నిద్రపోయే ముందు.. మేకప్ తీస్తున్నారా?

మేకప్‌.. ఇది మనల్ని రోజంతా అందంగా కనిపించేలా చేసినా రాత్రి పడుకునే ముందు మాత్రం దీన్ని పూర్తిగా తొలగించక తప్పదు. లేదంటే వివిధ రకాల చర్మ సౌందర్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐ మేకప్‌ విషయంలోనూ ఇది వర్తిస్తుందంటున్నారు నిపుణులు.

Published : 08 Jun 2024 12:41 IST

మేకప్‌.. ఇది మనల్ని రోజంతా అందంగా కనిపించేలా చేసినా రాత్రి పడుకునే ముందు మాత్రం దీన్ని పూర్తిగా తొలగించక తప్పదు. లేదంటే వివిధ రకాల చర్మ సౌందర్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐ మేకప్‌ విషయంలోనూ ఇది వర్తిస్తుందంటున్నారు నిపుణులు. ఒకవేళ బద్ధకంతో కంటికి వేసుకున్న మేకప్‌ తొలగించకపోతే మాత్రం కళ్ల కింద నల్లటి వలయాలు, కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు తప్పవంటున్నారు. మరి, ఇంతకీ పడుకునే ముందు ఐ మేకప్‌ తొలగించుకోకపోతే ఎలాంటి సమస్యలొస్తాయి? దీన్ని సరైన పద్ధతిలో తొలగించుకోవడమెలా? రండి.. తెలుసుకుందాం..!

వివిధ పనుల రీత్యా అలసిపోయి ఇంటికి చేరుకోవడం, ఆలస్యమవడం.. ఇలా కారణమేదైనా రాత్రయ్యేసరికి ఒక రకమైన బద్ధకం ఆవహిస్తుంటుంది. దీంతో ఏదో పైపైన మొహం కడిగేసుకొని మేకప్‌ సంగతి రేపు చూసుకుందాంలే అనుకుంటారు చాలామంది. అయితే ఈ అజాగ్రత్తే లేనిపోని కంటి సమస్యల్ని తెచ్చిపెడుతుందని చెబుతున్నారు నిపుణులు.

చర్మ అలర్జీలు తప్పవు!

కంటి మేకప్‌ తొలగించుకోకుండా ఏదో పైపైన శుభ్రం చేసుకొని పడుకుంటుంటారు కొంతమంది అమ్మాయిలు. దీనివల్ల రాత్రి మనకు తెలియకుండానే కళ్లు దురద పుట్టచ్చు.. నలపచ్చు.. దాంతో మేకప్‌ కళ్లలోకి చేరుతుంది.. అలాగే అటూ ఇటూ దొర్లే క్రమంలో దిండ్లు, బెడ్‌షీట్స్‌కి సైతం మేకప్ అంటుకుంటుంది. అక్కడి నుంచి చర్మం పైకి చేరి లేనిపోని ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. కాబట్టి ఈ సమస్యలన్నీ తలెత్తకూడదంటే కాస్త ఓపిక చేసుకొని ఐ మేకప్‌ని తొలగించుకోవడం మంచిది.

మస్కారా తొలగిస్తున్నారా?

కనురెప్పల్ని తీర్చిదిద్దుకోవడానికి, వాటిని వంపులు తిరిగేలా చేయడానికి మస్కారా వాడడం మనకు అలవాటే! అయితే ఇది రెప్పలకు మందంగా అంటుకొని.. వాటిని అలాగే బిగుసుకుపోయేలా చేస్తుంది. తద్వారా కనురెప్పల్లోని నూనె గ్రంథులు మూసుకుపోతాయి. ఇక రాత్రంతా కూడా మస్కారా పెట్టుకొని ఉండడం వల్ల రెప్పలకు తేమ అందక అవి తమ సహజత్వాన్ని కోల్పోతాయి. పెళుసుబారిపోయి తెగిపోయే ప్రమాదమూ లేకపోలేదు. ఇదిలాగే కొనసాగితే కనురెప్పలు క్రమంగా పల్చబడి కంటి అందం దెబ్బ తింటుంది. కాబట్టి రాత్రి ఇంటికి చేరుకున్న తర్వాత మస్కారాను పూర్తిగా తొలగించుకోవడం మంచిది.

నల్లటి వలయాలొస్తాయ్!

రోజంతా అలసిపోయిన శరీరం రాత్రి పడుకున్నప్పుడు విశ్రాంతి తీసుకున్నట్లే.. కళ్లూ రాత్రి పూట రిలాక్సవుతాయి. ఈ క్రమంలో కళ్ల చుట్టూ ఉండే చర్మకణాలు యాక్టివేట్‌ అయి అక్కడి చర్మాన్ని రిపేర్‌ చేసుకుంటాయి. అయితే రాత్రి పూట మేకప్‌ తొలగించకుండా అలాగే పడుకోవడం వల్ల దీనిలోని రసాయనాలు ఈ కణాల పనితీరును అడ్డుకుంటాయి. తద్వారా కళ్ల కింద నల్లటి వలయాలు, కంటి చుట్టూ వాపు.. వంటి సమస్యలొస్తాయి. ఫలితంగా చిన్న వయసులోనే వృద్ధ్యాప్య ఛాయలు అలుముకుంటాయి. కాబట్టి రాత్రి పూట కళ్లకు వేసుకున్న మేకప్‌ తొలగించి వాటికి కాస్త సాంత్వన ఇవ్వడం మంచిదంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్