మేని ఛాయ కోసం.. పంచదార!

ఆరోగ్యంగా ఉండాలంటే తీపికి.. అందులోనూ ప్రత్యేకించి పంచదారకు దూరంగా ఉండాలన్నది తెలిసిందే. కానీ ఆరోగ్యానికి చెరుపు చేసే పంచదార సౌందర్య పరిరక్షణలో మాత్రం కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు....

Published : 23 May 2024 12:26 IST

ఆరోగ్యంగా ఉండాలంటే తీపికి.. అందులోనూ ప్రత్యేకించి పంచదారకు దూరంగా ఉండాలన్నది తెలిసిందే. కానీ ఆరోగ్యానికి చెరుపు చేసే పంచదార సౌందర్య పరిరక్షణలో మాత్రం కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు.. మరి అది ఎలాగో చూద్దాం రండి..

లేలేత అధరాలకు..
సాధారణంగానే పెదవుల మీద కొద్దిగా చక్కెర రాస్తే మృతకణాలు తొలగిపోయి మృదువుగా మారతాయి. కొద్దిగా చక్కెర తీసుకుని అందులో పాలు, తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో రోజూ రాత్రి పూట పడుకొనే ముందు పెదవులకు మెల్లగా మర్దన చేసుకుంటే గులాబీల్లాంటి లేలేత అధరాలు సొంతమవుతాయి. అయితే ఈ చిట్కా ఎప్పుడో ఓసారి కాకుండా రెండు లేదా మూడు రోజులకోసారి పాటిస్తేనే సత్ఫలితాలు పొందవచ్చు.

ఎసెన్షియల్ ఆయిల్‌తో..
చర్మం పొడిబారి నిర్జీవంగా మారినప్పుడు చక్కెరని ఉపయోగించి తిరిగి దాన్ని సాధారణ స్థితికి తీసుకురావచ్చు. దీనికోసం కొద్దిగా చక్కెర తీసుకుని అందులో మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ కొన్ని చుక్కలు వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని కాసేపు మృదువుగా మర్దన చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మళ్లీ కొత్త కళను సంతరించుకుంటుంది.

వృద్ధాప్య ఛాయలు రానీయకుండా..
చర్మం ముడతలు పడటం, సన్నని గీతలు కనిపించడం.. వంటి లక్షణాల ద్వారానే వయసు పైబడుతోందన్న విషయం పైకి తెలుస్తుంది. చక్కెరని ఉపయోగించడం వల్ల చర్మం ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు. అలాగే చక్కెర సన్నని గీతలు కూడా కనిపించకుండా చేస్తుంది. దీనికోసం కొద్దిగా చక్కెర తీసుకుని అందులో నిమ్మరసం వేసి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత తడి గుడ్డతో తుడుచుకోవాలి. ఇది సూర్యరశ్మిలో ఎక్కువ సమయం ఉండటం వల్ల ఎదురయ్యే ట్యానింగ్, పిగ్మెంటేషన్ వంటి సమస్యలకు కూడా చక్కని పరిష్కారంగా ఉపయోగపడుతుంది.

మేని ఛాయ కోసం..
చర్మం రంగుని పెంచుకోవాలనుకునేవారు కొద్దిగా గంధం తీసుకుని అందులో రోజ్‌వాటర్, చక్కెర చెంచా చొప్పున వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్త్లె చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్