వేసవి తాపాన్ని తరిమేసే ఐస్‌క్యూబ్స్!

'అబ్బబ్బ.. ఏం ఎండలో..! బయట అడుగుపెడితే చాలు.. చర్మం మాడిపోతోంది..' అంటూ చిటపటలాడుతోంది స్వప్న.ప్రస్తుతం ఈ మండే ఎండల్లో బయటకు వెళ్లి ఇంటికి చేరిన వెంటనే ఎవరైనా ఇలానే మాట్లాడతారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అలా ఉంటున్నాయి మరి.

Published : 03 Apr 2024 21:58 IST

'అబ్బబ్బ.. ఏం ఎండలో..! బయట అడుగుపెడితే చాలు.. చర్మం మాడిపోతోంది..' అంటూ చిటపటలాడుతోంది స్వప్న.

ప్రస్తుతం ఈ మండే ఎండల్లో బయటకు వెళ్లి ఇంటికి చేరిన వెంటనే ఎవరైనా ఇలానే మాట్లాడతారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అలా ఉంటున్నాయి మరి. ఈ క్రమంలో ఇంట్లో మనకు అందుబాటులో ఉండే సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి తయారుచేసే ఐస్‌క్యూబ్స్‌తో వేసవి వేడిమి కారణంగా తలెత్తే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి..

పసుపు..

సహజసిద్ధంగా చర్మాన్ని మెరిపించే గుణం పసుపు సొంతం. అలాగే వేసవి వేడి నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని కోసం పావుకప్పు నీళ్లలో కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోసి ఫ్రిజ్‌లో పెట్టేయడమే. బయటకు వెళ్లి వచ్చిన తర్వాత ఈ క్యూబ్స్‌తో ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మృదువుగా రుద్దుకుని, నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఫలితంగా చర్మానికి చల్లదనం చేకూరడంతో పాటు మెరుపు కూడా సంతరించుకుంటుంది. అంతేకాదు.. వేసవిలో తలెత్తే పలు చర్మ సంబంధిత సమస్యలకు కూడా ఇది చక్కని పరిష్కారం.

చాక్లెట్..

డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మంపై ముడతలు రాకుండా సంరక్షించడంతో పాటు తగినంత తేమను అందించి మృదువుగా, మచ్చల్లేకుండా చేస్తాయి. అందుకే వేసవిలో తీసుకునే సౌందర్య సంరక్షణలో భాగంగా చాక్లెట్ ఐస్‌క్యూబ్స్ కూడా ఒక మంచి ఎంపిక అంటున్నారు సౌందర్య నిపుణులు.

దీనికోసం ఒక చెంచా డార్క్ చాక్లెట్ పౌడర్‌కు పావుకప్పు నీళ్లు జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోసుకొని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. బయట నుంచి వచ్చిన వెంటనే ఈ క్యూబ్‌తో ముఖం, మెడపై మృదువుగా రుద్దుకోవాలి. చర్మంపై చేరిన మలినాలు తొలగించి, సహజసిద్ధంగా మెరిపించడంలో వీటికి మించినది మరొకటి లేదట!

పుచ్చకాయతో..

చర్మాన్ని సహజసిద్ధంగా మెరిపించే పండ్లలో పుచ్చకాయ ముందు వరుసలో ఉంటుంది. దీనిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఐస్ ట్రేలో వేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఎండలో నుంచి ఇంటికి రాగానే ఈ క్యూబ్‌తో చర్మంపై మృదువుగా రుద్దుకోవాలి. ఫలితంగా ఎండ కారణంగా కమిలి, అలసిపోయిన చర్మం తిరిగి తాజాదనాన్ని సంతరించుకుంటుంది. అలాగే ప్రకాశవంతంగా కూడా కనిపిస్తుంది.

ఇవే కాదు.. కీరాదోస ముక్కలు, పుదీనా రసం, రోజ్‌వాటర్, ఆరెంజ్ జ్యూస్, హెర్బల్ గ్రీన్ టీ, నిమ్మరసం, స్ట్రాబెర్రీ, కివీ, బెర్రీస్, ద్రాక్ష.. మొదలైన పండ్లతో తయారుచేసిన ఐస్‌క్యూబ్స్ కూడా వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తూనే మేనికి మెరుపుని చేకూరుస్తాయి. మీరు కూడా వీటిని ఓసారి ట్రై చేసి చూడండి మరి..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్