స్వర్గానుభూతిని కలిగించే ‘బబుల్ బాత్’..!

కొంతమందికి టబ్ బాత్ అంటే చాలా ఇష్టం. అందులోనూ ఫోమ్‌తో నిండిన టబ్‌లో, సుగంధ ద్రవ్యాలు కలిపి స్నానం చేయడమంటే ఇంకా ఇష్టం. దీన్నే 'బబుల్ బాత్' అంటారు. స్థోమత ఉన్నవాళ్లు ఇంట్లోనే ఈ సౌకర్యం కల్పించుకుంటుంటే, మరికొందరు మాత్రం....

Published : 04 Dec 2022 19:20 IST

కొంతమందికి టబ్ బాత్ అంటే చాలా ఇష్టం. అందులోనూ ఫోమ్‌తో నిండిన టబ్‌లో, సుగంధ ద్రవ్యాలు కలిపి స్నానం చేయడమంటే ఇంకా ఇష్టం. దీన్నే 'బబుల్ బాత్' అంటారు. స్థోమత ఉన్నవాళ్లు ఇంట్లోనే ఈ సౌకర్యం కల్పించుకుంటుంటే, మరికొందరు మాత్రం స్పాలను ఆశ్రయిస్తున్నారు. ఇక, లగ్జరీ హోటళ్లు, హాలిడే రిసార్ట్స్ లాంటివి జనాల్ని ఆకర్షించడానికి ఉపయోగించే మంత్రాల్లో ఇది కూడా ఒకటి.

రోజంతా పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత బాగా అలసిపోయి, తీవ్ర ఒత్తిడికి గురవడం మామూలే! దాన్నుంచి బయటకు రావడానికి మనం చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు.. ఎంత ప్రయత్నించినా ఒత్తిడి, అలసట నుంచి పూర్తిగా బయటకు రాలేం. కానీ, ఈసారి బాగా అలసిపోయి, ఒత్తిడికి గురవుతున్న సమయంలో ఒక్కసారి బబుల్ బాత్ చేసి చూడండి. మీ ఒత్తిడి.. ఉఫ్ మని ఎగిరిపోవడం ఖాయం. అదే బబుల్ బాత్ మ్యాజిక్. దానివల్ల ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా బాత్ టబ్‌లో కలుపుకొనే సుగంధతైలాలది ఇందులో ప్రధాన పాత్ర. మీ అభిరుచిని బట్టి, ఆశించే ప్రయోజనాన్ని బట్టి ఈ నూనెలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే అందరి అభిరుచులకు అనుగుణంగా ఉండే రకరకాల ఆయిల్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి మూడు రకాలుగా ఉంటాయి.

⚜ ఎసెన్షియల్ ఆయిల్స్: వీటిని అలసట, ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడానికి ఉపయోగిస్తారు. లావెండర్, మిర్, చందనం, మర్జోరం.. మొదలైనవి మార్కెట్లో లభిస్తున్నాయి.

⚜ కాస్మెటిక్ ఆయిల్స్: వీటిని చర్మ సంరక్షణకు ఉపయోగిస్తారు. చర్మానికి అవసరమయ్యే తేమని అందించి ప్రకాశవంతంగా మారడానికి ఇవి సహకరిస్తాయి. నిమ్మగడ్డి, పిప్పర్‌మెంట్, స్పియర్‌మింట్ వంటి రకాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

⚜ వీటితో పాటు వేపనూనె వంటి మెడిసినల్ ఆయిల్స్ కూడా మార్కెట్లో ఉంటున్నాయి. చర్మ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి వీటిని ఉపయోగిస్తారు.

చర్మ సంరక్షణకు చక్కటి మార్గం

ఇలా మీ అభిరుచిని బట్టి, ఆశించే ప్రయోజనాన్ని బట్టి బబుల్ బాత్‌కు ఉపయోగించే ఆయిల్స్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ ఆయిల్స్ ద్వారానే టబ్‌లో ఫోమ్ ఏర్పడుతుంది. ఇక, బబుల్ బాత్ వల్ల కలిగే లాభాల జాబితా కాస్త పెద్దదనే చెప్పాలి. ముఖ్యంగా చర్మ సంరక్షణకు ఇది బాగా ఉపకరిస్తుంది. స్నానం చేస్తూ, ప్యూమిక్ స్టోన్స్‌తో మోకాళ్లు, మోచేతులు, పాదాల దగ్గర ఉండే మృత కణాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవడం ద్వారా సున్నితమైన చర్మం సొంతమవుతుంది. అయితే ఇలా స్నానం చేయడానికీ ఓ పద్ధతుంది. స్నానం చేసే ప్రదేశంలో క్యాండిల్స్ పెట్టుకుని ఆహ్లాదభరిత వాతావరణాన్ని సృష్టించుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో లైట్ మ్యూజిక్ వినిపిస్తూ.. మంచి సుగంధ ద్రవ్యాలు కలిపిన నీటిలో అలా రిలాక్స్ అవుతూ స్నానం చేస్తే.. ఎక్కడో స్వర్గంలో ఉన్నట్లే ఉంటుంది!

ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఒకవేళ బాత్ టబ్ లేకపోయినా మామూలుగా స్నానం చేసే నీటిలో ఈ ఆయిల్స్ కలుపుకోవడం వల్ల కూడా ఒత్తిడి నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. అయితే స్నానానికి వాడే ఆయిల్స్‌ను ఎంపిక చేసుకునే ముందు వాటి నాణ్యతను బాగా పరిశీలించి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అవేవీ వద్దనుకుంటే మామూలుగానే కాస్త గోరువెచ్చగా ఉండే నీటితో స్నానం చేసినా ఫలితం ఉంటుంది. అంతేకానీ, తక్కువ నాణ్యత ఉండే సుగంధ తైలాలను మాత్రం ఉపయోగించకూడదు.

బబుల్ బాత్ చేసిన తర్వాత జననేంద్రియాల వద్ద ఏదైనా ఇన్‌ఫెక్షన్ సోకిన లక్షణాలు కనిపించినా, చర్మం పైన ఏవైనా తేడాలు గమనించినా.. వెంటనే వైద్యుల్ని తప్పక సంప్రదించాలి. తగిన జాగ్రత్తలు తీసుకుని బబుల్ బాత్ చేస్తే ఇక స్వర్గం మీ చెంతే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్