Nikita Jaisinghani: చరణ్‌ను మెరిపించి..

అంతర్జాతీయ స్థాయి వేడుకల్లో తారలు అందుకునే అవార్డులకే కాదు.. వారు ధరించిన దుస్తులూ, వేసుకున్న నగలకూ అంతే ప్రాధాన్యం. అలా తాజాగా ఆస్కార్‌ వేడుకలో ‘నాటు నాటు’ పాటతో పాటూ మన సెలబ్రిటీల ఆహార్యమూ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Published : 15 Mar 2023 00:01 IST

అంతర్జాతీయ స్థాయి వేడుకల్లో తారలు అందుకునే అవార్డులకే కాదు.. వారు ధరించిన దుస్తులూ, వేసుకున్న నగలకూ అంతే ప్రాధాన్యం. అలా తాజాగా ఆస్కార్‌ వేడుకలో ‘నాటు నాటు’ పాటతో పాటూ మన సెలబ్రిటీల ఆహార్యమూ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ వేడుకకి హాజరైన ‘రామ్‌చరణ్‌’ తన డ్రెస్సింగ్‌తో ‘వానిటీ ఫెయిర్‌ బెస్ట్‌ డ్రెస్డ్‌ లుక్‌’లో స్థానం సంపాదించుకున్నారు. నిఖిల్‌ అండ్‌ శంతనూ రూపొందించిన దుస్తుల్ని చరణ్‌ ధరించగా...నిఖిత జై సింఘానీ
స్టైలిస్ట్‌గా పనిచేశారు. ‘భారతీయ సంస్కృతితో పాటూ చరణ్‌ పాత్ర, వ్యక్తిత్వం ప్రతిబింబించేలా లుక్‌ని సిద్ధం చేశాం. త్రీపీస్‌ వెల్వెట్‌ బంద్‌గలా, స్టేట్‌మెంట్‌ బటన్‌లూ, మెడాలియన్‌ని గుర్తు తెచ్చే బ్రూచ్‌తో పోరాట యోధుడిని గుర్తు చేయాలనుకున్నాం’ అంటారామె. నిఖిత జై సింఘానీ సెలబ్రిటీ స్టైలిస్ట్‌. ముంబయిలో పుట్టిపెరిగిన ఆమె డిగ్రీ, మ్యాక్‌ (ఎమ్‌ఏఏసీ) సంస్థ నుంచి యానిమేషన్‌ కోర్సు పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచీ ఫ్యాషన్‌ రంగంపై ఆసక్తి పెంచుకున్న నిఖిత...తండ్రి కాదన్నా తనకు నచ్చిన దారిలోనే నడిచారు.

బాలీవుడ్‌ సినిమా ‘మేరీ బ్రదర్‌కి దుల్హాన్‌’కి అసిస్టెంట్‌ స్టైలిస్ట్‌గా పనిచేశారు. తర్వాత కరణ్‌ జోహార్‌కి స్టైలింగ్‌ చేసే ‘షిరాజ్‌ సిద్ధిఖీ’ దగ్గర సహాయకురాలిగా చేరారు. అక్కడ నిఖిత ప్రతిభ గుర్తించిన కరణ్‌ స్వతంత్రంగా పనిచేసే అవకాశాన్ని కల్పించారు. అలా ‘కాఫీ విత్‌ కరణ్‌’ సీజన్‌ 5, 6లకు పనిచేశారామె. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆయనతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మరోపక్క అభిషేక్‌ బచ్చన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, వరుణ్‌ధావన్‌, సిద్దార్థ్ద్‌ మల్హోత్రా, అర్జున్‌ కపూర్‌, కార్తిక్‌ ఆర్యన్‌, హార్దిక్‌ పాండ్యా వంటి సెలబ్రిటీలెందరికో పనిచేశారు నిఖిత. లాస్‌ఏంజెల్స్‌కి చెందిన ప్రేరణ శ్రీకంఠప్ప అసిస్టెంట్‌ స్టైలిస్ట్‌గా మొన్న గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డు వేడుకలోనూ, నిన్న ఆస్కార్‌ సంబరంలోనూ రామ్‌చరణ్‌ని మెరిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్