అమ్మ ఆలోచన.. రూ.వేల కోట్ల సంస్థైంది

పిల్లల భవిష్యత్తు కోసమని శక్తికి మించి ఫీజులు కడతారు తల్లిదండ్రులు. అలా కట్టలేని వారి పరిస్థితేంటి? పోనీ.. స్కూళ్లలో నేర్పించే నైపుణ్యాలు వాళ్లకు జీవితంలో ఉపయోగపడుతున్నాయా? ఈ ప్రశ్నలే మెదిలాయి స్మిత మనసులో! అమ్మగా తన పిల్లల భవిష్యత్తు కోసం మొదలైన మథనం.. ఎడ్‌టెక్‌ సంస్థను రూపొందించేలా చేసింది.

Updated : 24 Dec 2022 07:04 IST

పిల్లల భవిష్యత్తు కోసమని శక్తికి మించి ఫీజులు కడతారు తల్లిదండ్రులు. అలా కట్టలేని వారి పరిస్థితేంటి? పోనీ.. స్కూళ్లలో నేర్పించే నైపుణ్యాలు వాళ్లకు జీవితంలో ఉపయోగపడుతున్నాయా? ఈ ప్రశ్నలే మెదిలాయి స్మిత మనసులో! అమ్మగా తన పిల్లల భవిష్యత్తు కోసం మొదలైన మథనం.. ఎడ్‌టెక్‌ సంస్థను రూపొందించేలా చేసింది. లక్షలమంది విద్యార్థులను అభివృద్ధి దిశగా నడిపిస్తోన్న ఆవిడ ప్రయాణమిది!

‘మా పనావిడ రేయింబవళ్లూ కష్టపడిన మొత్తాన్ని ఫీజులకే ధారపోస్తుంది. అయినా వాళ్ల చదువుపై ఆమెకు బెంగే! నా పరిస్థితీ అంతే. నా ఇద్దరు పిల్లలు.. సంప్రదాయ బోధనతో సరిగా నేర్చుకోగలరా అనిపించింది. భారీగా ఫీజుల్ని కట్టీ ట్యూషన్లకు పంపేవారూ ఎక్కువే. ఇవన్నీ చూశాక భయమేసింది. ఇలా కాదని.. నేనే సులభ పద్ధతులను వెతికి మా పాపకి నేర్పించడం మొదలుపెట్టా. మూడేళ్లు నిండేనాటికే ఎన్ని నేర్చేసుకుందో. అది చూశాక ఇతర పిల్లలకూ సాయపడాలనుకున్నా’ అంటారు స్మిత దియోరా. ఈమెది ముంబయి. ఛార్టెడ్‌ అకౌంటెంట్‌గా ఎనిమిదేళ్ల అనుభవం. సింగపూర్‌లో ప్రముఖ సంస్థల్లో పనిచేసి, 2010లో దేశానికి తిరిగొచ్చారు.

‘మొదట స్థానిక అంగన్‌వాడీలకి వెళ్లా. అక్కడ చాలామంది టీచర్లకు సరైన శిక్షణ లేదు. ఇక పిల్లలెలా నేర్చుకుంటారు? ‘స్పర్శ్‌’ పేరుతో ఎన్‌జీఓ ప్రారంభించా. దాని ద్వారా ప్రత్యేక కరిక్యులమ్‌ తయారీతో పాటు అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణిచ్చా. ఫలితం బాగుండటంతో మరో 16 కేంద్రాల్లోనూ మార్పు తెచ్చా. అదిచ్చిన నమ్మకంతో మావారు సుమీత్‌ మెహతాతో కలిసి 2012లో గుజరాత్‌లోని ఓ పల్లెలో ‘లీడ్‌ స్కూల్‌’ ప్రారంభించా. మొదటిరోజు 14 మంది విద్యార్థులొచ్చారు. ఆ రోజును మర్చిపోలేను. నన్ను నేనింకా మెరుగుపరచుకోవాలి అనుకున్నా. హార్వర్డ్‌ నుంచి కొన్ని కోర్సులు చేశా. దేశంలోని ప్రముఖ స్కూళ్లు, ఫిన్‌లాండ్‌, సింగపూర్‌ వంటి దేశాల్లో బోధన పద్ధతులను గమనించాం. వాటి ఆధారంగా కరిక్యులమ్‌లో మార్పులూ చేశాం. బోధనలో సాంకేతికతనూ జొప్పించాం. ఇక్కడా విజయం సాధించడంతో మహారాష్ట్రలోని చిన్న పట్టణాల్లో మరిన్ని స్కూళ్లను ప్రారంభించాం. అప్పుడే ఇలా ఎన్ని స్కూళ్లను ప్రారంభించగలమన్న సందేహమొచ్చింది. ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య కల ఇలా సాధ్యం కాదనిపించింది. దీంతో ప్రైవేటు స్కూళ్లతో టైఅప్‌ చేసుకోవడం ప్రారంభించా’మంటారు స్మిత.

‘‘లీడ్‌’ పేరుతో నామమాత్రపు ఫీజులు తీసుకునే స్కూళ్లకు ప్రాధాన్యమిచ్చాం. ఉపాధ్యాయులకు సులభ బోధన పద్ధతుల శిక్షణ దగ్గర్నుంచి పాఠశాలలకు అవసరమైన కరిక్యులమ్‌, సాఫ్ట్‌వేర్లు, పరీక్ష పత్రాలు, సాధన పుస్తకాలు వంటివన్నీ అందిస్తాం. ఆనందంగా, భవిష్యత్‌కు సాయపడే అంశాలు నేర్పించడం మా ప్రాధాన్యం. అది నచ్చి 400కుపైగా పట్టణాల్లోని 3వేలకు పైగా స్కూళ్లు మాతో పనిచేస్తున్నాయి. 25వేలకు పైగా ఉపాధ్యాయులు శిక్షణ తీసుకున్నారు. 12 లక్షలమంది విద్యార్థులకు చేరువయ్యాం. ఎంతోమంది మమ్మల్ని నమ్మి పెట్టుబడులూ పెట్టారు. ఈ ఏడాది యూనికార్న్‌ హోదానీ (రూ.8300కోట్లు) అందుకున్నాం. అలాగని కుటుంబాన్ని అశ్రద్ధ చేయలేదు. నా పిల్లలు, ‘లీడ్‌’ బాధ్యత రెంటినీ సమానంగానే చూశా. ఉదయం, సాయంత్రాలు కుటుంబానికి, మధ్యలో లీడ్‌ పని’ అని నవ్వేస్తారామె. ఈ ఏడాది ఫోర్బ్స్‌ సెల్ఫ్‌మేడ్‌ విమెన్‌ జాబితాలో చోటు దక్కించుకున్న స్మిత ‘పవర్‌ ఆఫ్‌ విమెన్‌ అవార్డు-22’ సహా ఎన్నో అవార్డులూ అందుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసీ పనిచేస్తున్నారు. రానున్న మూడేళ్లలో తమ సేవలను 26 కోట్ల మంది విద్యార్థులకు చేరువ చేయడమే లక్ష్యమంటున్నారు.


‘మన ప్రతి విజయానికీ వెనక కుటుంబం, భర్త ఎవరో ఒకరు తోడుంటే ఉత్సాహంగా, ధైర్యంగా ముందడుగు వేయగలం. దాన్ని సంపాదించండి. అందుకు అవసరమైన నమ్మకాన్ని కలిగించండి. ముందు మీపై మీకు నమ్మకం ఏర్పడినప్పుడే ఇవన్నీ సాధ్యం. దాన్ని పెంచుకోండి.. గెలుపు ఖాయం’


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్