Winter Tips: చలికాలంలో కర్లీ హెయిర్ సంరక్షణ ఇలా..!

మనం అందంగా మెరిసిపోవడంలో జుట్టుదీ కీలకపాత్రే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చాలామంది ఒత్తైన కేశసంపద కోసం ఆరాటపడుతుంటారు. అయితే వాతావరణంలోని పలు మార్పుల వల్ల జుట్టుపై ప్రతికూల ప్రభావం పడి, తద్వారా దాని ఆరోగ్యం దెబ్బతింటుంది. చలికాలంలోనైతే ఈ సమస్య మరింత తీవ్రంగా.....

Published : 05 Nov 2022 13:06 IST

మనం అందంగా మెరిసిపోవడంలో జుట్టుదీ కీలకపాత్రే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చాలామంది ఒత్తైన కేశసంపద కోసం ఆరాటపడుతుంటారు. అయితే వాతావరణంలోని పలు మార్పుల వల్ల జుట్టుపై ప్రతికూల ప్రభావం పడి, తద్వారా దాని ఆరోగ్యం దెబ్బతింటుంది. చలికాలంలోనైతే ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ చలిగాలులకు సాధారణ జుట్టే పొడిగా మారుతుందనుకుంటే.. ఇక నార్మల్‌గానే డ్రైగా అనిపించే కర్లీ హెయిర్ ఈ కాలంలో మరింత పొడిబారిపోతుంది. ఫలితంగా చుండ్రు, చివర్లు చిట్లిపోవడం, జుట్టు బాగా ఊడిపోవడం.. వంటి పలు సమస్యలు తలెత్తుతాయి. మరి, ఈ కాలంలో వాటన్నింటి నుంచి దూరంగా ఉంటూ మన అందాన్ని పెంచే రింగుల జుట్టును కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు సౌందర్య నిపుణులు.. అవేంటో తెలుసుకుందామా..

బ్లో డ్రయర్స్ వద్దు!

చాలామంది తలస్నానం చేసిన తర్వాత జుట్టును త్వరగా ఆరబెట్టుకోవాలన్న ఆతృతతో బ్లో డ్రయర్స్ ఉపయోగిస్తుంటారు. కానీ అందులో నుంచి వెలువడే వేడి వల్ల కేశాల ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాదు.. ఈ వేడి కర్ల్స్‌ పైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి తలస్నానం చేశాక జుట్టుకు కాసేపు మెత్తటి కాటన్ టవల్ చుట్టుకోవాలి. తద్వారా కేశాలు కాస్త పొడిగా మారతాయి. ఆ తర్వాత సహజసిద్ధంగా ఆరనివ్వాలి. ఈ క్రమంలో దువ్వాలనుకుంటే అందుకు లావుగా ఉండే బ్రిజిల్స్ కలిగిన దువ్వెనను ఉపయోగించడం శ్రేయస్కరం. అలాగే తలస్నానానికి కూడా గాఢత తక్కువగా ఉండే షాంపూను లేదంటే ఇంట్లో తయారుచేసుకునే సహజసిద్ధమైన షాంపూలను ఉపయోగించడం రింగుల జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది.

కండిషనింగ్ మరవద్దు..

తలస్నానం చేసిన వెంటనే కండిషనర్ రాసుకోవడం మనలో చాలామందికి అలవాటు. ఇది జుట్టును మృదువుగా మారేలా చేయడంతో పాటు మెరిసేలా చేస్తుంది. అయితే కర్లీ హెయిర్ ఉన్న వారు కూడా ఈ చలికాలంలో తలస్నానం చేసిన వెంటనే జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు కండిషనర్ రాసుకోవాలి. రెండుమూడు నిమిషాలుంచుకొని ఆపై కేశాలను నీటితో కడిగేస్తే సరి. అయితే కర్ల్స్ కాస్త ఎక్కువగా ఉన్న వారు కండిషనర్‌ను ఐదు నిమిషాల పాటు ఉంచుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. వారానికి రెండుసార్లు ఈ పద్ధతిని పాటించడం వల్ల జుట్టుకు తగిన పోషణ అందుతుంది.

నూనెల్ని కాస్త వేడి చేయండి..

జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించడంలో నూనెల పాత్ర కూడా కీలకమే. అందుకే కొబ్బరి, బాదం, ఆలివ్.. వంటి అత్యవసర నూనెలతో తరచూ జుట్టుకు మసాజ్ చేసుకుంటాం. ఇలా చేయడం వల్ల జుట్టు పొడిబారకుండా కూడా కాపాడుకోవచ్చు. అయితే చలికాలంలో కర్లీ హెయిర్‌ను కాపాడుకోవడానికి, అది పొడిబారకుండా ఉండడానికి గోరువెచ్చటి నూనెతో మసాజ్ చేయడం తప్పనిసరి. అది కూడా తలస్నానం చేయడానికి గంట లేదా రెండు గంటల ముందు ఈ చిట్కాను పాటించడం వల్ల జుట్టుకు చక్కటి పోషణ లభిస్తుంది. కాబట్టి మనం ఉపయోగించేది ఏ నూనె అయినా సరే.. దాన్ని అప్లై చేసుకునే ముందు కాస్త వేడి చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్