వరదలు ముంచితే.. మళ్లీ ప్రారంభించా!

చదువూ, పెళ్లీ, పిల్లలూ...ఇలా కొన్నేళ్లు తీరిక లేకుండానే గడిచిపోతుంది. ఆ తర్వాతే.. ఖాళీగా ఉంటున్నామనే ఆలోచన మొదలవుతుంది.

Published : 08 Feb 2023 00:17 IST

చదువూ, పెళ్లీ, పిల్లలూ...ఇలా కొన్నేళ్లు తీరిక లేకుండానే గడిచిపోతుంది. ఆ తర్వాతే.. ఖాళీగా ఉంటున్నామనే ఆలోచన మొదలవుతుంది. అలాంటి సమయాన్నే సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు రత్నకుమారి. రూ. 200 పెట్టుబడితో పచ్చళ్ల తయారీ మొదలుపెట్టిన ఆమె... దేశవిదేశాలకు ఎగుమతి చేస్తూ కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.. 

శ్రమించే లక్షణం ఉన్నప్పుడు ఎడారిలో కూడా పూలు పూయించొచ్చని నా నమ్మకం. అందుకే కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలన్న ఆలోచన వచ్చినప్పుడు అంతా ఎందుకు నీకింత కష్టమన్నారు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశా. మాది కృష్ణా జిల్లా గుంటుపల్లి. రైతు కుటుంబంలో పుట్టి పెరిగా. తొమ్మిదో తరగతి చదువు పూర్తయ్యిందో లేదో మా దూరపు బంధువు మద్దుకూరి కనక దుర్గప్రసాద్‌తో పెళ్లి చేశారు. ఆయన హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ కేబుల్‌లో ఉద్యోగం చేసేవారు. తను ఉద్యోగానికి వెళితే ఇంట్లో ఖాళీగా ఉండటం కష్టంగా ఉండేది. దాంతో ఏదైనా సొంతంగా చేయాలన్న ఆలోచనకు వచ్చా. అలవాటు అయిన పనినీ, ఇష్టమైనదాన్నీ ఎంచుకుంటే మేలనే ఆలోచనతో పుట్టింట్లో నేర్చుకున్న పచ్చళ్ల తయారీనే వ్యాపారంగా మొదలుపెట్టా. పోపుల డబ్బాలో దాచుకున్న రెండొందల రూపాయల్నే పెట్టుబడిగా పెట్టి 1979లో అద్దె గదిలోనే ప్రారంభించా. వాటిని మా వారు ఏజీ ఆఫీసు, బీహెచ్‌ఈఎల్‌ వంటిచోట్ల అమ్మేవారు. అందరూ బాగుందని కితాబివ్వడమే కాదు...వ్యాపారమూ పెరిగింది. దాంతో ఆరేళ్ల తర్వాత ‘వామన్‌ పికిల్స్‌’ పేరుతో ఫుడ్‌ లైసెన్స్‌ తీసుకుని మరీ పెద్ద ఎత్తున తయారీ ప్రారంభించా. బ్యాంకు రుణం తీసుకుని మరీ మల్లాపూర్‌ ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలో స్థలం తీసుకున్నాం. షెడ్డు వేసి మా వ్యాపారం సాగించాం. ఆర్డర్లు పెరగడంతో మా వారు తన ఉద్యోగాన్ని వదులుకున్నారు. క్రమంగా వివిధ ప్రాంతాలనుంచి పెద్ద ఆర్డర్లు వచ్చేవి. అమెరికాకీ ఎగుమతి చేయడం ప్రారంభించాక ఏటా కోటిరూపాయల టర్నోవర్‌కి చేరుకున్నాం.

వాటితో నష్టం..

వ్యాపారం అంటేనే లాభనష్టాల జూదం కదా.. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఏ రూపంలోనష్టం వచ్చిపడుతుందో ఊహించలేం. వ్యాపారం పుంజుకుంటోందన్న సమయంలో వరదలొచ్చి పరిశ్రమ, యంత్రాలు, పచ్చడి, సరకు నిల్వలన్నీ మునిగిపోయాయి. పెద్ద ఎత్తున నష్టపోయాం. మామూలు స్థితికి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. బ్యాంకు వాయిదాలు చెల్లించేందుకు ఇబ్బందులు పడ్డాం. ఈ ఇబ్బందులన్నీ తట్టుకోలేని పరిస్థితుల్లో మా పరిశ్రమనే అమ్మేశాం. ఎన్నో ఒడుదొడుకుల తర్వాత చౌటుప్పల్‌ మండలం మల్కాపురంలోని టీఎస్‌ఐఐసీ వారు ఏర్పాటు చేసిన హరిత పరిశ్రమల పార్కులో స్థలం కొన్నాం. వినియోగదారుల అవసరాలూ, రుచులూ, మార్కెటింగ్‌ వంటివన్నీ దృష్టిలో పెట్టుకుని మా అమ్మాయితో కలిసి 2022లో రూ.1.50 కోట్లు పెట్టుబడితో, అధునాతన యంత్ర పరికరాల సాయంతో ‘భోం చేశారా’ అంటూ మరో సంస్థని ఏర్పాటు చేశాం.

స్థానిక మహిళలకే ఉపాధి

ఈ పచ్చళ్ల తయారీ పరిశ్రమలో స్థానికంగా ఇరవై మంది మహిళలకు ఉపాధి కల్పించాం. వడియాలూ, పచ్చళ్లూ, స్వీట్లూ, తినుబండారాలూ..ఒకటేమిటి మా దగ్గర ఎన్నో దొరుకుతాయి. వీటిలో ఎటువంటి రంగులూ, రసాయనాలూ వినియోగించం. అచ్చం పాతకాలం నాటి రుచీ, శుచితో సంప్రదాయంగా తయారు చేస్తాం. కుటుంబ సభ్యుల సమష్టి కృషితో తొలిఏడాదే రూ.60 లక్షలకుపైగా అమ్మకాలు సాగించాం. మా మనవడి సాయంతో విదేశాలకూ ఎగుమతి చేస్తున్నాం. భవిష్యత్తులో మరింతగా వ్యాపారాన్ని విస్తరించి ఎంతో మంది మహిళలకు ఉపాధినివ్వాలన్నదే నా కల.

- సూరపల్లి రఘుపతి, యాదాద్రి భువనగిరి జిల్లా

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్