శాకాహారం గురించి ఈ అపోహలు అక్కర్లేదు!

మమతకు చిన్నతనం నుంచి పర్యావరణమన్నా, మూగ జీవాలన్నా ఎనలేని ప్రేమ. అందుకే నాన్ వెజ్ అంటే మొహం చిట్లిస్తుంది. తనే కాదు.. తన కుటుంబ సభ్యుల్ని కూడా శాకాహారులుగానే మార్చేసిందామె. అయితే వెజిటేరియన్‌ డైట్‌తో పోషకాలన్నీ అందవని తన ఫ్రెండ్....

Published : 21 Oct 2022 18:54 IST

మమతకు చిన్నతనం నుంచి పర్యావరణమన్నా, మూగ జీవాలన్నా ఎనలేని ప్రేమ. అందుకే నాన్ వెజ్ అంటే మొహం చిట్లిస్తుంది. తనే కాదు.. తన కుటుంబ సభ్యుల్ని కూడా శాకాహారులుగానే మార్చేసిందామె. అయితే వెజిటేరియన్‌ డైట్‌తో పోషకాలన్నీ అందవని తన ఫ్రెండ్ చెప్పడంతో ఆలోచనలో పడింది.

పర్యావరణ పరిరక్షణ, మూగ జీవాలపై ప్రేమ, ఆరోగ్య సమస్యలు, బరువు తగ్గడం.. ఇలా కారణమేదైనా ఈ రోజుల్లో చాలామంది శాకాహారానికే ఓటేస్తున్నారు. పైగా శాకాహారం తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, బీపీ, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశం తక్కువని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అయితే శాకాహారంతో ప్రొటీన్లు అందవేమో, వ్యాయామం చేసే వారికి ఈ ఆహార పద్ధతి సరికాదేమో.. ఇలా చాలామందిలో చాలా రకాల సందేహాలే ఉంటాయి. ఈ క్రమంలో శాకాహారానికి సంబంధించి ఉండే కొన్ని అపోహలు, వాటికి సంబంధించి నిపుణులు చెబుతున్న వాస్తవాలేంటో తెలుసుకుందాం రండి..

అపోహ : శాకాహారంతో శరీరానికి కావాల్సిన ప్రొటీన్‌ అందదు!

వాస్తవం: శాకాహారంతో రోజువారీ మన శరీరానికి అందాల్సిన ప్రొటీన్‌ అందదనేది నిజం కాదు. ఎందుకంటే మన శరీర బరువును బట్టి ఒక్కో కిలోకు 0.8 గ్రాముల ప్రొటీన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి బరువు 50 కిలోలు అనుకుంటే ఆ వ్యక్తి రోజూ 40 గ్రాముల ప్రొటీన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే శాకాహారంతోనూ మన శరీరానికి కావాల్సినంత ప్రొటీన్‌ను అందించచ్చు. టోఫూ, జున్ను, పప్పులు, శెనగలు, బఠానీ, తృణ ధాన్యాలు, క్వినోవా, సోయా, నట్స్‌, గింజలు.. వీటన్నింటిలో ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.

అపోహ : ఎలాంటి శాకాహారం తీసుకున్నా బరువు తగ్గేయచ్చు!

వాస్తవం: బరువు తగ్గాలనుకునే వారికి శాకాహారమే మేలు అని కొందరు నిపుణులు సలహా ఇస్తుంటారు. అంతేకాదు.. మాంసాహారం తినేవారి కంటే శాకాహారం తినేవారే ఎక్కువగా బరువు తగ్గినట్లు ఓ అధ్యయనంలో కూడా వెల్లడైంది. అయితే అదీ ఆరోగ్యకరంగా తీసుకుంటేనే ఫలితం ఉంటుందంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే శాకాహారం పేరుతో బంగాళాదుంప చిప్స్‌, కుకీస్‌, ఇతర నూనె సంబంధిత పదార్థాలు.. ఇలా మీకు నచ్చినట్లుగా తీసుకుంటే బరువు తగ్గడం కాకుండా మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బరువు తగ్గాలన్న లక్ష్యంతో ముందుకెళ్లేవారు పండ్లు, కాయగూరలు అధికంగా మెనూలో చేర్చుకోవాలి. అలాగే వాటిని సలాడ్స్‌గా తీసుకోవచ్చు.. ఆ కాయగూరల్ని ఉడికించిన నీటితో సూప్స్‌ వంటివి తయారుచేసుకొని తీసుకుంటే ఇటు శరీరానికి పోషకాలు కూడా అందుతాయి.. అటు బరువూ తగ్గచ్చు.

అపోహ : పండ్లలోని చక్కెరలు శరీరానికి మంచివి కావు!

వాస్తవం: శాకాహారులనే కాదు.. ఎవరైనా సరే ఆయా సీజన్లలో లభించే పండ్లను ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే వారిలో ఉన్న సందేహమల్లా ఒక్కటే. అదేంటంటే.. పండ్లలో ఉండే చక్కెరలు ఆరోగ్యానికి మంచివి కావేమోనని! కానీ పండ్లలో ఉండే సహజసిద్ధమైన చక్కెరలకు, మనం విడిగా తీసుకునే చక్కెరలకు చాలా తేడా ఉందని చెబుతున్నారు నిపుణులు. పండ్లలో ఫ్రక్టోజ్‌ అనే సహజ చక్కెరలు ఉంటాయి. దీంతో పాటు విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియంట్లు.. కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. అలాగే పలు అనారోగ్యాలు మన శరీరంపై ప్రతికూల ప్రభావం చూపకుండా రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరుస్తాయి. అంతేకాదు.. పండ్లలో క్యాలరీలు కూడా తక్కువే! కాబట్టి ఆయా సీజన్లలో దొరికే పండ్లను రోజూ తీసుకోవడం మంచిది.

అపోహ : రోజూ శాకాహారం తీసుకోవడమంటే విసుగు పుడుతుంది..

వాస్తవం: శాకాహారమే కాదు.. రోజూ మాంసాహారం తీసుకున్నా బోర్‌ కొడుతుంది. అందుకే శాకాహార పద్ధతిని అలవాటు చేసుకున్న వాళ్లు బోరింగ్‌గా ఫీలవకూడదంటే రోజూ ఒకేలా కాకుండా కొత్త కొత్త వంటకాలను ప్రయత్నించాలి. ఉదాహరణకు.. పనీర్‌ కర్రీని ఎప్పుడూ ఒకేలా తినడమంటే ఎవరికైనా బోరే! కాబట్టి ఒకసారి పనీర్-ఆకుకూరలు కలిపి వండుకోవచ్చు.. మరోసారి పనీర్‌ కూర్మా చేసుకోవచ్చు.. ఎప్పుడూ అన్నంలోకే కాకుండా పనీర్‌తో ప్యాన్‌కేక్స్‌, ప్యాటీస్‌, పనీర్‌-బ్రెడ్‌ టోస్ట్‌.. ఇలా రోజుకో వెరైటీ ప్రయత్నించచ్చు. వీటిలో నూనె కూడా పెద్దగా అవసరం ఉండదు కాబట్టి హెల్దీగా, టేస్టీగా లాగించేయచ్చు. ఇలా ఇతర కాయగూరల్ని కూడా మీకు నచ్చినట్లుగా వండుకొని తీసుకుంటే బోర్‌ అన్న ఫీలింగే రాదు.. పైగా పోషకాలు కూడా బాగా అందుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్