అందాన్ని పెంచే ‘గులాబీ’!

ప్రేమికుల రోజున నచ్చిన వారికి గులాబీలిచ్చి తమ మనసులోని ప్రేమను తెలపడం కామనే! అయితే ఇవే గులాబీలతో సిగను అలంకరించుకొని మూగ ప్రేమనూ తెలియజేస్తుంటారు మరికొందరు.

Published : 10 Feb 2024 18:49 IST

ప్రేమికుల రోజున నచ్చిన వారికి గులాబీలిచ్చి తమ మనసులోని ప్రేమను తెలపడం కామనే! అయితే ఇవే గులాబీలతో సిగను అలంకరించుకొని మూగ ప్రేమనూ తెలియజేస్తుంటారు మరికొందరు. అయితే ఇలా మనసులోని ప్రేమను వ్యక్తం చేసే గులాబీలతో అందాన్నీ ద్విగుణీకృతం చేసుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి..

చర్మం మృదువుగా!

గుప్పెడు గులాబీ పూరేకలు తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లా వేసుకోవాలి. అరగంటయ్యాక సబ్బు ఉపయోగించకుండా నీటితో ముఖం కడుక్కోవాలి. ఈ చిట్కాను తరచూ పాటిస్తుంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. అలాగే చర్మం గులాబీ లాంటి లేలేత రంగును సంతరించుకుంటుంది.

తేమను కోల్పోకుండా..!

గులాబీ పూరేకల పేస్ట్‌కు ఫేస్ క్రీం కొద్దిగా కలిపి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా కూడా వేసుకోవచ్చు. ఫలితంగా చర్మం తేమగా మారుతుంది. అలాగే పెదాలపైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు. తద్వారా గులాబీల్లాంటి అధరాల్ని సొంతం చేసుకోవచ్చు.

ముఖ కాంతికి..

గులాబీ పూరేకల్ని చిక్కటి పెరుగులో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు ప్యాక్‌లా అప్లై చేసుకొని 15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ద్వారా చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుంది.

మచ్చలు మాయం!

గులాబీ రేకల్ని ఎండబెట్టి తయారు చేసిన పొడి మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే దీన్ని ఇంట్లో కూడా తయారుచేసుకోవచ్చు. కొద్దిగా గులాబీ పొడిలో చెంచా తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసుకొని 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను క్రమం తప్పకుండా వేసుకోవడం వల్ల చర్మంపై ఏర్పడిన నల్ల మచ్చలు తొలగిపోతాయి.

నవయవ్వనంగా..!

రెండు చెంచాల గంధం పొడి, పావు కప్పు పాలు, గుప్పెడు గులాబీ రేకలు తీసుకొని మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసుకొని ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం మెరుపుని సంతరించుకోవడంతో పాటు నవయవ్వనంగానూ మెరిసిపోవచ్చు.

ఇలా కూడా!

⚛ రోజ్‌వాటర్‌ను నేరుగా ముఖానికి రాసుకోవడం లేదంటే ఫేస్ ప్యాక్‌ల్లో కలపడం వల్ల సత్ఫలితాలుంటాయి.

⚛ రోజ్‌వాటర్‌లో ముంచిన దూదితో రోజూ ఉదయాన్నే ముఖాన్ని తుడుచుకోవడం వల్ల చర్మం నిగారిస్తుంది.

⚛ స్నానానికి ఉపయోగించే నీటిలో కొన్ని గులాబీ రేకల్ని వేసుకోవడం వల్ల అందం ద్విగుణీకృతమవుతుంది. అలాగే ఒత్తిడి నుంచీ ఉపశమనం పొందచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్