Published : 11/02/2023 17:10 IST

ప్రేమనే కాదు.. అందాన్నీ పెంచే గులాబీలు!

'మేఘాలు లేకున్నా.. నా పైన ఈ వాన..' అంటూ ప్రేమలో మునిగి తేలుతున్న ప్రేమికులంతా వేలంటైన్స్ డే కోసం ఎన్నో రోజుల ముందు నుంచే రడీ అయిపోతూ ఉంటారు. మామూలు సందర్భాల్లోనే మనసుకి నచ్చిన వారికి ప్రత్యేకంగా, అందాల బొమ్మలా కనిపించాలనుకొనే క్రమంలో.. ఈ ప్రత్యేకమైన సందర్భంలో మరింత అందంగా మెరిసిపోవాలని కోరుకోవడం సహజం. అయితే ప్రేమికుల రోజున ఇచ్చిపుచ్చుకునే రోజా పూలతో ప్రేమనే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే..

గులాబీ పూల రేకలతో..

గుప్పెడు గులాబీ పూరేకలు తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. ముఖం బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లా వేసుకోవాలి. తర్వాత 15 నుంచి 20 నిమిషాలు ఆరనిచ్చి సబ్బు ఉపయోగించకుండా నీటితో కడిగేసుకోవాలి. ఫలితంగా చర్మం మృదువుగా మారడమే కాకుండా కాంతిని సంతరించుకొని, పరిమళాన్ని వెదజల్లుతుంది.

ఈ మిశ్రమానికి తాజా ఫేస్ క్రీం కొద్దిగా కలిపి ముఖానికి మాస్క్‌లా కూడా వేసుకోవచ్చు. ఫలితంగా చర్మాన్ని నిగారించేలా చేయడమే కాకుండా పెదవులు కూడా పగిలిపోకుండా సంరక్షించుకోవచ్చు.

చర్మం ప్రకాశించడానికి..

తాజా గులాబీ పూరేకలు కొద్దిగా తీసుకుని చిక్కగా ఉన్న పెరుగులో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకి ప్యాక్‌లా అప్త్లె చేసుకుని 15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ద్వారా చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుంది. అయితే ఇందుకు ఉపయోగించే గులాబీ రేకలు బాగా శుభ్రం చేసినవై ఉండాలి. అప్పుడే ఈ ప్యాక్ వల్ల సత్ఫలితాలు ఆశించవచ్చు.

మచ్చ లేని చందమామలా..

గులాబీ రేకలతో తయారు చేసిన పొడి ప్రత్యేకంగా మార్కెట్లో లభ్యమవుతుంది. లేదంటే కొన్ని గులాబీ పూల రేకల్ని ఎండబెట్టి కూడా పొడి చేసుకోవచ్చు. ఇలా తయారుచేసుకున్న పొడి కొద్దిగా తీసుకుని, అందులో చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్త్లె చేసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను క్రమం తప్పకుండా వేసుకోవడం వల్ల చర్మం నిగారింపును కోల్పోకుండా ఉండటమే కాకుండా మెరుస్తూ తాజాగా కనిపిస్తుంది.

నవయవ్వనంతో...

రెండు చెంచాల సహజసిద్ధమైన గంధం, పావుకప్పు పాలు, గుప్పెడు గులాబీ రేకలు తీసుకుని బాగా మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్త్లె చేసుకుని ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం మెరుపుని సంతరించుకోవడంతో పాటు యవ్వనంగా కూడా కనిపిస్తుంది.

గులాబీలతో..

⚛ గులాబీ రేకలను మరగబెట్టిన నీళ్లను ఫేస్ ప్యాక్‌లు కలపడానికి ఉపయోగించడం వల్ల చక్కని ఫలితాలు కనిపిస్తాయి.

⚛ రోజ్‌వాటర్‌లో ముంచిన దూదితో ముఖాన్ని రోజూ తుడుచుకోవడం వల్ల చర్మం నిగారిస్తుంది.

⚛ గులాబీ రేకల్ని మెత్తని ముద్దలా చేసి వారానికి ఒకటి లేదా రెండుసార్లు చొప్పున ప్యాక్‌లా వేసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారడమే కాదు. పరిమళాలను కూడా వెదజల్లుతుంది.

⚛ స్నానానికి ఉపయోగించే నీటిలో గులాబీ రేకల్ని వేసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని