బతికితే... ఆలోచిద్దామన్నారు

‘ఆమె ఒక పనికి రాని వస్తువు లాంటిదే!’ అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని ఈ మాటంటే తట్టుకోలేకపోయారామె. మళ్లీ ఈ లోకంలోకి తీసుకురావడానికి ప్రయత్నించి కొంత విజయం సాధించారు. ఆ ఆనందాన్ని అనుభవించే లోపు క్యాన్సర్‌! అప్పుడూ బిడ్డ బెంగే ఆవిడకు. ఈసారి తన కూతురే కాదు.. మానసికంగా ఎదగని ఎంతోమంది పిల్లల గురించి ఆలోచించారు.

Updated : 21 Mar 2023 03:39 IST

‘ఆమె ఒక పనికి రాని వస్తువు లాంటిదే!’ అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని ఈ మాటంటే తట్టుకోలేకపోయారామె. మళ్లీ ఈ లోకంలోకి తీసుకురావడానికి ప్రయత్నించి కొంత విజయం సాధించారు. ఆ ఆనందాన్ని అనుభవించే లోపు క్యాన్సర్‌! అప్పుడూ బిడ్డ బెంగే ఆవిడకు. ఈసారి తన కూతురే కాదు.. మానసికంగా ఎదగని ఎంతోమంది పిల్లల గురించి ఆలోచించారు. తన సంస్థ ద్వారా వారికో దారి చూపిస్తున్నారు.. డాక్టర్‌ తాడేపల్లి కృష్ణకుమారి.

రిస్థితులు ఎదురు తిరగడం అంటారు కదా! నా జీవితంలో ప్రతి దశా అలాంటిదే. మాది విజయవాడ. అల్లారు ముద్దుగా పెరిగా. ఎంబీబీఎస్‌ చేద్దామంటే కుదర్లేదు. దీంతో ఆయుర్వేద డాక్టర్‌నయ్యా. చదువు మధ్యలోనే పెళ్లైంది. ప్రాక్టీసు మొదలుపెట్టిన కొన్నాళ్లకు మహతి పుట్టింది. నాకు సంగీతంలో ప్రవేశముంది. దీంతో పాపకి ఆరేళ్లకే వీణ వాయించడం నేర్పించా. వేదికపై నాతోపాటు ప్రదర్శనలిస్తోంటే పొంగిపోయేదాన్ని. కాలానికి కన్నుకుట్టిందేమో.. పాపకు వైరల్‌ మెనిన్‌జైటిస్‌ వచ్చి కోమాలోకి వెళ్లిపోయింది. 40 రోజులగ్గాన్నీ కళ్లు తెరవలేదు. ఆనందించేలోపే ‘ప్రాణముందంతే! జీవితాంతం మాట్లాడలేదు, తన పనులూ చేసుకోలేద’న్నారు. బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ‘తనో పనికిరాని వస్తువు లాంటిదే! వదిలెయ్‌’ అంటోంటే బాధేసేది. అమ్మని కదా! అలా వదిలేయలేకపోయా. ఆయుర్వేద వైద్యం ప్రారంభించా. మూడేళ్లకు చిన్నగా మాటలు, నడక వచ్చాయి. నా ఆనందానికి అవధుల్లేవు.

నేను లేకపోతే...

పాప పరిస్థితి మెరుగుపడింది కానీ ఎవరోకరి సాయం తప్పనిసరి. నా తర్వాత తనని చూసుకునేదెవరన్న ప్రశ్న తొలిచేసేది. అందుకే ఇంకో బిడ్డని కనాలనుకున్నా. ఆరు అబార్షన్ల తర్వాత బాబు పుట్టాడు. హమ్మయ్య అనుకునేలోపే.. నాకు క్యాన్సరని తేలింది. ఆసుపత్రిలో ఉన్నా పాప బెంగే! అత్తింటి వాళ్ల సాయమూ లేదు. ఏదైనా హోమ్‌లో చేర్పిద్దామని వెతికినా ప్రయోజనం లేదు. ఒకవైపు కీమోలు, చికిత్స. మరోవైపు పిల్లలు. వాళ్ల కోసమైనా బతకాలని దృఢంగా నిశ్చయించుకున్నా. అప్పుడే మానసికంగా ఎదగని పిల్లల కోసం ఏదైనా చేయాలనిపించింది. ఓ సంస్థని ప్రారంభిస్తానని మా డాక్టర్‌కి చెబితే ‘ముందు నువ్వు బతికితే తర్వాత ఆలోచిద్దాంలే’ అన్నారు. మొత్తానికి బతికా. ఇక ఆలోచనను ఆచరణలో పెట్టాలనుకున్నా. పాప భవిష్యత్తు కోసమని బంగారం రూపంలో కొంత కూడబెట్టా. అది అమ్మేసి 2008లో ‘చేయూత’ ప్రారంభించా.

నాలుగు పీజీలు!

డాక్టర్ని, చాలామంది స్నేహితులున్నారు. సంస్థ నడపడం సులువే అనుకున్నా. కానీ ఒక్కరూ ముందుకు రాలేదు. దీనికితోడు ‘ఇవన్నీ అవసరమా వదిలేయ’మన్న సలహాలు, ఎదురుదెబ్బలు. మా కృషితో పిల్లల్లో మార్పు వస్తోంటే ఆపేయాలనిపించలేదు. మొండిగా కొనసాగించా. వీళ్ల పరిస్థితిపై అవగాహనకు నాలుగు పీజీలు చేశా. వెయ్యి మంది వరకూ మానసిక దివ్యాంగుల్లో మార్పునకు కారణమయ్యా. ప్రస్తుతం ఎనభై మంది ఉన్నారు. ప్రతి ఆరుగురు పిల్లలకు ఒక టీచర్‌ని పెట్టా. వాళ్ల సమస్య బట్టి చికిత్స ప్లాన్‌ చేస్తాం. వివిధ ప్రాంతాలు, పార్కులకు తీసుకెళ్లి సమాజాన్ని పరిచయం చేస్తాం. దూరవిద్యలో పరీక్షలూ రాయిస్తున్నాం. నయమయ్యాక ఉపాధి అవకాశాలనూ చూపిస్తున్నాం. ఒకప్పుడు సొంత పనులు చేసుకోవడమే తెలియని వారు వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడుతోంటే ఆ ఆనందం చెప్పలేను. కరోనాలో నాకు మూల స్తంభాల్లాంటి మావారు, అమ్మ చనిపోయారు. అయినా సేవలు కొనసాగిస్తున్నా. మానసిక వికలాంగుల చట్టాలు, హక్కుల కోసం పోరాడుతున్నా. డౌన్‌ సిండ్రోమ్‌, ఇతర ఎదుగుదల సమస్యలపై అవగాహన కార్యక్రమాలనీ నిర్వహిస్తోన్నా. నాలా ఇంకో తల్లి బాధ పడొద్దన్న ఆశతోనే ఇదంతా!

-బోడశింగి సూరినాయుడు, విజయవాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్