ఆహారం విషయంలో మీకూ ఈ అపోహలున్నాయా?

ఆహారం విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన ధోరణి. ఆరోగ్యం కోసం కొందరు, బరువు తగ్గాలని మరికొందరు, సౌందర్యాన్ని దెబ్బతీస్తాయేమోనని ఇంకొందరు.. తమ ఆహారపుటలవాట్లను మార్చుకుంటుంటారు. దీంతో శరీరానికి అందాల్సిన పోషకాలు కాస్తా అందకుండా పోతాయి. అయితే కొవ్వులు, కార్బోహైడ్రేట్లు అంటూ....

Published : 26 Jul 2022 20:57 IST

ఆహారం విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన ధోరణి. ఆరోగ్యం కోసం కొందరు, బరువు తగ్గాలని మరికొందరు, సౌందర్యాన్ని దెబ్బతీస్తాయేమోనని ఇంకొందరు.. తమ ఆహారపుటలవాట్లను మార్చుకుంటుంటారు. దీంతో శరీరానికి అందాల్సిన పోషకాలు కాస్తా అందకుండా పోతాయి. అయితే కొవ్వులు, కార్బోహైడ్రేట్లు అంటూ మనం పక్కన పెట్టే పోషకాల్లోనూ మనకు ఆరోగ్యాన్ని అందించే సుగుణాలు బోలెడున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే మనం తీసుకునే ఆహారానికి సంబంధించిన కొన్ని అపోహలు, వాస్తవాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయమంటున్నారు.

కార్బోహైడ్రేట్లు ఎంత తక్కువగా తీసుకుంటే అంత బరువు తగ్గచ్చు.

ఇది కొంతవరకు నిజమే అయినప్పటికీ ఇలా తగ్గిన బరువును ఎప్పటికీ అలాగే మెయింటెయిన్‌ చేయడం కష్టమంటున్నారు నిపుణులు. అంతేకాదు.. కార్బోహైడ్రేట్లు కూడా ఆరోగ్యానికి కొంతవరకు మంచివేనట! తక్కువ కార్బోహైడ్రేట్లుండే ఆహారం తీసుకున్న వారి కంటే రోజూ నిర్ణీత మోతాదులో ఈ పోషకాలు తీసుకున్న వారే ఆరోగ్యంగా ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. కాయగూరలు, పండ్లు, పప్పు ధాన్యాలు, ఓట్స్‌, బ్రౌన్‌రైస్‌, హోల్‌గ్రెయిన్‌ బ్రెడ్‌.. వంటి పదార్థాల ద్వారా కార్బోహైడ్రేట్లను పొందచ్చు. ఈ పదార్థాల్లో ఉండే ఫైబర్‌, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు.. వ్యాధికారకాలతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి. కాబట్టి కార్బోహైడ్రేట్లను పూర్తిగా పక్కన పెట్టేయడం కంటే మీ బరువును బట్టి ఎంత మోతాదులో తీసుకోవాలో నిపుణులను అడిగి తెలుసుకోవడం మంచిది.

పండ్ల రసాలు రోజూ అమితంగా తాగేయచ్చు.

‘మితంగా తింటే ఆరోగ్యం.. అమితంగా తింటే విషం..’ అని పెద్దలు ఊరికే అనలేదు. ఇది పండ్ల రసాలకూ వర్తిస్తుందంటున్నారు నిపుణులు. పండ్ల రసాల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నప్పటికీ చక్కెర కూడా అధికంగానే ఉంటుంది. ఇది అధిక క్యాలరీలను కలిగి ఉంటుంది. కాబట్టి పండ్ల రసాలను విచ్చలవిడిగా తాగడం వల్ల ఎక్కువ మొత్తంలో చక్కెర రక్తంలోకి చేరుతుంది. దీని ద్వారా శరీరంలో క్యాలరీలు కూడా పెరిగిపోతాయి. అటు ఆరోగ్యపరంగా, ఇటు బరువు పరంగా.. ఇలా రెండు విధాలా నష్టమే! కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసుల పండ్ల రసం/కాయగూరల రసం తాగడం మంచిదని సూచిస్తున్నారు. అయితే ఇలా జ్యూస్‌ రూపంలో కాకుండా పండ్లను నేరుగా తీసుకోవడం ఇంకా మంచిదట. ఎందుకంటే జ్యూస్‌లో ఫైబర్‌ ఉండకపోవడం, వీటిలో ఫైబర్‌ ఉండడమే ఇందుకు కారణం.

తక్కువ ఆహారం ఎక్కువసార్లు తినడమే మంచిది.

ఈ నియమం అందరికీ వర్తించదంటున్నారు నిపుణులు. రోజులో మనం తీసుకునే ఆహారాన్ని తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు విభజించుకొని తీసుకోవడమనేది బరువు తగ్గే వారిపై ప్రభావం చూపుతుందేమో గానీ.. ఆరోగ్యంగా ఉండి చక్కటి పోషకాహారం తీసుకునే వారు ఇలా చేసినా చేయకపోయినా హెల్దీగానే ఉంటారట! ఇక జీర్ణ సంబంధిత సమస్యలున్న వారు, మధుమేహులు, గర్భిణులు మాత్రం ఆహారాన్ని ఇలా విభజించుకొని తీసుకోవడం వల్ల వారు నిరంతరం ఆరోగ్యంగా ఉండచ్చు.. అలాగే వీటిలోని పోషకాలు వారి శరీరానికి అందుతాయి.

ఎక్కువ కొవ్వులుండే ఆహారం తీసుకోవడం అనారోగ్యకరం!

ఈ అపోహతోనే చాలామంది కొవ్వులుండే ఆహారాన్ని పూర్తిగా దూరం పెడుతున్నారంటున్నారు నిపుణులు. ఎందుకంటే మన ఆరోగ్యానికి మంచి కొవ్వుల ఆవశ్యకత ఎంతో ఉంది. అంతేకాదు.. తక్కువ కొవ్వులుండే ఆహారం తీసుకోవడం వల్ల మెటబాలిక్‌ సిండ్రోమ్‌, ఇన్సులిన్‌ నిరోధకత, ట్రైగ్లిజరైడ్‌ స్థాయులు తగ్గిపోవడం.. వంటి సమస్యలొస్తాయట! ఇవి క్రమంగా గుండె సమస్యలకు దారితీస్తాయట! కాబట్టి మంచి కొవ్వులు ఎక్కువగా లభించే అవకాడో, డార్క్‌ చాక్లెట్‌, కోడిగుడ్లు, నట్స్‌, ఛీజ్‌.. వంటివి తీసుకోవడం ఆరోగ్యదాయకం అంటున్నారు. ఇక బరువు తగ్గే వారు మాత్రం తమ ఆహారంలో ఎంత మేరకు కొవ్వుల్ని చేర్చుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్న విషయాల్లో నిపుణుల సలహా తీసుకోవచ్చు.

భోజనం/బ్రేక్‌ఫాస్ట్‌ మానేస్తే మన శరీరంలో అదనపు క్యాలరీలు చేరవు.

ఇది ముమ్మాటికీ అపోహే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మనం భోంచేయడం మానేయడం వల్ల ఆకలి మరింతగా పెరుగుతుంది. తద్వారా ప్రాసెస్డ్‌ ఫుడ్‌, నూనె సంబంధిత పదార్థాలు తీసుకోవాలన్న కోరిక రెట్టింపవుతుంది. అలాంటప్పుడు ఆ పదార్థాల్ని తీసుకోవడం వల్ల అదనపు క్యాలరీలు మన శరీరంలో చేరతాయి. ఇది క్రమంగా అధిక బరువుకు దారితీస్తుంది. కాబట్టి క్యాలరీలు, కొవ్వుల పేరుతో భోజనాన్ని మానేయడం అస్సలు సరి కాదంటున్నారు నిపుణులు. బ్రేక్‌ఫాస్ట్‌/లంచ్‌/డిన్నర్‌.. ఇలా ఏ పూటకాపూట పోషకాహారం తీసుకుంటూనే.. మధ్యమధ్యలో ఆరోగ్యాన్ని అందించే పండ్లు, నట్స్‌.. వంటి స్నాక్స్‌ని చేర్చుకోమని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్