అవని పేరిట అరుదైన ఘనత!

ఆకాశంలో యుద్ధ విమాన పైలట్లు చేసే అత్యంత సాహసోపేతమైన విన్యాసాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంటుంది. సాధారణంగా దేశవిదేశాల్లో జరిగే ఇలాంటి ఎయిర్‌ షోలలో ఎక్కువగా పురుషులే పాల్గొంటారు. ఇక మన దేశంలో నిర్వహించిన వైమానిక యుద్ధ విన్యాసాల్లో పలువురు మహిళలు....

Updated : 10 Jan 2023 18:33 IST

(Photos: Twitter)

ఆకాశంలో యుద్ధ విమాన పైలట్లు చేసే అత్యంత సాహసోపేతమైన విన్యాసాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంటుంది. సాధారణంగా దేశవిదేశాల్లో జరిగే ఇలాంటి ఎయిర్‌ షోలలో ఎక్కువగా పురుషులే పాల్గొంటారు. ఇక మన దేశంలో నిర్వహించిన వైమానిక యుద్ధ విన్యాసాల్లో పలువురు మహిళలు కూడా పాల్గొని సత్తా చాటారు. అయితే విదేశాల్లో జరగబోయే ఎయిర్‌ షోలో పాల్గొనే అరుదైన అవకాశాన్ని తొలిసారి చేజిక్కించుకుంది యువ ఫైటర్‌ పైలట్‌ అవనీ చతుర్వేది. భారత వైమానిక దళం తొలి దశ యుద్ధ విమాన పైలట్లుగా నియమించిన ముగ్గురు మహిళా పైలట్లలో అవని ఒకరు.. ఆ ముగ్గురిలో తనే పిన్న వయస్కురాలు కూడా! ఆర్మీ ఆఫీసర్‌ అయిన తన అన్నయ్య స్ఫూర్తితో వాయుసేనలోకి ప్రవేశించాలని కలలు కన్న ఆమె.. తన కలను సాకారం చేసుకోవడమే కాదు.. మిగ్‌-21 బైసన్‌, సుఖోయ్‌.. వంటి అత్యంత క్లిష్టమైన యుద్ధ విమానాలు నడిపి చరిత్ర సృష్టించింది. ఇక ఇప్పుడు జపాన్‌లో తొలిసారి జరగబోయే ‘వీర్‌ గార్డియన్‌ 2023’ విన్యాసాల్లో పాల్గొని మరో చరిత్రను తన పేరిట లిఖించుకునేందుకు సిద్ధపడిందీ డేరింగ్‌ పైలట్.

అవనితోనే ఆరంభం!

భారత్‌-జపాన్‌ సంయుక్తంగా ‘వీర్‌ గార్డియన్‌ 2023 ఎక్సర్‌సైజ్‌’ పేరుతో వైమానిక విన్యాసాలు నిర్వహించతలపెట్టాయి. ఇరు దేశాల మధ్య సైనిక సంబంధాల అభివృద్ధే లక్ష్యంగా అక్కడి Hyakuri ఎయిర్‌ బేస్‌లో జరగబోయే ఈ ఎయిర్‌ షో జనవరి 12-26 వరకు కొనసాగనుంది. ఇందులో భారత్‌ తరపున పాల్గొనే 150 మందితో కూడిన వైమానిక బృందంలో ఏకైక మహిళా యుద్ధ విమాన పైలట్‌ అవనీ చతుర్వేది కావడం విశేషం. ఇందులో భాగంగా సుఖోయ్‌-30MKI యుద్ధ విమానంతో విన్యాసాలు చేయనుందామె. ‘భారత్‌లో జరిగిన వైమానిక యుద్ధ విన్యాసాల్లో ఇప్పటికే పలువురు మహిళా యుద్ధ విమాన పైలట్లు పాల్గొన్నప్పటికీ.. విదేశాల్లో నిర్వహించే విన్యాసాల్లో మహిళలు భాగమవడం మాత్రం ఇదే తొలిసారి. ఈ అరుదైన ఘనత అవనీ చతుర్వేది సొంతం చేసుకున్నారు..’ అంటూ ఓ అధికారి వెల్లడించారు.

ఆ ముగ్గురిలో తనే పిన్న!

2016లో మహిళల్ని యుద్ధ విమాన పైలట్లుగా నియమించడం మొదలుపెట్టింది ఐఏఎఫ్. ఇలా తొలి దశలో అవనీ చతుర్వేది, భావనా కాంత్, మోహనా సింగ్‌లు మొదటి మహిళా యుద్ధ విమాన పైలట్లుగా ఎంపికయ్యారు. ఆ తర్వాత మూడు దశల్లో శిక్షణ పూర్తి చేసుకున్న ఈ సాహస వనితలు ఈ రంగంలోకి రావాలనుకునే ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ ముగ్గురిలో పిన్న వయస్కురాలైన అవని.. రష్యాకు చెందిన అత్యంత క్లిష్టమైన ‘మిగ్-21 బైసన్’ యుద్ధ విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే అత్యధిక ల్యాండింగ్, టేకాఫ్ స్పీడ్ (గంటకు 340 కిలోమీటర్లు) గల ఈ యుద్ధ విమానాన్ని గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్ నుంచి దాదాపు అరగంట పాటు నడిపింది అవని. దీంతో శత్రుసైన్యాల పైకి దూసుకెళ్లే యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిందీ ధీర. ప్రస్తుతం సుఖోయ్‌-30MKI యుద్ధ విమానానికి పైలట్‌గా కొనసాగుతోంది అవని.

అన్నయ్య స్ఫూర్తితో..!

అవనీ చతుర్వేది మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో 1993, అక్టోబర్ 27న జన్మించింది. నాన్న దిన్‌కర్ చతుర్వేది.. మధ్యప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖలో సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అమ్మ గృహిణి. అవని అన్నయ్య ఆర్మీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె పాఠశాల విద్యాభ్యాసమంతా అక్కడి షాడోల్ జిల్లాలోని డియోల్యాండ్ అనే చిన్న పట్టణంలో కొనసాగింది. రాజస్థాన్‌లోని బనస్థలి విశ్వవిద్యాలయంలో టెక్నాలజీ విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. ఆపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పరీక్ష రాసి అందులో ఉత్తీర్ణత సాధించింది.

ఆర్మీ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న తన అన్నయ్యను చూసి తానూ వాయుసేనలో ప్రవేశించాలన్న కోరిక కలిగిందంటోంది అవని. ఇక తన కలను సాకారం చేసుకునే క్రమంలోనే డిగ్రీ చదువుతున్నప్పుడు కళాశాలలోని ఫ్త్లెయింగ్ క్లబ్‌లో చేరింది. ఈ క్రమంలోనే రోజూ కొన్ని గంటల పాటు విమానయాన శిక్షణ తీసుకునేదామె. ఆ తర్వాత తన ఆకాంక్ష మేరకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరింది అవని. 2016లో యుద్ధ విమాన పైలట్‌గా ఎంపికైన తర్వాత హైదరాబాద్‌లోని దుండిగల్, హకీంపేట, బీదర్ ఎయిర్‌బేస్‌లలో శిక్షణ పొందిందామె. అవనికి చెస్, టేబుల్ టెన్నిస్ క్రీడలతో పాటు స్కెచింగ్, పెయింటింగ్ అంటే అమితాసక్తట!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్