ఈ నొప్పులతో బాధపడుతున్నారా?

ఒక్కోసారి శరీరంలోని కొన్ని భాగాలలో నొప్పిగా అనిపిస్తుంటుంది. మరీ తీవ్రం కానంతవరకు అలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోము. అలాగని 'ఏమీ కాదులే' అని వాటిని అశ్రద్ధ చేయడమూ మంచిది కాదు. ఎందుకంటే ఒక్కోసారి ఈ నొప్పులు కొన్ని ప్రమాదకరమైన....

Published : 21 Nov 2022 18:58 IST

ఒక్కోసారి శరీరంలోని కొన్ని భాగాలలో నొప్పిగా అనిపిస్తుంటుంది. మరీ తీవ్రం కానంతవరకు అలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోము. అలాగని 'ఏమీ కాదులే' అని వాటిని అశ్రద్ధ చేయడమూ మంచిది కాదు. ఎందుకంటే ఒక్కోసారి ఈ నొప్పులు కొన్ని ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు అంటున్నారు నిపుణులు.

సూదులు గుచ్చినట్లుగా...

ఉదరభాగంలో కుడివైపున సూదులు గుచ్చినట్లుగా నొప్పి వస్తూ, దాంతో పాటు వాంతులు, జ్వరం ఉన్నట్లయితే అది అపెండిసైటిస్ కావచ్చు. ఈ లక్షణం కనిపిస్తే ఆలోచించకుండా ఆసుపత్రికి వెళ్లడం మంచిది. అపెండిక్స్‌కి ఇన్ఫెక్షన్ సోకడం వల్ల ఈ నొప్పి వస్తుంది. దీన్ని వెంటనే సర్జరీ చేసి తొలగించుకోవడం మంచిది.

ఈ లక్షణాలు కూడా ఉంటే...

కడుపుబ్బరంగా అనిపించడం, తిమ్మిరిగా ఉండటం, డయేరియా లేదా మలబద్ధకం - వీటన్నింటితో పాటు కడుపునొప్పి ఉంటే అది ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్‌కి సూచన కావచ్చు. ఇది తరచుగా వస్తూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడంతో పాటు ఒత్తిడి కూడా తగ్గించుకోవాలి.

మెలిపెడుతున్నట్లుగా...

నెలసరి సమయంలో పొత్తి కడుపులో నొప్పి రావడం మామూలు విషయమే. అయితే పిరియడ్స్‌కి పిరియడ్స్‌కి మధ్య పొత్తికడుపులో మెలిపెడుతున్నట్లుగా నొప్పి వస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఎందుకంటే సాధారణంగా రుతుక్రమంలో భాగంగా అండాశయం కొన్ని రకాల ద్రవాలతో పాటు అండాన్ని విడుదల చేస్తుంది. ఆ సమయంలో కొంతమందికి కడుపులో నొప్పి వస్తుంది. ఇది ఒక్కోసారి ఒక్కోవైపున వస్తుంది. సాధారణంగా తీవ్రమైన నొప్పి నాలుగైదు గంటల్లోనే తగ్గిపోతుంది. నొప్పి తగ్గిపోయింది కదాని తేలికగా తీసుకోకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.

సుఖవ్యాధులకు సూచన కావచ్చు...

కటివలయం లేదా పొత్తికడుపు భాగంలో వచ్చే నొప్పి కొన్ని సందర్భాల్లో సుఖవ్యాధులకు సూచన కావచ్చు. ఈ నొప్పితో పాటు యూరిన్‌కి వెళ్లే సమయంలో నొప్పిగా అనిపించడం, నెలసరికి, నెలసరికి మధ్య రక్తస్రావం, వైట్‌డిశ్చార్జి అవుతుంటే మాత్రం తగిన చికిత్స తీసుకోవడం మంచిది. మీతో పాటు మీ భాగస్వామికి కూడా చికిత్స అవసరమవుతుంది.

కిందకి జారినట్లు ఉంటే...

వయసు పెరిగే కొద్దీ అవయవాల పటుత్వం తగ్గిపోతుంటుంది. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత లేదంటే లేటు వయసులో గర్భాశయం, మూత్రాశయం.. వంటి అవయవాల విషయాల్లో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. దీంతో అవి శరీరంలో ఉండాల్సిన ప్రదేశం కంటే కిందికి జారినప్పుడు అసౌకర్యంగా అనిపించడంతో పాటు నొప్పి కూడా వస్తుంటుంది. అలాగే పొత్తికడుపులో ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఆపరేషన్, కొన్ని వ్యాయామాల ద్వారా వాటిని తిరిగి యథాస్థానానికి తీసుకురావచ్చు.

ఈ క్రమంలో- పైన పేర్కొన్న నొప్పులతో బాధపడుతూ ఏమాత్రం అసౌకర్యంగా, అసాధారణంగా అనిపించినా ఆలస్యం చేయకుండా వెంటనే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం మాత్రం మరవద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్