Star Kids: జాక్‌పాట్‌ కొట్టేశారు!

సినిమా అవకాశాల కోసం ఒకప్పుడు బాలీవుడ్‌ వైపు చూసేది తారాలోకం. కానీ ఇప్పుడు టాలీవుడ్‌ పైనే అందరి దృష్టీ పడింది. పాన్‌ ఇండియా స్థాయిలో ఇక్కడి చిత్రాలు హిట్‌ కావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం టాలీవుడ్‌లో రూపొందుతోన్న అలాంటి కొన్ని పాన్‌ ఇండియా సినిమాలతో తెరంగేట్రం చేసే అవకాశం దక్కించుకున్నారు కొందరు బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌....

Published : 31 Mar 2024 14:55 IST

సినిమా అవకాశాల కోసం ఒకప్పుడు బాలీవుడ్‌ వైపు చూసేది తారాలోకం. కానీ ఇప్పుడు టాలీవుడ్‌ పైనే అందరి దృష్టీ పడింది. పాన్‌ ఇండియా స్థాయిలో ఇక్కడి చిత్రాలు హిట్‌ కావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం టాలీవుడ్‌లో రూపొందుతోన్న అలాంటి కొన్ని పాన్‌ ఇండియా సినిమాలతో తెరంగేట్రం చేసే అవకాశం దక్కించుకున్నారు కొందరు బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌. ‘తమ ఎదురుచూపులు ఇలా ఫలించాయం’టూ మురిసిపోతున్నారు. మరి, టాలీవుడ్‌లో తొలి సినిమాతోనే జాక్‌పాట్‌ కొట్టేసిన ఆ బాలీవుడ్‌ బ్యూటీస్‌ ఎవరు? వాళ్ల మనసులోని మాటేంటో తెలుసుకుందాం రండి..

నా కల ఫలించింది!

దివంగత నటి శ్రీదేవి, బాలీవుడ్‌ దర్శకనిర్మాత బోనీ కపూర్‌ల గారాల పట్టి జాన్వీ కపూర్‌కు బాలీవుడ్‌లో ఎంత క్రేజుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అక్కడ వరుస చిత్రాలతో జోరుమీదున్న ఈ భామకు ఎప్పట్నుంచో ఓ కోరిక ఉందట! అదేంటంటే.. తెలుగు సినిమాల్లో నటించాలని.. తన తల్లిలా ఇక్కడా మంచి పేరు తెచ్చుకోవాలని! ఎట్టకేలకు ఆ కోరిక ‘దేవర’తో నెరవేరిందంటోంది జాన్వి. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన నటిస్తోందీ కపూర్‌ బ్యూటీ. ఇందుకోసం తెలుగు కూడా నేర్చుకుంటున్నానంటోంది.
‘అమ్మ టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందింది. అంటే మాకూ ఈ చిత్ర పరిశ్రమతో దృఢమైన అనుబంధం ఉంది. అయినా నేను ఇన్నాళ్లూ తెలుగు నేర్చుకోలేకపోయా. నిజంగా ఇందుకు నేను సిగ్గుపడుతున్నా. అయితే తెలుగు భాషను ఫొనెటిక్‌ పద్ధతిలో అర్థం చేసుకోగలను. కానీ మాట్లాడలేను. ఇది నా కెరీర్‌లో పెద్ద లోటే! ‘దేవర’తో ఆ లోటును పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నా. చిత్ర బృందం కూడా ఎంతో ఓపిగ్గా నాకు తెలుగు నేర్పిస్తోంది. డైలాగ్స్‌ సాధన చేసే క్రమంలో నా చుట్టూ ఉన్న వారితో పూర్తిగా తెలుగులో మాట్లాడడానికే ప్రయత్నిస్తున్నా. ఇక దేవరలో తంగం అనే పాత్రలో నటిస్తున్నా. గ్రామీణ నేపథ్యం ఉన్న పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్ర ఇది. తెరపై ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇలా టాలీవుడ్‌లో పాన్‌ ఇండియా సినిమాలో నటించే అవకాశం రావడం ఒకెత్తయితే.. నా ఫేవరెట్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన నటించడం మరింత సంతోషంగా ఉంది.. అమ్మ కూడా సీనియర్‌ ఎన్టీఆర్‌ సరసనే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది..’ అంటోంది జాన్వి. ‘దేవర’లోనే కాదు.. రామ్‌చరణ్‌ సరసన ‘RC 16 (టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు)’లోనూ హీరోయిన్‌గా నటిస్తోందీ బాలీవుడ్‌ దివా. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు.


ఎంతో నేర్చుకుంటున్నా!

చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు రావాలంటే ఎంతో పూర్వానుభవం గడించాలి. కానీ కెరీర్‌ ఆరంభంలోనే ఉన్నత అవకాశాలు తలుపు తడితే అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి? అలాంటి అరుదైన అవకాశమే అందుకుంది బాలీవుడ్‌ స్టార్‌ గర్ల్‌ షనాయా కపూర్‌. బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ సంజయ్‌ కపూర్‌-మహీప్‌ కపూర్‌ల గారాల పట్టి ఆమె. రెండేళ్ల క్రితమే ‘బేదఢక్‌’ చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన షనాయా.. నటించింది రెండు సినిమాలే అయినా తన ప్రతిభతో అందరినీ మెప్పించింది. ఈ ట్యాలెంటే ఆమెకు దక్షిణాది సినిమాల్లో నటించే అవకాశాన్ని అందించింది. మలయాళ స్టార్‌ మోహన్‌ లాల్‌ కీలక పాత్రలో రూపొందుతోన్న ‘వృషభ’లో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ సరసన నటిస్తోందీ చక్కనమ్మ.
‘వృషభ సినిమాకు సంతకం చేసినప్పట్నుంచి ఎప్పుడెప్పుడు కెమెరా ముందుకు వద్దామా? షూటింగ్‌ ఎప్పుడు మొదలవుతుందా? అన్న ఆతృతతో ఎదురుచూసేదాన్ని. ఈ కథ నాకెంతో నచ్చింది.. నా మనసుకు దగ్గరైంది. చిత్ర షూటింగ్‌లో పాల్గొంటూనే ఈ సినిమా నుంచి బోలెడన్ని విషయాలు నేర్చుకుంటున్నా. ఇక ఇందులో దిగ్గజ స్టార్లుండడంతో భారీ స్థాయిలో దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో నా పాత్ర ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఒక యువ నటికి ఇంతకంటే కావాల్సిందేముంటుంది? ఇలా ఈ సినిమాతో దిగ్గజ స్టార్ల సరసన నటించే అవకాశం రావడం, అది కూడా కెరీర్‌ ఆరంభంలోనే కావడంతో చెప్పలేనంత సంతోషంగా ఉన్నా.. మొత్తానికి తెలుగులో నటించాలన్న నా కోరిక ఇలా నెరవేరింది..’ అంటోందీ స్టార్‌ బ్యూటీ. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.


‘అడక్కుం’డానే అవకాశం!

కుటుంబ నేపథ్యంతో సంబంధం లేకుండా సొంత గుర్తింపును సంపాదించుకోవాలనుకుంటారు కొందరు. వారిలో నటి, కమెడియన్‌ జామీ లీవర్‌ ఒకరు. బాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ జానీ లీవర్‌ కూతురైన ఆమె.. పలు బాలీవుడ్‌ చిత్రాల్లో సందడి చేసింది. టీవీ షోలు, వెబ్‌ సిరీస్‌లతోనూ తనదైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ ప్రతిభే ఆమెకు ఓ టాలీవుడ్‌ చిత్రంలో అవకాశం కల్పించింది. ఇటీవలే విడుదలైన కామెడీ చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’లో కీలక పాత్రలో నటించింది జామీ.
‘ఒక్క తెలుగు సినిమాలోనైనా నటించాలన్నది నా డ్రీమ్‌. ‘ఆ ఒక్కటీ అడక్కు’తో అది ఫలించింది. ఈ అవకాశం నాకు సహజసిద్ధంగానే వచ్చింది. నా వెబ్‌సిరీస్‌ ‘పాప్‌కార్న్‌’ చూసి ఈ చిత్ర దర్శకుడు మల్లి నాకు ఈ అవకాశమిచ్చారు. నిజానికి నన్ను ఎంపిక చేసే వరకు ఆయనకు తెలియదు.. నేను ప్రముఖ కమెడియన్‌ జానీ లీవర్‌ కుమార్తెనని! ఇందులో అల్లరి నరేష్‌కి మరదలిగా నటించాను. మా ఇద్దరి మధ్య జరిగే హాస్య సన్నివేశాలు చిత్రానికే హైలైట్‌గా నిలుస్తాయి. ఇక తెలుగు భాష నాకు కొత్త కాదు.. మా కుటుంబం ముంబయిలోనే స్థిరపడినా.. మా పూర్వీకులు తెలుగు వారే! ఇంట్లో అప్పుడప్పుడూ తెలుగు కూడా మాట్లాడుకుంటాం. కాబట్టి భాష పరంగానూ నాకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. ఇక తెలుగులో నా అభిమాన నటుడు ఎవరంటే ది వన్‌ అండ్‌ ఓన్లీ బ్రహ్మానందం గారు అనే చెప్తా..’ అంటోందీ కామెడీ క్వీన్‌.

వీళ్లే కాదు.. బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ కూతురు ‘రాషా తడానీ’, అలనాటి నటి సల్మా ఆఘా కుమర్తె ‘జహ్రా ఎస్‌ ఖాన్‌’ కూడా టాలీవుడ్‌లో సినిమా అవకాశాల్ని అందుకున్నారు. రాషా రామ్‌ చరణ్‌ సరసన ఓ చిత్రానికి ఎంపిక కాగా, జహ్రా రోషన్‌కు జంటగా ఓ చారిత్రక చిత్రంలో యుద్ధకౌశలం తెలిసిన యువ రాణిగా కనిపించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్