ఇప్పుడు అందానికి.. ఆరోగ్యానికి ఈ చిట్కాలు పాటిస్తున్నా..!

గర్భం ధరించాక ఆరోగ్యం విషయంలోనే కాదు.. సౌందర్య పరిరక్షణ విషయంలోనూ శ్రద్ధ వహిస్తుంటారు కాబోయే అమ్మలు. తాము వాడే సౌందర్యోత్పత్తుల ప్రభావం పుట్టబోయే బిడ్డపై పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. తానూ ఇందుకు మినహాయింపు కాదంటోంది బాలీవుడ్‌ స్టార్‌ బ్యూటీ దీపికా పదుకొణె....

Published : 29 May 2024 13:15 IST

గర్భం ధరించాక ఆరోగ్యం విషయంలోనే కాదు.. సౌందర్య పరిరక్షణ విషయంలోనూ శ్రద్ధ వహిస్తుంటారు కాబోయే అమ్మలు. తాము వాడే సౌందర్యోత్పత్తుల ప్రభావం పుట్టబోయే బిడ్డపై పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. తానూ ఇందుకు మినహాయింపు కాదంటోంది బాలీవుడ్‌ స్టార్‌ బ్యూటీ దీపికా పదుకొణె. త్వరలో అమ్మ కాబోతున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ జర్నీని పూర్తిగా ఆస్వాదిస్తోంది. గర్భం దాల్చినప్పట్నుంచి వీలైనంత వరకు కెమెరా కంటికి దూరంగా ఉంటోన్న దీప్స్‌.. ఇటీవలే ఓ బ్యూటీ ఈవెంట్లో మెరిసింది. ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీలో భాగంగా సౌందర్య పరంగా తాను పాటిస్తోన్న కొన్ని చిట్కాల్ని పంచుకుంది. మరి, అవేంటో మనమూ తెలుసుకుందామా?

అందాల తారల వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలే కాదు.. అందం, ఆరోగ్యం పరంగా వారు పాటించే చిట్కాల గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. అందులోనూ ప్రెగ్నెన్సీ సమయంలో వాళ్ల రొటీన్ గురించి తెలుసుకోవాలన్న ఆతృత మనలో చాలామందికి ఉంటుంది. అయితే ఇటీవలే ఓ బ్యూటీ ఈవెంట్‌లో పాల్గొన్న దీపిక.. తన ప్రెగ్నెన్సీ స్కిన్‌ కేర్‌ రొటీన్‌ని పంచుకుంది. ప్రస్తుతం ఆమె చిట్కాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మేకప్‌కి దూరంగా..!
గర్భం దాల్చినప్పట్నుంచి సాధ్యమైనంత వరకు మేకప్‌కు దూరంగా ఉంటున్నా. ఒకవేళ వేసుకోవాల్సి వస్తే.. నిపుణుల సలహా మేరకు సహజసిద్ధమైన మేకప్‌ ఉత్పత్తుల్ని వాడుతున్నా. ఎందుకంటే మార్కెట్లో దొరికే మేకప్‌ ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉండే రసాయనాలు, పరిమళాలు, ప్రిజర్వేటివ్స్‌.. చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటిని అదే పనిగా వాడితే కడుపులోని బిడ్డకూ హానికరం! కాబట్టి ఇలాంటి మేకప్‌ ఉత్పత్తుల్ని దూరం పెడుతున్నా. అలాగే రాత్రి పడుకునే సమయంలో మేకప్‌ తొలగించుకున్నాకే నిద్రపోతున్నా. లేదంటే వాటి అవశేషాలు చర్మ రంధ్రాల్లోకి చేరి మొటిమలు, నల్ల మచ్చలకు దారితీస్తాయి.

ప్రొటీన్లు ఎక్కువగా!
మనం తీసుకునే ఆహారం కూడా చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ఫుడ్‌ విషయంలోనూ పలు నియమాలు పెట్టుకున్నా. ఈ క్రమంలో యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఇతర పోషకాలు.. వంటివి పుష్కలంగా లభించే పండ్లు, కాయగూరలు, ముడి ధాన్యాలు.. రోజువారీ ఆహారంలో చేర్చుకుంటున్నా. వీటితో పాటు వంట కోసం ఆరోగ్యకరమైన నూనెలు వాడేలా చొరవ చూపుతున్నా. ఇక శరీరాన్ని తేమగా ఉంచుకోవడమూ ముఖ్యమే! అందుకే రోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగుతున్నా. వాతావరణం ఇంకా వేడిగా అనిపిస్తే అదనంగా మరో లీటర్‌ నీటిని తీసుకుంటున్నా.

యోగాతో చురుగ్గా!
గర్భిణిగా ఉన్నప్పుడు శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో మార్పుల కారణంగా ఒత్తిడి ఎదురవడం సహజం. దీన్ని జయించడానికి యోగా, ధ్యానం అలవాటు చేసుకున్నా. ఈ తరహా చిన్నపాటి వ్యాయామాలు శరీరంలో రక్తప్రసరణ, ఆక్సిజన్‌ సరఫరాకు తోడ్పడతాయి. తద్వారా పిండానికీ ఆక్సిజన్‌, రక్త ప్రసరణ బాగా అందుతాయి. ఫలితంగా బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది. అలాగే ఈ సమయంలో నా శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంలోనూ నేను చేసే ఈ వ్యాయామాలు నాకు దోహదం చేస్తున్నాయి.

అందానికి సుఖ ‘నిద్ర’!
ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుల ప్రభావం చర్మం పైనా పడుతుంది. అలా జరగకుండా నిద్రకు తగిన సమయం కేటాయిస్తున్నా. సమయం దొరికినప్పుడల్లా విశ్రాంతి తీసుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నా. ఇలా సుఖ నిద్ర, తగినంత విశ్రాంతి వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.. అలాగే కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది.

మరి, దీప్స్‌ చెప్పిన ఈ చిట్కాలు మీరూ పాటించాలనుకుంటున్నారా? అయితే ముందు ఓసారి మీ గైనకాలజిస్ట్‌ సలహా తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరి ప్రెగ్నెన్సీ పరిస్థితులు, అవసరాలు ఒక్కోలా ఉంటాయి. కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకుంటే ఇటు ప్రెగ్నెన్సీని ఆస్వాదించచ్చు.. అటు ఆరోగ్యంగా, అందంగానూ మెరిసిపోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్