అనుకోని అవకాశం.. తలరాతను మార్చేసింది!

‘ఒక్క ఛాన్స్‌’ అంటూ సినిమా స్టూడియోల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే వారిని చాలామందిని చూస్తుంటాం. అలాంటిది అనుకోకుండా సినిమాల్లో నటించే అవకాశమొస్తే? నక్క తోక తొక్కొచ్చారేమో? అనుకుంటాం. బాలీవుడ్‌ నటి ఛాయా కదమ్‌నూ ఇలాంటి అదృష్టమే వరించింది. అదీ.. లేటు వయసులో!

Published : 22 May 2024 12:45 IST

(Photos : Instagram)

‘ఒక్క ఛాన్స్‌’ అంటూ సినిమా స్టూడియోల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే వారిని చాలామందిని చూస్తుంటాం. అలాంటిది అనుకోకుండా సినిమాల్లో నటించే అవకాశమొస్తే? నక్క తోక తొక్కొచ్చారేమో? అనుకుంటాం. బాలీవుడ్‌ నటి ఛాయా కదమ్‌నూ ఇలాంటి అదృష్టమే వరించింది. అదీ.. లేటు వయసులో! అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. కేన్స్‌ వంటి ప్రతిష్టాత్మక చిత్రోత్సవం నుంచి ఆహ్వానాన్నీ అందుకుంది. మరాఠీ సంప్రదాయ దుస్తుల్లో, భారతీయత ఉట్టిపడేలా తాజాగా రెడ్‌కార్పెట్‌పై మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

‘మంజూ మాయి’గా గుర్తింపు!
ఎక్కువగా మరాఠీ చిత్రాల్లో, అడపాదడపా హిందీ సినిమాల్లో నటించిన ఛాయకు ఈ ఏడాది బాగా కలిసొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఆమె నటించిన ‘Laapataa Ladies’  సినిమా ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఇందులో ‘మంజూ మాయి’ అనే ఓ ధైర్యవంతమైన టీ అమ్మే మహిళ పాత్రలో ఆకట్టుకుందామె. ఆ తర్వాత విడుదలైన ‘Madgaon Express’ కూడా ఆమెకు మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఆమెకు ప్రతిష్టాత్మక చలనచిత్రోత్సవం కేన్స్‌లో పాల్గొనే అరుదైన అవకాశం దక్కింది. ఇందుకు కారణం.. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న ‘All We Imagine As Light’ అనే మలయాళ/హిందీ చిత్రం కేన్స్‌లో పోటీపడుతుండడమే! తద్వారా గత 30 ఏళ్లలో కేన్స్‌ వేదికపై ముఖ్య కేటగిరీలో పోటీపడుతోన్న తొలి భారతీయ చిత్రంగా ఇది గుర్తింపు పొందడం విశేషం!

అమ్మ చీరలో మెరిసింది!
కేన్స్‌ చిత్రోత్సవంలో అందాల తారలు తమ ఫ్యాషనబుల్‌ దుస్తులతో సందడి చేస్తుంటారు. తొలిసారి ఈ వేడుకలో పాల్గొన్న ఛాయ కూడా తనదైన రీతిలో రెడ్‌కార్పెట్‌పై మెరిసిపోయింది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా, నిండుదనం తొణికిసలాడేలా చీరకట్టులో దర్శనమిచ్చిందామె. ఇలా తన కేన్స్‌ లుక్‌ కోసం తన తల్లి చీరను ఎంచుకుందామె. గోల్డెన్‌ జరీతో కూడిన క్రీమ్‌ కలర్‌ చీరకు మెజెంటా పింక్‌ కలర్‌ బనారసీ బ్లౌజ్‌ను జత చేసిన ఛాయ.. బన్‌ హెయిర్‌స్టైల్‌, భారీ ఇయర్‌రింగ్స్‌, సింపుల్‌ మేకప్‌తో వన్నెలద్దింది. అంతేకాదు.. మరాఠీ మహిళలు సంప్రదాయబద్ధంగా ధరించే నత్‌ ముక్కుపుడకతో ఆమె తన లుక్‌ని పూర్తిచేసింది. ఇలా భారతీయత ఉట్టిపడేలా ఉన్న ఆమె ట్రెడిషనల్‌ లుక్స్‌కి విదేశీయులూ ఫిదా అయిపోయారు. తన రెడ్‌కార్పెట్‌ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకోగా.. అవి వైరల్‌గా మారాయి. ‘విదేశీ గడ్డపై భారతీయతను చాటారు.. గర్వంగా ఉంది’ అంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

కలలో కూడా అనుకోలేదు!
కేన్స్‌ చిత్రోత్సవంలో పాల్గొనే అవకాశం రావడం, వాళ్లు నటించే చిత్రాలు ఈ వేదికపై పోటీపడడం/ప్రదర్శితమవడమంటే గొప్పగా భావిస్తుంటారు నటీనటులు. అలాంటిది కేన్స్‌లో పాల్గొనే అవకాశం వస్తుందని తాను కలలో కూడా అనుకోలేదంటున్నారు ఛాయ.
‘ప్రస్తుతం నేనెంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఇది నా జీవితంలోనే అత్యద్భుతమైన క్షణం! అందుకే మరో ఆలోచన లేకుండా ఈ సమయాన్ని ఆస్వాదిస్తున్నా. కేన్స్‌లో పాల్గొనే అవకాశం వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. నిజానికి అది నా బకెట్‌ లిస్ట్‌లో కూడా లేదు. అయినా నా సినిమాలకు ప్రేక్షకాదరణ దక్కడంతో వారే నన్ను ఇక్కడిదాకా నడిపించారేమో అనిపిస్తోంది. సినిమాల్లోకి వచ్చాక జాతీయ పురస్కారం అందుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా.. అంతకంటే ముందే కేన్స్‌ అవకాశం నన్ను వరించింది. ఇక మా అమ్మ చీర, ముక్కుపుడక ధరించి ఈ అంతర్జాతీయ వేదిక పైకి రావడం మర్చిపోలేని అనుభూతి. భౌతికంగా నువ్వు నాతో లేకపోయినా.. వీటి రూపంలో నువ్వు నా వెంటే ఉన్నావనిపిస్తోంది. లవ్యూ మామ్‌!’ అంటూ ఎమోషనల్‌ అయింది ఛాయ.

జీవితాన్ని మార్చిన ‘వర్క్‌షాప్‌’!
ఒక్కోసారి అనుకోకుండా అదృష్టం తలుపు తట్టినప్పుడు.. దాన్ని వెంటనే ఆహ్వానించినట్లయితే మన తలరాతలు మారిపోతాయి. ఛాయ జీవితమే ఇందుకు ఉదాహరణ! ముంబయిలోని కలీనా అనే ప్రాంతంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిపెరిగిన ఆమె.. కబడ్డీ క్రీడలో రాణించాలని కలలు కంది. రాష్ట్రస్థాయిలో పోటీపడుతూ పలు పతకాలూ నెగ్గిన ఆమె.. పెరిగి పెద్దయ్యే క్రమంలో ఓ జిమ్‌ సెంటర్‌నూ ప్రారంభించాలనుకుంది. మరోవైపు తన దృఢమైన శరీరాకృతితో పోలీస్‌ ఉద్యోగంలోనూ చేరాలనుకుంది. ఇలా విభిన్న లక్ష్యాల్ని నిర్దేశించుకున్న తనకు అనుకోకుండా సినిమాల్లో ఛాన్స్‌ వచ్చిందంటోందామె.
‘చాలామంది స్కూళ్లు, కాలేజీల్లో చదువుకొనేటప్పుడే.. భవిష్యత్తులో తాము సినిమాల్లోకి రావాలని కలలు కంటారు. కానీ నా లక్ష్యం ఇది కాకపోయినా.. సినిమాల్లో నాకు అనుకోకుండా ఛాన్స్‌ వచ్చింది. 2001లో ప్రముఖ రంగస్థల నటుడు, నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా మాజీ డైరెక్టర్‌ వామన్‌ నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్నా.. అదే నాకు సినిమాల పట్ల ఆసక్తిని పెంచింది. నా జీవిత గమ్యాన్నే మార్చేసింది. అప్పటికీ తొలి సినిమా అవకాశం కోసం ఆరేళ్లు ఎదురుచూడక తప్పలేదు. అలా లేటు వయసులో సినిమా కెరీర్‌ ప్రారంభించా. అయినా నాకొచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ, విభిన్న పాత్రల్లో నటిస్తూ, పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నా.. ఇవే నాకు నటిగా సంతోషాన్ని, సంతృప్తిని అందిస్తున్నాయి..’ అంటున్నారు ఛాయ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్