ఒత్తిడి, ఆందోళనల్ని దూరం చేస్తాయివి!

వృత్తి ఉద్యోగాలు, జీవనశైలి మార్పుల వల్ల ఈ రోజుల్లో చాలామంది వివిధ రకాల మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అందులోనూ పురుషుల కంటే మహిళలే ఎక్కువగా యాంగ్జైటీ, డిప్రెషన్‌ లాంటి మానసిక సమస్యల బారిన పడుతున్నారని పలు అధ్యయనాలు....

Updated : 30 Jul 2022 19:33 IST

వృత్తి ఉద్యోగాలు, జీవనశైలి మార్పుల వల్ల ఈ రోజుల్లో చాలామంది వివిధ రకాల మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అందులోనూ పురుషుల కంటే మహిళలే ఎక్కువగా యాంగ్జైటీ, డిప్రెషన్‌ లాంటి మానసిక సమస్యల బారిన పడుతున్నారని పలు అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి. తక్షణమే వీటి నుంచి బయటపడకపోతే దీర్ఘకాలంలో ఇతర అనారోగ్యాలకూ గురయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

యాంగ్జైటీ, మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో ఎక్కువ మొత్తంలో కార్టిసాల్‌ హార్మోన్‌ విడుదలవుతుంది. దీనివల్ల ఆకలి పెరగడం, అధిక బరువు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రావచ్చు. అలా జరగకుండా ఉండాలంటే ఈ మానసిక సమస్యలకు ప్రారంభంలోనే చెక్‌ పెట్టాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో భాగంగా రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటంటే..!

విటమిన్‌-డి

విటమిన్‌-డి లోపం వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలు అధికంగా వచ్చే అవకాశముందని ఓ అధ్యయనంలో తేలింది. కాబట్టి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడినంత విటమిన్‌-డి పొందడం ఎంతో అవసరం. ఇందుకోసం పాలు, పెరుగు, చేపలు, గుడ్డులోని పచ్చసొన, పుట్టగొడుగులు, మాంసం, చిలగడదుంప, అవకాడో... వంటి పదార్థాల్ని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ‘బి’, ‘సి’ విటమిన్లు అధికంగా లభించే పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి శరీరంలో కార్టిసాల్‌ స్థాయులను తగ్గించి యాంగ్జైటీ, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు

మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు చర్మం, కురుల సంరక్షణలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఈ పోషకాలు పుష్కలంగా ఉండే చేపలను అధికంగా తీసుకోవాలంటారు పోషకాహార నిపుణులు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు యాంగ్జైటీ, ఒత్తిడి లాంటి సమస్యలను కూడా తగ్గిస్తాయట! ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో పాటు కొన్ని రకాల ఆమ్లాలు శరీరంలో కార్టిసాల్‌ ఉత్పత్తిని నియంత్రిస్తాయి. కాబట్టి సీ-ఫుడ్‌ని ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక మీరు వెజిటేరియన్‌ లేదా వీగన్‌ అయితే వాల్‌నట్స్, గుమ్మడికాయ గింజలు, సబ్జా గింజలు, అవిసె గింజలను చేర్చుకోవడం మేలు.

పసుపు

సహజమైన యాంటీ బయాటిక్‌గా పనిచేసే పసుపులో కర్క్యుమిన్‌ అనే రసాయన పదార్థం అధికంగా ఉంటుంది. ఇది యాంగ్జైటీ తీవ్రతను బాగా తగ్గిస్తుంది. దీంతో పాటు అల్జీమర్స్‌, పార్కిన్సన్‌, డిప్రెషన్‌ల తీవ్రతను తగ్గించడంలోనూ పసుపు ప్రభావవంతంగా పని చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ఇవి వద్దు!

కొంతమంది బరువు తగ్గేందుకు ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్ ఎక్కువగా వాడుతుంటారు. అయితే చక్కెరతో పాటు కొవ్వుల శాతం అధికంగా ఉండే వీటిని వాడడం మానసిక ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇవి శరీరంలో డోపమైన్‌, సెరటోనిన్‌.. వంటి హ్యాపీ హార్మోన్ల ఉత్పత్తిని అడ్డుకుంటాయి. ఫలితంగా యాంగ్జైటీ, ఒత్తిడి, డిప్రెషన్‌ లాంటి సమస్యలు అధికమవుతాయి.

గ్లూటెన్‌ను తగ్గించాల్సిందే!

పలు జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమయ్యే గ్లూటెన్‌ మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే గ్లూటెన్‌ అధికంగా ఉండే బీర్‌, బ్రెడ్‌, గోధుమలు, పాస్తా, బిస్కెట్లు, చాక్లెట్లు, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. వీటికి బదులు ఓట్స్‌, రాగులు, చిరుధాన్యాలు.. వంటివి ఆహారంలో భాగం చేసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.

కీటో డైట్‌...

త్వరగా బరువు తగ్గేందుకు ప్రస్తుతం చాలామంది కీటో డైట్‌ను ఫాలో అవుతున్నారు. అయితే యాంగ్జైటీతో పాటు డిప్రెషన్‌, పార్కిన్సన్, ADHD (అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌) వంటి మానసిక సమస్యలకు కూడా కీటో డైట్‌ మంచిదని నిపుణులు చెబుతున్నారు. చేపలు, మాంసం, కూరగాయల ద్వారా అతి తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు తీసుకుని బరువు తగ్గడమే ఈ కీటోడైట్‌ విధానం. అయితే షుగర్, కిడ్నీ సంబంధిత సమస్యలున్న వారు ఈ డైట్‌ను పాటించే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

వీటితో పాటు ఐరన్‌, మెగ్నీషియం, ప్రొటీన్లు, క్యాల్షియం, సెలీనియం, విటమిన్-ఇ పోషకాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూడా వివిధ రకాల మానసిక సమస్యలకు విరుగుడుగా పనిచేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్