వాటి గురించి మీకూ ఇలాంటి అపోహలున్నాయా?

నాజూగ్గా ఉండాలనుకునే వారు వివిధ రకాల ఆహార నియమాలను పాటిస్తుంటారు. తక్కువగా తినడమో లేక పూర్తిగా నోరు కట్టేసుకోవడమో చేస్తుంటారు. మరికొందరు ఫ్యాట్, డైటింగ్ అంటూ శరీరానికి అవసరమైన ఆహార పదార్థాలను కూడా పూర్తిగా దూరం పెడుతుంటారు. ఫలితంగా అనవసరంగా అనారోగ్య సమస్యలను....

Published : 30 Oct 2022 12:50 IST

నాజూగ్గా ఉండాలనుకునే వారు వివిధ రకాల ఆహార నియమాలను పాటిస్తుంటారు. తక్కువగా తినడమో లేక పూర్తిగా నోరు కట్టేసుకోవడమో చేస్తుంటారు. మరికొందరు ఫ్యాట్, డైటింగ్ అంటూ శరీరానికి అవసరమైన ఆహార పదార్థాలను కూడా పూర్తిగా దూరం పెడుతుంటారు. ఫలితంగా అనవసరంగా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటుంటారు. వివిధ ఆహార పదార్థాలపై ఉన్న అపోహలే దీనికి ప్రధాన కారణం.

శరీరానికి కొవ్వులు కూడా కావాలి!

కొవ్వు పదార్థాలనగానే ఆమడదూరం పోతుంటారు చాలామంది. వాటిని తింటే ఎక్కడ లావైపోతామోనని వాళ్ల భయం. కానీ శరీరానికి కొవ్వులు కూడా చాలా అవసరమంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ క్రమంలో శరీరానికి అవసరమైన కొన్ని ఆహార పదార్థాలు, వాటిపై ఉండే కొన్ని అపోహలు.. వాస్తవాల గురించి తెలుసుకుందాం రండి.

అపోహ: గుడ్డులోని పచ్చసొన ఆరోగ్యానికి హానికరం

వాస్తవం: గుడ్డు పచ్చ సొనలో విటమిన్లు- A,D,E,K, B 12తో పాటు ఫోలేట్‌, ఐరన్, రిబోఫ్లేవిన్ తదితర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఒక పెద్ద గుడ్డులో సుమారు 185 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్‌ ఉంటుంది. ఇవన్నీ పచ్చ సొనలోనే ఉంటాయి. అయితే బ్లడ్‌ కొలెస్ట్రాల్‌కు ఈ డైటరీ కొవ్వులు ఏ మాత్రం ప్రధాన కారణం కాదు.

అపోహ: పాలు, పాల సంబంధిత పదార్థాలు తింటే ఇన్‌ఫ్లమేషన్‌ సమస్యలు కలుగుతాయి.

వాస్తవం: పాలల్లో క్యాల్షియం, విటమిన్‌-డి, వివిధ రకాల కొవ్వులు, ప్రొటీన్లు, ఇతర సమ్మేళనాలు ఉంటాయి. అయితే ఈ పోషకాల నిష్పత్తి ఒక్కో ఆహార పదార్థంలో ఒక్కోలా ఉంటుంది. ఆ మేరకు అవసరాన్ని బట్టి పాలు, పాల పదార్థాలను తీసుకుంటే శరీరానికి ప్రయోజనమే తప్ప... హానికరం కావు.

అపోహ: ఆరెంజ్‌ జ్యూస్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది

వాస్తవం: ఇంట్లో తయారు చేసుకునే ఆరెంజ్‌ జ్యూస్‌లో మనం కలిపే చక్కెర తప్ప... ఇతర పండ్ల మాదిరిగానే షుగర్‌ లెవెల్స్ ఉంటాయి. అందుకే తాజా పండును పిండి తీసిన రసం పంచదార లేకుండా తాగితే మంచిది. ఇక బయటి స్టోర్లు, ఫ్రూట్ జ్యూస్‌ సెంటర్లలో రుచి కోసం చక్కెరతో పాటు ఇతర పదార్థాలను ఎక్కువగా కలుపుతుంటారు. అందుకే వాటికి దూరంగా ఉండడం మంచిది.

అపోహ: కొవ్వులు శరీర బరువును పెంచుతాయి

వాస్తవం: శరీరానికి అన్ని రకాల కొవ్వు పదార్థాలు హానికరమైనవి కావు. చెడు కొవ్వు పదార్థాలు, ఎక్కువ కొవ్వు పదార్థాలను తినడం వల్ల లావయ్యే అవకాశం ఉంది. కొవ్వుల గురించి వివిధ రకాల అభిప్రాయాలున్నా... పోషకాల పరంగా అవి శరీరానికి చాలా అవసరం. అయితే సరైన పరిమాణంలో, శరీరానికి మేలు చేసే కొవ్వు పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.

అపోహ: కార్బొహైడ్రేట్లు తీసుకుంటే లావవుతారు

వాస్తవం: కార్బొహైడ్రేట్లు లేదా పిండి పదార్థాలు శరీర బరువును పెంచవు. మనం తీసుకునే ఆహారంలో క్యాలరీలు మోతాదుకు మించి ఉన్నప్పుడే బరువు పెరుగుతారు. అంతే తప్ప కార్బొహైడ్రేట్లు అధిక బరువుకు కారణం కావు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్