Winter Fashion : అందాల తారల ‘స్వెటర్‌’ గేమ్‌!

చాలామంది స్వెటర్‌ను చలి నుంచి రక్షణ కల్పించే ఓ అవుట్‌ఫిట్‌గానే భావిస్తారు. కానీ ఈ వింటర్‌ వేర్‌ కూడా ఫ్యాషనబుల్‌గా ఉండాలనుకుంటున్నారు ఈతరం అమ్మాయిలు.

Updated : 30 Dec 2023 15:40 IST

(Photos: Instagram)

చాలామంది స్వెటర్‌ను చలి నుంచి రక్షణ కల్పించే ఓ అవుట్‌ఫిట్‌గానే భావిస్తారు. కానీ ఈ వింటర్‌ వేర్‌ కూడా ఫ్యాషనబుల్‌గా ఉండాలనుకుంటున్నారు ఈతరం అమ్మాయిలు. ఈ క్రమంలోనే కొనే ముందు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్టైలిష్‌ స్వెటర్లను జల్లెడ పడుతుంటారు. అలాంటి వారు ఒక్కసారి ఈ అందాల తారలు ధరించిన స్వెటర్లపై లుక్కేయాల్సిందే! చూడ్డానికి కలర్‌ఫుల్‌గా, వెచ్చదనాన్ని పంచేలా, స్టైలిష్‌గా ఉన్నాయి కదూ వీళ్ల స్వెటర్లు. ఇంకెందుకాలస్యం.. వాటి గురించి తెలుసుకుందామా మరి?!


‘టర్టల్‌ నెక్‌’తో ట్రెండీగా!

టర్టల్‌ నెక్‌ ఫ్యాషన్‌ మనకు కొత్త కాదు. ఈ తరహాలో రూపొందించిన టాప్స్‌, బాడీకాన్‌ డ్రస్సులు, పెప్లమ్‌ టాప్స్‌, క్రాప్‌టాప్స్‌.. వంటివన్నీ చాలామంది అమ్మాయిల వార్డ్‌రోబ్‌లో ఓ భాగమే! అయితే ఈ శీతాకాలంలో టర్టల్‌ నెక్‌ స్వెటర్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా ధరించిన స్వెటర్‌ అలాంటిదే! శరీర పైభాగంతో పాటు మెడను కూడా కవర్‌ చేసేలా ఉండే ఈ ట్రెండీ స్వెటర్‌ అదనపు వెచ్చదనాన్ని పంచుతుంది. దానికి తోడు స్టైలిష్‌ లుక్‌నూ అందిస్తుంది. లేత రంగుల నుంచి ముదురు రంగుల దాకా, రెండుమూడు రంగుల షేడ్స్‌లో రూపొందించిన టర్టల్‌ నెక్‌ స్వెటర్లు ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. ఎ-లైన్‌ స్కర్ట్స్‌, యాంకిల్‌ జీన్స్‌, ట్రౌజర్స్‌.. వంటివి దీనికి జతగా ధరిస్తే లుక్‌ అదిరిపోతుంది.


‘ఓవర్‌సైజ్‌డ్‌’ లుక్‌!

ఓవర్‌సైజ్‌డ్‌ ఫ్యాషన్‌ ఈతరం అమ్మాయిల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. పేరుకు తగినట్లుగానే.. మన శరీరాకృతికి రెట్టింపు వదులుగా ఉంటాయీ దుస్తులు. కాఫ్తాన్స్‌, షర్ట్స్‌, గౌన్స్‌, క్రాప్‌ టాప్స్‌.. ఇలా ఇవన్నీ ఓవర్‌సైజ్‌డ్‌ తరహాలో రూపొందించిన ఫ్యాషనబుల్‌ దుస్తులే! ఇప్పుడు ఇదే మోడల్‌లో డిజైన్‌ చేసిన స్వెటర్లూ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. కావాలంటే.. దీపికా పదుకొణె స్వెటర్‌పై ఓ లుక్కేయండి! మెడ దగ్గర్నుంచి.. స్లీవ్స్‌, నడుం దాకా పూర్తి వదులుగా ఉంటుందీ స్వెటర్‌. సాధారణంగా కొన్ని రకాల ఉన్నితో తయారు చేసిన స్వెటర్లు బిగుతుగా ఉంటే చర్మానికి గుచ్చుకుంటుంటాయి. ఓవర్‌సైజ్‌డ్‌ స్వెటర్‌తో ఈ సమస్య ఉండదు. పైగా కంఫర్టబుల్‌గానూ ఉంటుంది. ముఖ్యంగా గర్భిణులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందీ ట్రెండీ స్వెటర్‌.


‘కార్డిగన్‌’ స్టైల్‌!

కొంతమందికి మెడపై నుంచి ధరించే స్వెటర్లు సౌకర్యంగా అనిపించవు. అలాంటి వారు ‘కార్డిగన్‌’ స్టైల్‌ స్వెటర్‌ను ఎంచుకోవచ్చు. ముందువైపు బటన్స్‌/జిప్‌ ఉండేలా రూపొందించిన ఈ స్వెటర్‌ చాలా లైట్‌వెయిట్‌గా ఉంటుంది కూడా! అచ్చం కత్రినా కైఫ్‌ ధరించిన స్వెటర్‌ మాదిరిగా! అయితే వీటిలో కొన్నింటికి కాలర్‌ ఉంటుంది.. మరికొన్నింటికి ఉండదు. అంతేకాదు.. విభిన్న డిజైన్లలో అల్లి, ఫ్లోరల్‌/జామెట్రిక్‌ ప్రింట్స్‌తో హంగులద్దిన ఈ స్వెటర్లు ప్రత్యేకమైన లుక్‌ని అందిస్తాయి. వీటిని జీన్స్‌, స్కర్ట్స్‌, ట్రౌజర్స్‌, లాంగ్‌ ఫ్రాక్స్‌.. ఇలా వేటికైనా మ్యాచ్‌ చేసుకొని మెరిసిపోవచ్చు.


‘అల్లిక’ ప్రత్యేకతే వేరు!

అది వస్తువైనా, దుస్తులైనా మెషీన్‌తో కంటే చేత్తో రూపొందించినవి మరింత ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. ఉన్ని దారంతో అల్లిన స్వెటర్లూ ఇందుకు మినహాయింపు కాదు. వీటిలోనూ ముదురు రంగులతో, విభిన్న ప్రింట్లను దుస్తులపై అచ్చుగుద్దినట్లుగా ఆకర్షణీయమైన స్వెటర్లకు మార్కెట్లో కొదవలేదు. తమ అభిరుచులకు తగినట్లుగా కావాలనుకునే వారు వీటిని ప్రత్యేకంగా అల్లించుకోవచ్చు కూడా! అందాల ఆలియా కూడా తన అల్లిక స్వెటర్‌ తనకు బాగా నచ్చేసిందంటూ హార్ట్‌ సింబల్‌ జోడించింది. ఇక ఇలాంటి స్వెటర్లలోనూ తలపై నుంచి ధరించేవి, ఫ్రంట్‌ ఓపెన్‌ ఉన్నవి, బటన్స్‌/జిప్‌తో కూడుకున్నవి.. ఇలా విభిన్న మోడల్స్‌లో దొరుకుతున్నాయి. వీటి అల్లిక మధ్యలో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా గాలి ప్రసరణ కూడా జరుగుతుంది.. కాబట్టి అటు కంఫర్టబుల్‌గా ఉండచ్చు.. ఇటు వెచ్చదనం బ్యాలన్స్‌ అయ్యేలా జాగ్రత్తపడచ్చు.


‘పొడవాటి’ స్వెటర్‌!

శరీర పైభాగానికే పరిమితం కాకుండా.. మోకాళ్ల వరకు వెచ్చదనాన్ని పంచేలా లాంగ్‌ స్వెటర్స్‌ కూడా ప్రస్తుతం మార్కెట్లోకొచ్చాయి. బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా ధరించిన ఈ స్టైలిష్‌ స్వెటర్‌ ఇందుకు పర్‌ఫెక్ట్‌ ఉదాహరణ! హెవీ కాలర్‌తో చిన్నసైజు కుర్తీని పోలి ఉంటాయి ఈ తరహా స్వెటర్స్‌. నడుం వద్ద ఒక బటన్‌ లేదంటే కింది వరకు బటన్స్‌ ఉన్నవి కూడా దొరుకుతున్నాయి. ముదురు రంగులు, విభిన్న రకాల ప్రింట్స్‌లో రూపొందించిన ఈ తరహా స్వెటర్స్‌ అమ్మాయిలకు అందాన్నే కాదు.. సౌకర్యాన్నీ అందిస్తాయి.

వీటితో పాటు టీషర్ట్‌ తరహాలో రూపొందించినవి, మోచేతుల వరకే పరిమితమైనవి, ముదురు రంగుల్లో రూపొందించిన కలర్‌ఫుల్‌ స్వెటర్స్‌.. ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ట్రెండీగా, స్టైలిష్‌గా ఉండే ఈ విభిన్న రకాల స్వెటర్స్‌ అమ్మాయిలకు ఫ్యాషనబుల్‌ లుక్‌నీ అందిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్