వీగన్‌ క్లీనర్స్‌తో.. కోట్ల వ్యాపారం!

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా.. ఏదో ఒకటి శుభ్రం చేస్తూనే ఉంటాం. ఈ క్రమంలో వివిధ రకాల క్లీనింగ్‌ ఉత్పత్తుల్ని వినియోగిస్తుంటాం. అయితే వాటిని వాడామా? పని పూర్తయిందా? అన్న ఆలోచనే తప్ప.. వాటి లేబుల్‌ని పరిశీలించేవారు చాలా తక్కువమంది ఉంటారు.

Published : 25 Mar 2024 12:49 IST

(Photos: Instagram)

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా.. ఏదో ఒకటి శుభ్రం చేస్తూనే ఉంటాం. ఈ క్రమంలో వివిధ రకాల క్లీనింగ్‌ ఉత్పత్తుల్ని వినియోగిస్తుంటాం. అయితే వాటిని వాడామా? పని పూర్తయిందా? అన్న ఆలోచనే తప్ప.. వాటి లేబుల్‌ని పరిశీలించేవారు చాలా తక్కువమంది ఉంటారు. సిమ్రన్‌ ఖారా కూడా ఓసారి అనుకోకుండా ఈ క్లీనింగ్‌ ఉత్పత్తుల లేబుల్‌ని పరిశీలించింది. అయితే వాటిలో ఉండే రసాయనాలతో ఇల్లు శుభ్రపడడానికి బదులు మరింత హానికరంగా మారుతుందని గ్రహించిందామె. ఈ ఆలోచనే ఆమెతో సహజసిద్ధమైన క్లీనింగ్‌ ఉత్పత్తుల వ్యాపారం ప్రారంభించేలా చేసింది. ప్రస్తుతం తన బిజినెస్‌ను క్రమంగా విస్తరిస్తోన్న ఆమె.. తన వ్యాపార ప్రయాణం గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి..

సిమ్రన్‌ ఖారాది దిల్లీ. ఎంబీఏ పూర్తిచేసిన ఆమె.. 14 ఏళ్ల పాటు ప్రముఖ కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేసింది. అయితే కూతురు పుట్టాక తన చిన్నారి ఆలనా పాలన చూసుకోవడానికి ఉద్యోగం మానేసి ఇంటికే పరిమితమైందామె. ఇదే సమయంలో దేశంలో కరోనా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో.. తన భర్త, చిన్నారితో మరింత సమయం గడిపే అవకాశం దొరికిందంటోంది సిమ్రన్.

లేబుల్‌ చూసి ఆశ్చర్యపోయా!

‘కరోనా లాక్‌డౌన్‌ సమయంలో నా భర్త, కూతురితో మరింత సమయం గడిపే అవకాశం దొరికింది. ఏ పని చేసినా ముగ్గురం కలిసి చేసేవాళ్లం. దాంతో భలే సరదాగా అనిపించేది. అయితే కొవిడ్‌ నుంచి రక్షణ కోసం ఇంట్లో వస్తువుల్ని పదే పదే శుభ్రం చేసుకునేవాళ్లం. అప్పుడప్పుడూ ఈ పనిని నా కూతురికి కూడా అప్పగించేదాన్ని. ఉన్నట్లుండి ఓసారి ఆయా క్లీనింగ్‌ ఉత్పత్తుల లేబుల్‌పై నా దృష్టి పడింది. వాటి తయారీలో ఉపయోగించిన హానికారక రసాయనాలు చూసి ఆశ్చర్యపోయా. అప్పటిదాకా ఈ క్లీనింగ్‌ ఉత్పత్తులతో ఇల్లు పూర్తిగా శుభ్రపడుతుందన్న భరోసాతో ఉన్న నేను.. లేబుల్‌ చదివాక మనసు మార్చుకున్నా. నా చేజేతులారా ఇంటిని అపరిశుభ్రంగా మార్చుతున్నానా అనిపించింది. ఇది నా చిన్నారిపై, పెట్‌పై ఎక్కువగా ప్రతికూల ప్రభావం చూపుతుందన్న భయం నన్ను ఆవహించింది. ఈ క్రమంలోనే మార్కెట్లో దొరికే క్లీనింగ్‌ ఉత్పత్తుల తయారీలో వాడే రసాయనాల గురించి మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేశా. ఇందులో భాగంగానే.. క్లీనింగ్‌ ఉత్పత్తుల్లో ఫ్లోర్‌ క్లీనర్స్‌, డిష్‌వాషింగ్‌ లిక్విడ్స్‌, బట్టలు ఉతికే సబ్బులు/లిక్విడ్స్‌.. వంటివి ఎక్కువమంది వాడుతున్నట్లు నాకు అర్థమైంది. వాటిలోనూ దుస్తులు/పాత్రల్ని మెరిపించేందుకు గాఢమైన సోడియం సిలికేట్‌, సోడియం సల్ఫేట్‌, ఫ్యాబ్రిక్‌ వైట్‌నర్స్‌.. వంటివి ఉపయోగిస్తున్నట్లు గ్రహించా. అంతేకాదు.. ఈ రసాయనాలు శ్వాస వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక సమస్యలకు కారణమవుతున్నట్లు ఓ పరిశోధన పత్రంలో చదివాను. నిజానికి ఇది నా ఒక్కదాని సమస్యే కాదు.. ప్రతి ఇంట్లో ఎదురయ్యే సమస్య. అందుకే దీనికేదైనా పరిష్కారం చూపాలనుకున్నా. ఈ ఆలోచనల్లోంచి పుట్టిందే ‘కొపరో క్లీన్‌ (Koparo Clean)’..’ అంటూ తన వ్యాపారం ప్రారంభించిన తీరును పంచుకుంది సిమ్రన్.

మొక్కల పదార్థాలతోనే..!

2021 ఫిబ్రవరిలో తన సంస్థను ప్రారంభించిన సిమ్రన్‌.. ఈ వేదికగా మొక్కల ఆధారిత పదార్థాలతో సహజసిద్ధమైన క్లీనర్స్‌ని తయారుచేస్తోంది.

‘ప్రస్తుతం మా వద్ద మొక్కల ఆధారిత పదార్థాలు, కొబ్బరి, బయో ఎంజైమ్స్‌, అత్యవసర నూనెలు.. వంటి సహజసిద్ధమైన పదార్థాలతో వివిధ రకాల క్లీనింగ్‌ ఉత్పత్తులు తయారవుతున్నాయి. వాటిలో లాండ్రీ క్లీనర్స్‌, డిష్‌వాషింగ్‌ లిక్విడ్స్‌, కిచెన్‌ క్లీనింగ్‌ ఉత్పత్తులు, హ్యాండ్‌ వాష్‌, నేలను శుభ్రం చేసే ఉత్పత్తులు, బాడీ క్లీనర్స్‌, ఇంటిని సువాసనభరితం చేసే సహజసిద్ధమైన పరిమళాలు, పెట్‌ క్లీనర్స్‌, క్లీనింగ్‌ యాక్సెసరీస్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలే లభిస్తున్నాయి. ఇవి మురికి, జిడ్డును తొలగించడంలో సమర్థంగా పనిచేస్తాయి. ప్రస్తుతం డిష్‌వాష్‌ లిక్విడ్స్‌, ఫ్లోర్‌ క్లీనర్స్‌, హ్యాండ్వాష్‌లకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. దేశవ్యాప్తంగా మాకు 30కి పైగా గోడౌన్స్‌ ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో ఉన్న మా ఫ్యాక్టరీలో ఆయా క్లీనింగ్‌ ఉత్పత్తుల్ని తయారుచేస్తున్నాం. వీటిని ప్యాక్‌ చేసేందుకు ఉపయోగించే బాటిల్స్‌ కూడా రీసైకిల్‌ చేసినవే! పైగా మేం తయారుచేసే పదార్థాల్లో కృత్రిమ రంగులను అస్సలు వాడం.. జంతువులకు సంబంధించిన ఉత్పత్తులూ మా క్లీనర్స్‌లో ఉండవు.. ఇలా ఈ క్లీనర్స్‌ తయారీలో పూర్తిగా వీగనిజాన్ని ఫాలో అవుతున్నాం..’ అంటోన్న సిమ్రన్‌.. తన ఉత్పత్తుల్ని ఆన్‌లైన్‌ వేదికగా విక్రయిస్తోంది.

నెలకు రూ. 3 కోట్లు!

మూడేళ్ల క్రితం సిమ్రన్‌ ప్రారంభించిన క్లీనింగ్‌ ఉత్పత్తుల వ్యాపారం ఇంతింతై అన్నట్లుగా వృద్ధి చెందుతోంది. మొదట్లో పెట్టుబడి పరంగా, ఆర్థికంగా పలు సవాళ్లు ఎదురైనా.. వాటన్నింటినీ దాటుకొని ముందుకు సాగిన ఆమె.. ప్రస్తుతం కోట్లలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

‘ప్రస్తుతం రోజుకు 400-500 ఆర్డర్లొస్తున్నాయి. నెలకు సుమారుగా రూ. 3 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ మధ్యే ప్రముఖ బిజినెస్‌ రియాల్టీ షో ‘షార్క్‌ ట్యాంక్‌ ఇండియా’లో రూ. 70 లక్షల పెట్టుబడినీ గెలుచుకున్నా. ఇది నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత ప్రోది చేసింది. మన చుట్టూ ఉండే వాతావరణం పరిశుభ్రంగా ఉంటేనే.. మన పిల్లలు, పెట్స్‌ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇదే భవిష్యత్‌ తరాల వారికి మనమిచ్చే బహుమతి.. త్వరలోనే మరిన్ని క్లీనింగ్‌ ఉత్పత్తుల్ని తయారుచేసే పనిలో ఉన్నా..’ అంటూ తన మాటలతోనూ స్ఫూర్తి నింపుతోంది సిమ్రన్‌. బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ సతీమణి మీరా కపూర్‌ ఈ క్లీనింగ్‌ ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్