లలో, ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో లభిస్తుంది)ను కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా వేసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే చర్మం తాజాగా మారుతుంది. అలాగే ఇది చర్మం జిడ్డుగా మారకుండా కూడా కాపాడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్